
తండ్రి మాటను జవదాటని తనయుడు, సోదరులను అభిమానించిన అన్న, ఆలిని అనునిత్యం మనుసులో నిలుపుకున్న భర్త, స్నేహధర్మాన్ని పాటించిన మిత్రోత్తముడు. ఈ బంధాలు ఎన్ని ఉన్నా... ధర్మం తప్పకుండా ప్రజల కోసమే నిరంతరం పాటుపడిన ప్రభువు. మొత్తంగా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడని రామాయణ మహాకావ్యం చెబుతోంది. మహావిష్ణువు అవతారమే అయినప్పటికీ ఎక్కడా మహిమలు చూపలేదు. మాయలు చేయలేదు. ముమ్మూర్తులా మానవుడిలాగే వ్యవహరించాడు. మానవులలాగే కష్టాలననుభవించాడు. నిందలు మోశాడు. బాధలు పడ్డాడు.
చిన్న చిన్న సంతోషాలనూ, సరదాలనూ కూడా మామూలు మనుషులలాగే అనుభవించాడు. అయితే ఎక్కడా ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు. ఆపత్సమయంలోనూ ధర్మాన్నే అనుసరించాడు. ధర్మాన్నే ఆచరించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ధర్మమంటే ఇదే అన్నట్టుగా ప్రవర్తించాడు. రాముడు అనుసరించిన మార్గం కనుకనే ఆయన చరితామృతానికి రామాయణమనే పేరు వచ్చింది.
షోడశ మహాగుణ సంపన్నుడు
వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడి లక్షణాల గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపాడు. పితృవాక్పాలకుడిగా పేరు పొందాడు. తండ్రి దశరథుడి మాటను ఎన్నడూ జవదాటలేదు. కన్నతల్లి కౌసల్యతో సమానంగా సవతి తల్లులైన సుమిత్రతోనూ, తనను అడవులకు పంపిన కైకతోనూ కూడా ప్రియంగానే మెలిగాడు.
సోదర ప్రేమకు పెట్టింది పేరు
సోదర ప్రేమ రాముని చూసి నేర్చుకోవలసిందే. తమ్ముడు లక్ష్మణుని ఎంతగానో ప్రేమించాడు. కొద్దిపాటి దుడుకు స్వభావి అయినప్పటికీ అతడిని ఏనాడూ పల్లెత్తు మాటనలేదు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛిల్లితే ఒక అతి సాధారణమైన అన్నయ్యలాగే తల్లడిల్లాడు. తమ్ముణ్ణి తిరిగి మామూలుగా చూసేంత వరకు స్థిమిత పడలేకపోయాడు. భరతునితో కూడా ఎంతో వాత్సల్యంతో మెలిగాడు.
తాను వనవాసం పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు తాను వస్తున్న వార్తను భరతుడికి చేరవేసి, అతడి ముఖ కవళికలలో ఏమైనా మార్పు వచ్చిందేమో జాగ్రత్తగా గమనించి తనకు చెప్పమంటూ నమ్మిన బంటు హనుమను అందుకు నియోగించాడు. ఒకవేళ భరతుడు గనక రాజుగా ఉండేందుకు ఇష్టపడితే అందుకు తానేమీ అడ్డుపడదలచుకోలేదు. అంతేకాదు, శత్రుఘ్నుని కూడా అమితంగా ప్రేమించాడు. లవణాసురుడనే రాక్షసుని వధకు శత్రుఘ్నునే నియోగించాడు. అతడు జయించిన రాజ్యాన్ని అతడికే అప్పగించాడు. అందుకే ఆదర్శవంతులైన అన్నదమ్ములను రామలక్ష్మణుల్లా ఉన్నారంటారు.
మర్యాదా పురుషోత్తముడు
శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు. అహంకారం లేని వాడు. అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడి పాద స్పర్శతో అయోధ్యా నగరం పావనమైంది. అడవులు ధన్యమైనాయి.
ఆత్మశతృవుని అధిగమించాడు
కామం, కోపం, అత్యాశ, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని రామాయణం రుజువు చేస్తుంది.
ఏక పత్నీవ్రతుడు
నేటి సమాజంలో ఒక భార్యను కలిగి ఉండటం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. మనసావాచా కర్మణా ప్రేమించిన సీతాదేవిని తప్ప మరొక మహిళ వంక కన్నెత్తి చూడలేదు. ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు.
స్మిత పూర్వభాషిగా శ్రీరాముడికి పేరు. అంటే అవతలి వారు తనను పలకరించేవరకు వేచి చూడాలని అనుకోడు. ముందుగా తానే వారిని మాట్లాడించేవాడు. అంతటి మర్యాదా పురుషోత్తముడు. అటువంటి ఆదర్శమూర్తి, ధర్మప్రభువు... ఆయన నడయాడిన పుణ్యపుడమిగా పేర్కొంటున్న అయోధ్యలో బాల రాముడిగా నేడు విగ్రహ రూపంలో కొలువుతీరనున్నాడు. ఈ శుభ సందర్భంలో ఆ జగదానంద కారకుడికి జేజేలు చెబుదాం...
– డి.వి.ఆర్.