Wat Pa Maha Chedi Kaew Temple Was Built Using Million Beer Bottles In Thailand - Sakshi
Sakshi News home page

Wat Pa Maha Chedi Kaew: 15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం

Published Sun, Jan 22 2023 11:04 AM | Last Updated on Tue, Jan 24 2023 6:06 PM

Temple Was Built Using Million Beer Bottles In Thailand - Sakshi

ప్లాస్టిక్‌తోనే కాదు, గాజుతోనూ పర్యావరణానికి ముప్పే! ప్లాస్టిక్‌ ఎంతకాలమైనా మట్టిలో కలవదు. గాజు కొంతకాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఆ లెక్కన ప్లాస్టిక్‌ కంటే గాజు మెరుగైనదే అయినా, గాజు తయారీ ప్రక్రియలో గాజును కరిగించడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఫలితంగా పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదలై, పరిసరాల్లోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్‌లాండ్‌ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సీసాల ఆలయం. 

థాయ్‌లాండ్‌లోని సిసాకేత్‌ ప్రావిన్స్‌ ఖున్‌హాన్‌ ప్రాంతంలో ఉంది ఈ సీసాల ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరుసీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీసీసాలను సేకరించి, రెండేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదేరీతిలో 2009 నాటికి ఇరవై కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే!

‘మిలియన్‌ బాటిల్‌ టెంపుల్‌’గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు ‘వాట్‌ పా మహా చేది కేవ్‌’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేది. దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్‌ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయ్‌లాండ్‌లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి, ఈ ఆలయం వద్ద నిలబడి ఫొటోలు దిగుతుంటారు.

ఎందుకు నిర్మించారంటే..?
పనిగట్టుకుని మరీ ఖాళీసీసాలతో ఆలయ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటున్నారా? నిజానికి పర్యావరణాన్ని రక్షించుకోవలసిన అవసరం తీవ్రంగానే ఏర్పడింది. చుట్టూ సముద్రతీరం ఉండే థాయ్‌లాండ్‌ బీచ్‌లలో పర్యాటకుల కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు– అంటే, 1984 నాటికి ముందు థాయ్‌ బీచ్‌లలో ఎక్కడ చూసినా వాడి పారేసిన ఖాళీ బీరుసీసాలు గుట్టలు గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్నే మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. థాయ్‌ ప్రభుత్వానికి కూడా ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. సముద్రం కలుషితం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది.

అయితే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీసీసాలను ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి’ అని ప్రజలను కోరింది. బౌద్ధభిక్షువులను కూడా ఇదే కోరిక కోరింది. ప్రభుత్వం పిలుపుతో బౌద్ధభిక్షువులు ముందుకొచ్చారు. ‘ఖాళీసీసాలను మాకిచ్చేయండి. మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం’ అని అడిగారు. ‘ఇవ్వడమేంటి? తీరానికి వెళ్లి మీరే కావలసినన్ని సీసాలను తీసుకెళ్లండి’ అని బదులిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధభిక్షువుల వల్ల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి, సీసాల సేకరణ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. 

ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. ‘పరిశుభ్రతే పరమాత్మ. అందువల్ల అందరూ తలా ఓ చెయ్యి వేసి, దైవకార్యానికి మీ వంతు సహాయం చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కలసిరండి. పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి’ అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన మొదలయ్యింది. ఒక్కొక్కరే సీసాలు సేకరించి, ఆలయానికి ఇవ్వసాగారు.

థాయ్‌ తీరంలో నెమ్మదిగా సీసాల గుట్టలు తరిగిపోసాగాయి. అలాగే ఆలయ నిర్మాణం వేగం పుంజుకుంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది. వనరుల పునర్వినియోగానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ.
- దినేష్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement