2 లక్షల టెంట్లతో నిర్మాణం
సాధారణుల నుంచి సంపన్నుల దాకా ఏర్పాట్లు
కుంభమేళాకు పోటెత్తే కోట్లాది భక్తులకు బస, ఏర్పాట్లు చేసే సామర్థ్యం ప్రయాగ్‌రాజ్‌లోని హోటళ్లకు లేదు. ఆ అవసరాలు తీర్చే ఏకైక చిరునామాగా ‘టెంట్ నగరి’ నిలిచింది. లక్షలాది టెంట్లు ఆతిథ్యానికి సిద్ధమయ్యాయి.
సకల సౌకర్యాల శిబిరాలు
ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదీ తీర ఇసుక తిన్నెలు ఇప్పుడు ఆధునాతన టెంట్‌లుగా రూపాంతంరం చెంది ఎండా, వాన నుంచి భక్తులకు రక్షణగా నిలిచాయి. పది అడుగుల ఎత్తయిన కర్రలను ఈ టెంట్‌ల నిర్మాణం కోసం వాడారు. మొత్తంగా 68 లక్షల చెక్క కర్రలు, 100 కిలోమీటర్ల పొడవైన వస్త్రం, 250 టన్నుల బరువైన సీజీఐ(ఇనుప) రేకులతో ఈ టెంట్‌లను నిర్మించారు. గత కొన్ని నెలలుగా నిరాటంకంగా ఏకంగా 3,000 మంది కారి్మకులు అవిశ్రాంతంగా కష్టపడి ఈ టెంట్ నగరానికి తుదిరూపునిచ్చారు. వర్షం, గాలులను తట్టుకునేలా టెంట్‌లను పటిష్టంగా నిపుణులు నిర్మించారు. ఒకేసారి 20 లక్షల మందికి బస సౌకర్యం కల్పించేలా ఎక్కువ టెంట్లను కట్టారు.
విభిన్న సౌకర్యాల మహాకుంభ గ్రామం
టెంట్ సిటీలో అన్ని ఒకే తరహా టెంట్‌లు ఉండవు. సాధారణ భక్తుడు మొదలు సంపన్న భక్తుడి దాకా ప్రతి ఒక్కరికి వారి వారి తాహతుకు తగ్గట్లు విభిన్న టెంట్లను నెలకొల్పారు. డిమాండ్, భక్తుల రద్దీని బట్టి మరిన్ని టెంట్‌లను నిర్మించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లుచేస్తోంది. భారతీయ రైల్వే వారి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) వారు భక్తుల కోసం మహాకుంభ్ గ్రామ్ పేరిట ప్రత్యేక టెంట్‌లను నిర్మించింది. ఇవి త్రివేణి సంగమం నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిల్లో సూపర్ లగ్జరీ టెంట్లు, విల్లాలు ఉన్నాయి. విడిగా స్నానాల గది, చల్లటి, వేడి నీళ్లు, ఎయిర్ బ్లోయర్, మంచాలున్నాయి. అల్పాహారం, భోజన సదుపాయాలూ కల్పిస్తున్నారు. టెలివిజన్ ఏర్పాట్లూ చేశారు. ఆర్‌ఐసీటీసీ ద్వారా ఈ టెంట్లను బుక్ చేసుకోవచ్చు. రోజుకు రూ.18,000 నుంచి రూ.20,000 వసూలుచేస్తారు.
ప్రీమియం టెంట్లూ ఉన్నాయ్
ఖరీదైన పరుపులతో సిద్ధంచేసిన మంచాలు, రాత్రిళ్లు బోగిమంటల్లా చలికాచుకోవడానికి ఏర్పాట్లు, ఆధ్యాతి్మక బోధనలు వినేందుకు విడిగా ఏర్పాట్లూ ఈ ప్రీమియం టెంట్‌ల వద్ద ఉన్నాయి. ప్రాచీన మత విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలు, ఆధునికత మేళవింపు ఈ సంగమస్థలిలో కనిపిస్తుంది. వీటిలో శాకాహార భోజన ఏర్పాట్లు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, బెంగాళీ, అస్సామీ, మరాఠీ, హిందీ సహా ఇంగ్లిస్ వంటి పది భాషల్లో సమాచారాన్ని పొందొచ్చు
ఉచితంగానూ ఇస్తారు
సర్వోదయ మండలి వంటి సంస్థలు పేద భక్తుల కోసం ఉచిత బస వసతులనూ ఈ టెంట్లలో కల్పిస్తున్నాయి. గరిష్టంగా 30 మంది ఈ భారీ టంట్లను తాత్కాలికంగా కొంతసమయం మాత్రం ఉండేందుకు అనుమతిస్తారు. పోటెత్తే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, తర్వాతి పేద భక్తులకూ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తక్కువ సమయం మాత్రమే బస వసతి కల్పిస్తారు.
ఎంతో సౌకర్యవంతం
‘‘40 ఏళ్లుగా ప్రతి పుష్కరాల్లోనూ టెంట్ సిటీకి వచ్చా. అప్పుట్లో కేవలం టెంట్ల కింద ఇసుకపైనే నిద్రించేవాళ్లం. ఇప్పుడు చాలా సౌకర్యాలు పెంచారు. టీవీ, వై–ఫై, డ్రోన్లు, నిఘా కెమెరాలు, అసలు మనం ఎక్కడ ఉన్నామని లొకేషన్ తెలిపే క్యూఆర్ కోడ్ స్కాన్ ఫ్లెక్సీ బ్యానర్లు, నిరంతరం పోలీసు గస్తీ.. ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. భద్రంగా, భక్తితో, చక్కటి భోజనాలతో కుంభమేళా యాత్ర పూర్తిచేయడంలో ఈ టెంట్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి’’ అని రాజస్తాన్‌కు చెందిన వృద్దురాలు కల్పవాసీ అన్నారు.
రూ. 3,000 నుంచి 1లక్ష దాకా!
టెంట్ సౌకర్యంతోపాటు అక్కడి పలు ఘాట్‌ల వరకు తీసుకెళ్లడం, టూర్ గైడ్, పడవ ప్రయాణం, దగ్గరి పుణ్యక్షేత్రాల సందర్శన తదితరాలతో కలిసి పలు రకాల ప్యాకేజీలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. రూ.3,000 నుంచి మొదలు ఏకంగా రూ.1లక్ష దాకా ‘టెంట్ కమ్ టూర్’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. లాలూజీ అండ్ సన్స్ సంస్థ ఇందులో 104 ఏళ్ల అనుభవం గడించింది. ‘‘పుష్కరాల కోసం మా ఏర్పాట్లు 18 నెలల నుంచే మొదలవుతాయి. టెంట్ అంతర్గత సౌకర్యాల కోసం కాటన్, టెరీ కాటన్ వాడతాం. బయటివైపు చిరిగినా వర్షపు నీరు లోపలికి రాకుండా పాలిథీన్‌తో కుట్టేస్తాం. మంచాలు, కురీ్చలు, టీవీ స్టాండ్ ఇతర సౌకర్యాలు సమకూరుస్తాం’’ అని సంస్థ నిర్వాహకుడు దీపాన్షు అగర్వాల్ చెప్పారు. ‘‘పూర్వం రోజుకు రూ.10 వేతనం దక్కేది. ఇప్పుడు రూ.500 పైనే చేతికొస్తున్నాయి. డబ్బుల కంటే భక్తుల కోసం పని చేస్తున్నామన్న తృప్తి మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది’’ అని టెంట్ల నిర్మాణంలో పనిచేసే రోజువారీ కారి్మకుడు 68 ఏళ్ల రఘునాథ్‌ను చెప్పుకొచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment