ఆదివారం 1.25 కోట్ల మంది
మహాకుంభ్ నగర్: మౌనీ అమావాస్య దగ్గర పడుతుండటంతో మహాకుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం, శనివారం ఏకంగా 1.25 కోట్లకుపైగా జనాలు త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నంనాటికే 1.17 కోట్ల మంది పవిత్ర స్నానాలుచేశారని అధికారులు చెప్పారు.
జనవరి 29వ తేదీన మౌనీ అమావాస్య రోజు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీప రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, జాతీయరహదారులు కిక్కిరిసిపోయాయి.
మౌనీఅమావాస్య రోజున 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయొచ్చని అంచనావేస్తున్నారు. భక్తులు నడిచే వచ్చేందుకు అనువుగా వాహనాలను చాలా దూరంలోనే ఆపేస్తున్నారు. ప్రతిచోటా ‘నో వెహికల్’ జోన్ ప్రకటించారు. ఎక్కువ మంది భక్తులు పోటెత్తితే ప్రమాదం జరక్కుండా ఉండేందుకు మరో వరస బ్యారీకేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. అమృత్‌స్నాన్ నేపథ్యంలో స్నానానికి వెళ్లేవాళ్లు, తిరిగొచ్చే వాళ్లకు ఇబ్బంది రాకుండా అదనపు ఏర్పాట్లూ చేస్తున్నారు.
ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను క్రియాశీలం చేశారు. ఇసకేస్తే రాలనంత జనం పోగుబడే చోట అత్యయక స్పందనా దళాలను రంగంలోకి దింపారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను పటిష్టంచేశారు. నడిచేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా చిన్నపాటి తాత్కాలిక దుకాణాలు తెరిస్తే వెంటనే మూయించేస్తున్నారు.
ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కుదిరినంత వరకు సమీప పార్కింగ్ ప్రాంతాలకు వాహనాలను అనమతించి, ఆ తర్వాత దూరంగా ఉన్న ప్రత్యామ్నాయ పార్కింగ్ జోన్లకు వాహనాలను తరలిస్తున్నారు. భక్తులు త్రివేణి సంగమ స్థలిలో గందరగోళ పడకుండా అదనంగా మరో 2,000 మార్గసూచీ బోర్డ్‌లను ఏర్పాటుచేశారు.
మహాకుంభమేళా సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ఏఐ చాట్‌బాట్‌ను స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని అక్కడి యంత్రాంగం భక్తులను ప్రోత్సహిస్తోంది. సరైన మార్గం చూపేందుకు సహాయక సిబ్బంది అనుక్షణం అందుబాటులో ఉంటున్నారు. ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పుణ్యస్నానంచేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులంతా పుణ్యస్నానాలు చేయడంతోపాటు ఒకరిపై మరొకరు నీళ్లు చిమ్ముకుంటూ వాటర్ గేమ్స్ ఆడుతున్నారు. జనం ఇక్కడికొచ్చేది భక్తిశ్రద్ధలతో. మీలా ఆటలాడటానికి కాదు’’ అని చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment