వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కృష్ణా నదీ తీరాన ప్రత్యేక శనైశ్చరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ సమీపంలో శనీశ్వరునికి శనైశ్చరస్వామి దేవస్థానం పేరుతో రెండున్నర దశాబ్దాల క్రితం ఆలయాన్ని నిర్మించారు. శనీశ్వరునికి పూజలు నిర్వహించే భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతుంటారు. అటువంటి ఆలయాన్ని కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కూలగొట్టింది.
ఆ తరువాత ఆలయ నిర్మాణాన్ని విస్మరించింది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ ఆలయాన్ని అక్కడే పునఃనిర్మాణం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రూ. 2 కోట్లతో ధర్మదాయ శాఖ పరిధిలో ప్రభుత్వం భారీ నిర్మాణం పనులను చేపట్టింది. అలాగే నగరంలోని మరికొన్ని కూలగొట్టిన ఆలయాలను సైతం సీఎం ఆదేశాలతో పునఃనిర్మాణ పనులను మొదలుపెట్టారు.
ముందుకు వచ్చిన దాత
ఆలయ నిర్మాణం పూర్తిగా తానే చేపడతానని విజయవాడకు చెందిన వ్యాపారవేత్త చలవాది ప్రసాద్ ముందుకువచ్చారు. దేవదాయ శాఖ నిర్ణయించిన విధంగా ఆలయాన్ని పూర్తిగా తానే నిర్మాణం చేసి అప్పగిస్తానని తన సమ్మతిని తెలిపి పనులను ప్రారంభించారు. ఆలయంతో పాటుగా వంటశాల, గోశాల, ఆలయ కార్యాలయ నిర్మాణాలను అందులో చేపట్టనున్నారు.
శనీశ్వరునితో పాటుగా అనుబంధంగా రాహుకేతువులను సైతం ఉపాలయంగా ఏర్పాటు చేయనున్నారు. 2 అంతస్తులుగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణంలో గర్భాలయాన్ని పూర్తిగా రాతితో చేపట్టనున్నారు. గర్భాలయం నుంచి గోపురం వరకు పూర్తిగా రాతితో నిర్మించనున్నారు. అత్యంత గట్టిగా దీని నిర్మాణం జరుగుతుంది.కాగా, ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయటానికి కసరత్తు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఘంటశాల శ్రీనివాసు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment