మహా కుంభమేళా
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం...
సాంస్కృతిక–సామాజిక మేలుకలయిక
దాదాపుగా 40కోట్లమంది పుణ్యస్నానాలు...
నాగసాధువుల ప్రత్యేక ఆకర్షణ.
ప్రయాగ ప్రత్యేకత
మకరే యే దివానాథే వృషగే చ బృహస్పతౌ ‘
కుంభయోగో భవేత్తత్ర ప్రయాగే చాతిదుర్లభః ‘‘
అంటే మాఘ అమావాస్యనాడు బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభపర్వం జరుగుతుంది. (prayaga)ప్రయాగలో మూడు కుంభస్నానాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి కుంభస్నానం (makara sankranti)మకర సంక్రాంతి నుండిప్రారంభమవుతుంది. రెండవ స్నానం మౌని అమావాస్య నాడు జరుగుతుంది. మూడవ స్నానం వసంత పంచమి రోజున జరుగుతుంది. ఈ మూడింటి కలయికే (kumbh mela)’కుంభమేళా’.
నీటి నుంచే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడట సృష్టికర్త. అందుకేప్రాణులన్నింటికీ నీరు తల్లిలాంటిదని చెబుతున్నాయి పురాణాలు. ఆ నీరే గలగలా పారే నదులుగా దర్శనమిస్తోంది. నదుల వల్లనే నాగరికతలు ఏర్పడ్డాయి. మనిషి మనుగడకు, సంస్కతి సాంప్రదాయాలకు, వైభవానికి నదులు సాక్షిభూతంగా నిలిచాయి. వేదభూమిగా పిలిచే ఈదేశంలో ప్రవహించే నదులు తీర్థము అనే పేరుతో దైవస్వరూపాలుగా వర్ణించబడి, గంగా గోదావరి నర్మదా కావేరి మొదలైన పేర్లతో గౌరవింపబడుతున్నాయి. అలాంటి తీర్థాలెన్నో ఈ భూమిపై ప్రవహిస్తూ ఈ భూమిని దివ్యభూమిగా మారుస్తున్నాయి.
తీర్థం అంటే పుణ్యమైన, లేదా పవిత్రమైన నీరు అని అర్థం. అటువంటి తీర్థాలని సేవించి వాటిలో స్నానం చేస్తే పాలు తొలగి అంతఃకరణ శుద్ధి కూడా కలుగుతుంది. తీర్థాలన్నింటిలోకీ ప్రధానమైనది గంగానది. గంగానదిని తలిచినా చాలు... సకల పాలు తొలగుతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. నదీజలాల్లో అమతత్వం ఉందని అవి రోగాలను నివారించి దీర్ఘాయుష్షును కలిగిస్తాయని యజుర్వేదంలో చెప్పబడింది.
‘ఓ జలమా! పవిత్రమైన నీటితో మాకు తప్తి కలిగించు’’ ‘‘అఫ్స్వంతరమత మఫ్సుభేషజం’’ అంటూ ప్రార్థించడం ఈ వేదంలోని పవిత్రభావన. నదీ స్నానంవల్ల శారీరక శుద్ధి, ఆయుర్వృద్ధి కలుగుతాయి.
మహాకుంభమేళా అంటే?
దేవతలు–రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకగా అందులోనుంచి అమతం పుట్టింది. శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం ధరించి దేవతలకు అమతాన్ని పంచుతున్నప్పుడు దానినుంచి నాలుగు చుక్కలు హరిద్వార్‌లోని గంగానదిలో, ఉజ్జయినిలోని క్షి్రపా నదిలో, నాసిక్‌లోని గోదావరిలో, ప్రయాగలోని త్రివేణి సంగమంలో పడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం సూచించిన కొన్ని ప్రత్యేకమైన రోజులలో, ఆయా ప్రదేశాలలోని నదుల్లో స్నానం చేయడం వల్ల మనం కూడా అలా పడ్డ ఆ అమతత్వాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు. ఆ ప్రత్యేకమైన రోజులకే కుంభమేళ అని పేరు. కుంభమేళా సమయంలో అమృతస్నానం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఋగ్వేదంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది.
దాస్యవిముక్తికి...
అమృతబిందువులు నేలపై పడటం వెనుక మరో పురాణకథనం కూడా ఉంది. గరుత్మంతుడు తన తల్లి దాస్యవిముక్తికోసం అమృతాన్ని తేవలసిన అవసరం ఏర్పడింది. అలా అమృతాన్ని తెస్తున్న మార్గంలో నాలుగుచుక్కలు ఆ అమృతభాండం నుంచి నేలజారి నాలుగు పుణ్యతీర్థాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలలోనే కుంభమేళాలను ఆచరిస్తున్నారు.
విస్తృత ఏర్పాట్లు– స్థానికులకు ఉపాధి
ప్రపంచం వ్యాప్తంగా కుంభమేళాకు తరలివస్తున్న ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరినీ దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక వసతులతో ఏకంగా ఒక టెంట్ గ్రామాన్ని ఏర్పాటు చేసింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అందులోకి ప్రవేశిస్తే చాలు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి కళ్ళ ముందర నిలబడుతుంది.
అనేక ఆధ్యాత్మిక సంస్థలు అక్కడికి వచ్చినటువంటి వారందరికీ లోటు లేకుండా ఉచితంగా అన్న ప్రసాదాలను అందజేస్తూ భక్తుల ఆకలిని తీరుస్తున్నాయి.
ఆధ్యాత్మికతోపాటు ఆర్థిక పరిపుష్టిని కూడా కలిగించనుంది కుంభమేళ. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా కోసం సుమారుగా 7,500 కోట్లతో ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా కుంభమేళా జరిగినన్ని రోజులు సుమారు 2లక్షల కోట్ల మేర వ్యాపారం జరగనుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. దీని ద్వారా 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
కుంభమేళా టెంట్ గ్రామంలోకి ప్రవేశించినప్పటి నుండి వయోవద్ధులను, నడవలేని వారిని స్నాన ఘాట్ ల వరకు చేర్చేందుకు, నదీ మధ్యలోకి వెళ్లి వద్దకు వెళ్లి స్నానం చేయడానికి పడవ వారికి, తినుబండారాల దుకాణాల వారికి యాత్రికులద్వారా ఆదాయం కూడా బాగా సమకూరుతోంది.
యాత్రికుల భద్రత –పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. కోట్ల కొద్ది జనం వస్తోన్నా పరిశుభ్రత విషయంలో ఇబ్బందులేమీ లేవని కుంభమేళాకు వెళ్లి స్నానం చేసిన వారు చెబుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో పర్యవేక్షణ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని వారంతా సంతోషం వెలిబుచ్చుతున్నారు.
జలమార్గాన్నీ క్రమబద్ధీకరిస్తోంది
సంగమ స్థలం వరకు ప్రయాణించే పడవల విషయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. బోట్లతో నిరంతరం పోలీసులు నదిలో పహార కాస్తు నదిలో పడవలు బోట్లు జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ట్రైన్లు విమానాలు బస్సులు అన్నింటిలోనూ టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో సొంత ఏర్పాట్లతో కుంభమేళాకి వెళుతున్న వారికి తగినట్టుగా పార్కింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఆనందకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభూతితో కొత్త విషయాలను తెలుసుకున్నామన్న సంతప్తితో భక్తులు తిరుగు ప్రయాణమవుతున్నారు
→ కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి?
కార్తీకమాసంలో వెయ్యిసార్లు గంగాస్నానం, మాఘమాసంలో వందసార్లు గంగాస్నానం, వైశాఖంలో నర్మదానదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ప్రయాగలో కుంభమేళా జరిగే సమయంలో ఒక్కసారి స్నానంచేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాందపురాణం చెబుతోంది.
→ నాగసాధువులు
ఆది శంకరాచార్యులవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధు,సంతు సమాజమును ఒక్క చోటికి చేర్చి,13 అఖారాలను ఏర్పరిచి సనాతన ధర్మరక్షక వ్యవస్థను ఏర్పరిచారు. తరువాత కాలములో అనేక ధర్మాచార్యులు ఈ వ్యవస్థను దశదిశలా విస్తరింపజేసారు. అటువంటి సాధువులలో కొందరిని నాగసాధువులని పిలుస్తారు. వీరు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరికి శరీరంతో తాదాత్మ్యం ఉండదు. మనం జీవిస్తున్న సమాజానికి అతీతంగా ఉండే ఆ యోగుల తత్త్వం మనకు అంతుపట్టదు. అందుకే వారు మనకు సాధారణ సామాజిక జీవితంలో ఎదురుపడరు.
→ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి?
భక్తితో గంగను తలచుకుంటూ నదిలో మూడు మునకలు వేయాలి. పవిత్రమైన నదిని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్నానం తరువాత దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలి.
→ కుంభమేళాకి పోలేనివారికి...
పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం కుంభమేళాలో చేసే పవిత్ర స్నానవిశిష్టతను ఎంతో కీర్తించాయి. అయితే ఆరోగ్యరీత్యా, వయోభారంవల్ల అక్కడికి పోలేనివారు అక్కడినుంచి తెచ్చిన నీటిని తాము స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. అదీ కుదరకపోతే తామున్న చోటే గంగానదీ పేరును తలచుకుని స్నానం చేయవచ్చు.
ఐక్యత మరియు ఏకత్వాల పండుగ కుంభమేళా. శాశ్వతమైన, అనంతమైన దివ్య స్వభావాన్ని కుంభమేళాలో అనుభవించగలం. నదీ ప్రవాహంలాగే జనప్రవాహం కూడా కుంభమేళా వైపు సాగి సముద్రంలో నదులు సంగమించినట్టు వివిధ ప్రదేశాలవారు ఏకమయ్యే సంగమస్థలం కుంభమేళా.
→ అందరి చూపు–కుంభమేళా వైపు
గత కొద్ది రోజులుగా ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళా భారతదేశంలోని ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజల దష్టిని ఆకర్షిస్తోంది. పలు మతాలకు చెందినవారు కుంభమేళా కోసమే ఇక్కడికి వచ్చి, పవిత్ర స్నానం చేసి ఆనందపరవశులవుతున్నారు. భారతీయ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతున్నారు.
స్టీవ్ జాబ్స్ భార్య కుంభమేళాపై ఆసక్తితో కుంభమేళాలో ఉండే గురువులు సాధువుల వద్ద సనాతన ధర్మంలోని పలు అంశాలనుతెలుసుకుంటూ మోక్షమార్గాన్ని అన్వేషిస్తున్నారు. ఎంతోమంది విదేశీ పరిశోధకులు ఈ కుంభమేళాను ఆసక్తితో గమనిస్తున్నారు.
→ ఆధ్యాత్మిక ప్రపంచం
ప్రపంచం నలుమూలల నుంచి చేరుతున్న జన సందోహంతో అక్కడ నూతన ప్రపంచం ఏర్పడింది. కుంభమేళా కి వచ్చినవారు ముఖ్యంగా యువతరం ఈ వాతావరణాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆసక్తిగా అనేక అంశాలను తెలుసుకుంటున్నారు యువత.
నాలుగు రకాల కుంభమేళాలు
4 సం.ల కొకసారి జరిగేది – కుంభమేళా
6 సం.ల కొకసారి జరిగేది – అర్ధ కుంభమేళా
12 సం.ల కొకసారి జరిగేది – పూర్ణ కుంభమేళా
12 సం.ల కొకసారి జరిగే పూర్ణ కుంభమేళాలు
12 సార్లు పూర్తయితే (144 సం.లకు) – మహా కుంభమేళా.
ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ నాలుగు కుంభమేళాలు జరుగుతాయి. బహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, కుంభ రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో, సింహ రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని మరియు నాసిక్‌లో కుంభమేళాలు జరుపుకుంటారు.
– అప్పాల శ్యాంప్రణీత్ శర్మ
వేద పండితులు
Comments
Please login to add a commentAdd a comment