Ram janmabhoomi temple
-
అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీరాముడు జగదానందకారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్‌లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్‌లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది. తీవ్రమైన చలి గజగజా వణికిస్తున్నా భక్తులు రామ్‌లల్లా దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్‌పథ్ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్‌లల్లా సందర్శకుల కోసం నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలోనూ ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. -
రామ్‌లల్లా దర్శన సమయాల్లో మార్పులు
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువైన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి నుండే గజగజ వణికిస్తున్న చలిలో సైతం క్యూలలలో వేచివుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు రామ్‌లల్లాను చూసేందుకు, పూజలు చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని ట్రస్ట్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ సమాచారాన్ని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మీడియాకు అందించింది. ఇది కూడా చదవండి: అయోధ్య రామ భక్తులకు శుభవార్త విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రామ భక్తులకు ఇకపై దర్శనానికి మరో గంట సమయం అదనంగా లభిస్తుందన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ్‌లల్లా హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు.. మంగళ హారతి: ఉదయం 4.30 గంటలకు ఉత్థాన్ హారతి : ఉదయం 6.30 గంటలకు దర్శనం: ఉదయం 7 గంటల నుంచి భోగ్ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు సాయంత్రం హారతి: 7.30 గంటలకు రాత్రి భోగ్ హారతి: 9 గంటలకు శయన హారతి: రాత్రి 10 గంటలకు -
అయోధ్య రామ భక్తులకు శుభవార్త
దేశంలోని రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయం నిర్మితమయ్యింది. లక్షలాది భక్తులు రాములోరిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే వారు అక్కడ సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇకపై ఇటువంటి సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది. అయోధ్య ధామ్‌లో భక్తుల కోసం 158 కొత్త హోటళ్లను నిర్మించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ హోటళ్లను వీలైనంత త్వరగా నిర్మించనున్నారని సమాచారం. ఈ ఏడాది ఎనిమిది వేల గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి పర్యాటకులకు 175 హోటళ్లు, అతిథి గృహాలు, డేరా సిటీలలో 30 వేల మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన 158 కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య ధామ్‌లోని హోటళ్లు, అతిథి గృహాల సంఖ్య 333కి పెరగనుంది. ఇది కూడా చదవండి: తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు! యూపీ పర్యాటక మంత్రిత్వ శాఖ అయోధ్యలో నిర్మిస్తున్న హోటళ్లను కాంస్య (ఒక నక్షత్రం), వెండి (రెండు నక్షత్రాలు), బంగారం (త్రీ స్టార్), డైమండ్ (నాలుగు నక్షత్రాలు), ప్లాటినం (ఫైవ్ స్టార్)గా వర్గీకరించే సదుపాయాన్ని కూడా కల్పించింది. కొత్త టూరిజం పాలసీ ప్రకారం నూతనంగా నిర్మితమవుతున్న ఈ హోటళ్లకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల్లో 50 శాతం వరకు రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. జనరల్ కేటగిరీకి 25 శాతం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలకు 30 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ హోటళ్ల నిర్మాణం పూర్తికానున్నదని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ తెలిపారు. -
తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు!.. మూడో రోజు సజావుగా దర్శనాలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన రెండవరోజున(బుధవారం) దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. మంగళవారం(తొలిరోజు) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆకస్మిక పర్యటన, సూచనల ప్రభావం బుధవారం కనిపించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బాలక్ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు. మొదటి రెండు రోజులు భక్తుల రద్దీతో అనేక ఇబ్బుందులు తలెత్తాయి. ఈ నేపద్యంలో ట్రస్ట్ పలు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఆలయంలో భక్తుల దర్శనాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. రామభక్తుల దర్శనాలు నిరంతరం కొనసాగుతున్నాయి. బాలరాములోరికి భక్తులు కానుకలు, విరాళాలు విరివిగా సమర్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న భక్తుల వరద ప్రాణప్రతిష్ఠ జరిగినంతనే ఐదేళ్ల బాలరాముడు కోటీశ్వరునిగా మారిపోయాడు. తొలిరోజు శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలను సమర్పించారని ట్రస్ట్ తెలిపింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళవారం ఆలయంలోకి సామాన్య భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. రామాలయానికి వచ్చిన సందర్శకుల సంఖ్యకు సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం వారు నానా అవస్థలు పడ్డారు. రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులు విరాళాలు సమర్పించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ మంగళవారం ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయి. ఆన్లైన్లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారన్నారు. కాగా అయోధ్యకు తరలివచ్చే భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా విరాళాలు అందించవచ్చు. ఆలయంలోని హుండీలలో కూడా విరాళాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. -
తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!
అయోధ్య నగరి త్రేతాయుగాన్ని తలపిస్తోంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రాజభవనంలో ఆశీనులు కాగా, లక్షలాది మంది రామభక్తులు ఆయన దర్శనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. బాలరాముడు అద్భుతమైన భవనంలో కూర్చుని, భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. తొలిరోజు రామ్‌లల్లా దినచర్య ఎలా గడిచిందంటే.. నూతన రామాలయంలో శ్రీరాముడు ఐదేళ్ల చిన్నారి రూపంలో కొలువయ్యాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరామునికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరామునికి ఐదు హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలిరోజు రామ్‌లల్లా రెండు గంటలపాటు కూడా గంటలు నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిముషాలు మాత్రమే రామ్‌లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి. రామమందిరం ప్రధాన పూజారి ఆచార్ సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ‘రాముడు తన భవ్యమైన భవనంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. త్రేతాయుగం మళ్లీ ప్రారంభమైనట్లుంది. ఐదేళ్ల రూపంలోని బాలరాముని విగ్రహం చూడగానే ఉప్పొంగిపోయాను. తొలిరోజు బాలరాముడు రెండు గంటలపాటు నిద్రించాల్సి ఉండగా, భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం 15 నిమిషాల తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సి వచ్చింది. లక్షలాది మంది రామభక్తులు నిరంతరం బాలరాముని సందర్శించుకుంటున్నారు’ అని అన్నారు. -
అయోధ్యలో మరో 13 నూతన ఆలయాలు
అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు. అయోధ్యను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనిలో భాగంగా 13 నూతన ఆలయాలను నిర్మించనున్నారు. వీటిలోని ఆరు ఆలయాలు ప్రధాన మందిర సముదాయం లోపల, ఏడు ఆలయాలు వెలుపల నిర్మితం కానున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. ప్రధాన ఆలయాన్ని పూర్తి చేసే పనులతో సహా అన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రధాన ఆలయంలో మొదటి అంతస్తు వరకూ మాత్రమే నిర్మాణం పూర్తయ్యిందని, రెండో అంతస్తు పనులు జరుగుతున్నాయని, అనంతరం శిఖరం, మధ్య గోపురం పనులు జరగాల్సి ఉందని గిరీజీ వివరించారు. రాముని కుటుంబానికి చెందిన ఐదు ప్రధాన ఆలయాల పనులు కొనసాగుతున్నాయని, రాముడు స్వయంగా విష్ణువు అవతారం అయినందున గణపతి, శివుడు, సూర్య దేవుడు, జగదంబ ఆలయాలు కూడా నిర్మితం కానున్నాయని తెలిపారు. ప్రధాన ఆలయానికి నలు మూలల్లో ఈ ఆలయాలు ఉండనున్నాయి. హనుమంతునికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీతా రసోయి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం నిర్మితం కానుంది. ఆలయ సముదాయం వెలుపల వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, జటాయువు తదితర ఆలయాలు నిర్మించనున్నారు. -
Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట అనంతరం రెండో రోజు.. నేడు (బుధవారం) బాలక్ రామ్ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అంటే (నిన్న) మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆలయాన్ని ఉదయం ఏడు గంటలకు తెరవనుండగా, తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు బారులు తీరారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మర్నాడు అంటే మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. భద్రతా ఏర్పాట్లు సజావుగా సాగేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా మంగళవారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని సీఎం కోరారు. #WATCH | Ayodhya, Uttar Pradesh: On the second day after the Pran Pratishtha, devotees gather in huge numbers at Rampath to have darshan of Shri Ram Lalla pic.twitter.com/JMI3AvYPca — ANI (@ANI) January 24, 2024 ఇకపై రామాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతర దర్శనం ఉంటుందని జిల్లా యంత్రాంగం, శ్రీరామజన్మభూమి ట్రస్టు తెలిపింది. అయితే హారతి, భోగం కోసం సమయంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది. ప్రాణ ప్రతిష్ట అనంతరం సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించగా, తొలిరోజైన మంగళవారం నాడు ఐడు లక్షల మందికిపైగా భక్తులు తమ బాలరాముని దర్శించుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం ఇప్పటికే 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం క్యూలో ఉన్నారు. నేటి ఉదయం ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఈ నేపధ్యంలో పోలీసులు, ఆలయ నిర్వాహకులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
తొలుత ఎంపిక చేసిన విగ్రహం ఇదే..
పుణ్యక్షేత్రమైన అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. రామ మందిరంలో కొలువైన బాలరాముడు భక్తులను మైమరపిస్తున్నాడు. రామ్‌లల్లా విగ్రహంలోని కళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు. తరువాత ఆలయంలో ప్రతిష్ఠాపనకు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. అయితే చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నివాసి సత్యనారాయణ పాండే శిల్ప కళాకారునిగా ఎంతో పేరొందారు. తరతరాలుగా వారి కుటుంబం విగ్రహాలను తయారు చేస్తోంది. సత్యనారాయణ పాండే రామ్‌లల్లా విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తీర్చిదిద్దారు. తొలుత ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్ట్ భావించిందట. ఈ విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉంది. దీనిని ఎక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించేదీ ట్రస్ట్ త్వరలో వెల్లడించనుంది. జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. -
ప్రాణ ప్రతిష్ఠ వేళ.. సీతారాముల జననం!
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున నెలలు నిండిన పలువురు గర్భిణులు శిశువులకు జన్మనిచ్చేందుకు ప్లాన్ చేసుకుని, వైద్యుల సాయంతో డెలివరీలు చేయించుకున్నారు. ఈ సమయంలో పుట్టిన చిన్నారులకు అబ్బాయి అయితే రాముడు అని, అమ్మాయి అయితే సీత అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం 13 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఎనిమిది మంది నార్మల్ కాన్పులో జన్మించగా, ఐదుగురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జన్మించారు. జనవరి 22న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జిల్లా మహిళా ఆస్పత్రిలో మొదటి శిశువు జన్మించింది. బర్కచ్చా ఖుర్ద్‌లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ భార్య అంజలి బాలికకు జన్మనిచ్చింది. తన కుమార్తెకు సీత లేదా జానకి అని పేరు పెడతానని ఆమె తెలిపింది. 22న తెల్లవారుజామున 3.20 గంటలకు, లాల్గంజ్లోని బర్దిహా నివాసి అమిత్ మిశ్రా భార్య ప్రీతి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి రామ్ లేదా రాఘవ్ అనే పేరు పెట్టాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శుక్లహా నివాసి బాబుల్ సోంకర్ భార్య పుతుల్ బాలునికి జన్మనిచ్చింది. ఆటోడ్రైవర్ బాబుల్ తనకు అప్పటికే ఓ కొడుకు ఉన్నాడని, ఇప్పుడు జన్మించిన కుమారునికి రామ్ అని పేరు పెట్టనున్నామన్నారు. మిర్జాపూర్కు చెందిన ప్రీతి తెల్లవారుజామున 4.24 గంటలకు, మంజు 11.45 గంటలకు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. లాల్గంజ్ మార్కెట్‌కు చెందిన అన్షు మిశ్రా ఉదయం 11.55 గంటలకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లా మహిళా ఆసుపత్రి ప్రసూతి విభాగం వైద్యురాలు జూహీ దేశ్ పాండే మాట్లాడుతూ 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎనిమిది మంది మగ శిశువులు, ఐదుగురు ఆడ శిశువులు జన్మించారని తెలిపారు. ఇది కూడా చదవండి: సామాన్యులకు తెరుచుకున్న రామాలయం.. భక్తుల భారీ క్యూ! -
Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు
అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో నేటి నుంచి సామాన్య భక్తులకు రాములవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం(మంగళవారం) మూడు గంటల నుంచే రామాలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నేటి నుంచి సామాన్య భక్తులు రాములవారి నూతన విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయం బయట భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. దీంతో అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది. #WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS — ANI (@ANI) January 23, 2024 కాగా రామ్ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయిస్తున్నట్లు నిన్ననే ట్రస్ట్ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. నిత్యపూజలు-సేవలు ఇలా.. ఇక ప్రతీరోజూ మధ్యాహ్నం బాలరామునికి బోగ్ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు, పండ్లు అందిస్తారు. రామ్‌లల్లాకు సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను ధరింపజేస్తారు. ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేస్తారు. రామ్‌లల్లాకు రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు పాస్‌లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్‌లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి. ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయని ఆచార్య మిథిలేష్ నందిని శరణ్ తెలిపారు. 👉: అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) -
భావోద్వేగంలో ఉమా భారతి, సాధ్వి రితంభర
నాటి రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉమాభారతి, సాధ్వి రితంభర అయోధ్యలో భాద్వేగానికి లోనయ్యారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంభర భావోద్వేగంతో ఒకరినొకరు కావలించుకున్నారు. నాటి అయోధ్య ఉద్యమ పోరాటాలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఈ సమయంలో మాటలు లేవు.. భావాలు మాత్రమే కదలాడుతున్నాయి’ అని అన్నారు. పరమ శక్తి పీఠం వ్యవస్థాపకురాలు సాధ్వి రితంభర మాట్లాడుతూ ‘ప్రాణ ప్రతిష్ఠ’ శుభ ఘడియ ఇది.. యావత్ దేశం, యావత్ ప్రపంచం శోభాయమానంగా మారింది. కరసేవకుల త్యాగం అర్థవంతమైంది. రామ్‌లల్లా మనల్ని అనుగ్రహించేందుకు వచ్చాడు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! #WATCH | Ayodhya, UP: On Ram Temple 'pran pratishtha', Sadhvi Ritambhara, Founder of Param Shakti Peeth and Vatsalyagram, says, " This is the happy hour of 'pran pratishtha', whole Country and the whole world have been decorated...kar sevaks' sacrifices have become… pic.twitter.com/vLp6ORtabZ — ANI (@ANI) January 21, 2024 -
హారతి వేళ.. హెలికాప్టర్ నుంచి పూలవాన!
మరికొద్ది సేపట్లో అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా రాములోరికి హారతులు పట్టే సమయాన ఆలయంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 30 మంది కళాకారులు తమ సంగీత ప్రతిభను చాటనున్నారు. హారతి సమయంలో అతిథులంతా గంటలు మోగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామాలయంలోనికి ప్రధాని నరేంద్ర మోదీ అడుగిడనున్నారు. ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రసంగించనున్నారు. మొత్తం 121 మంది ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇది కూడా చదవండి: ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం? -
ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం. రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్‌కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్‌కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు. -
ప్రాణప్రతిష్ఠకు ముందు ఇంటిలో సీఎం యోగి పూజలు!
అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియా సైట్లో షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాశారు.. 'అయోధ్యధామ్‌లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం. ఈ సందర్భంగా దిగ్విజయ్నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్‌లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’ అని రాశారు. श्री अयोध्या धाम में श्रीराम जन्मभूमि पर आज हो रही प्रभु श्री रामलला के नूतन विग्रह की प्राण-प्रतिष्ठा से पीढ़ियों का संघर्ष एवं सदियों का संकल्प पूर्ण हुआ है। इस अवसर पर युगपुरुष ब्रह्मलीन महंत दिग्विजयनाथ जी महाराज और राष्ट्रसंत ब्रह्मलीन महंत अवेद्यनाथ जी महाराज के प्रति… pic.twitter.com/slW5UjNUoC — Yogi Adityanath (@myogiadityanath) January 22, 2024 సీఎం యోగి మరో ట్వీట్లో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు... ‘ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్‌లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోంది’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు లండన్ సాధ్విల బృందం! -
నేడు అయోధ్యలో ఏ సమయానికి ఏం జరగనుంది?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రత కల్పించారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోలను అయోధ్య అంతటా మోహరించారు. డ్రోన్లతో అయోధ్య అంతటా నిఘా కొనసాగుతోంది. నేడు అయోధ్యకు మొత్తం 7,140 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాటు జరిగే కార్యక్రమాల వివరాలివే.. దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం. అయోధ్యలో ప్రముఖంగా వెలుగొందుతున్న వంద ప్రదేశాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు. యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శనలు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన 200 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు. రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చడం. కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం. #WATCH | Ayodhya, Uttar Pradesh: Morning visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/qIRiYVgnei — ANI (@ANI) January 22, 2024 నూతన రామాలయంలో నేటి మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. అంటే 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ నేపధ్యంలో ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు. -
మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం!
అయోధ్యలోని నూతన రామాలయంలో నేడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న నేపధ్యంలో దేశం మొత్తం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. అయోధ్యలో మారుమోగుతున్న హర్షధ్వానాల ధ్వని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే అద్భుత క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. హిందువులే కాదు ఇతర మతాల వారు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. 50కి పైగా దేశాలలో వివిధ మాధ్యమాల సాయంతో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. లండన్ వీధుల్లో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతుండగా, బ్రిటన్‌లో నిర్వహించిన కారు ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ దేశంలోని సుమారు 250 దేవాలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేపాల్‌లో.. నేపాల్‌లోని జనక్‌పూర్‌లో గల జానకీమాత ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. జనక్‌పూర్ మేయర్ మనోజ్ కుమార్ సాహా.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా అయోధ్యవాసులకు శుభాకాంక్షలు తెలిపారు నేపాల్‌కు భారత్‌తో సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. శ్రీరాముని అత్తమామల స్వస్థలం అయిన జనక్‌పూర్‌లో నేడు దీపోత్సవం జరగనుంది. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? కెనడాలో.. కెనడాలోని అంటారియో పరిధిలోగల ఓక్విల్లే, బ్రాంప్టన్ నగరాల్లో నేటి రోజును ‘అయోధ్య రామ మందిర దినోత్సవం’గా ప్రకటించాయి. బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్, ఓక్విల్లే మేయర్ రాబ్ బర్టన్ మాట్లాడుతూ అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సాంస్కృతికంగా, చారిత్మాకంగా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. శతాబ్దాల నాటి కల సాకరమయ్యిందని మేయర్లిద్దరూ పేర్కొన్నారు. మారిషస్‌లో.. ద్వీప దేశమైన మారిషస్‌లోని అన్ని దేవాలయాలు ‘ప్రాణప్రతిష్ఠ’ సందర్బంగా దీపాలతో వెలుగులు పంచనున్నాయి. 48 శాతం హిందూ జనాభా ఉన్న మారిషస్‌లోని అన్ని దేవాలయాల్లో రామాయణ పారాయణం జరగనున్నది. హైకమిషనర్ హేమండోయిల్ దిలామ్ మాట్లాడుతూ ఈ ఉత్సవం భారతదేశానికే కాకుండా మారిషస్ ప్రజలకు కూడా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. మారిషస్ ప్రభుత్వం నేడు హిందూ ఉద్యోగులకు రెండు గంటల సెలవులు ఇచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు మారిషస్‌లోని 100 ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? డెన్మార్క్‌లో.. డెన్మార్క్‌లోని హిందూ స్వయంసేవక్ సంఘ్.. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ట వేడుక సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. డానిష్ అంబాసిడర్ పూజా కపూర్ మాట్లాడుతూ ఈ వేడుక సందర్భంగా భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారన్నారు. దీర్ఘకాలంగా కొనసాగిన రామాలయ వివాదాన్ని పరిష్కరించి, ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి అయోధ్య అక్షతలు పంపిణీ చేశారు. న్యూజిలాండ్‌లో.. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా న్యూజిలాండ్ రెగ్యులేషన్ మంత్రి డేవిడ్ సేమౌర్ మాట్లాడుతూ ‘జై శ్రీరామ్... ప్రధాని నరేంద్ర మోదీ సహా భారతీయులందరికీ అభినందనలు. 500 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. ప్రధాని మోదీ నాయకత్వమే దీనికి కారణం. ఈ ఆలయం చాలా గొప్పది. రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు నిలిచివుంటుంది. ప్రధాని మోదీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. భారతదేశంలోని కోట్లాదిమంది ప్రజలు మోదీకి అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్ కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలకు ముస్తాబయ్యింది. ఫ్రాన్స్‌లోని ప్యాలెస్ డి లా చాపెల్‌లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు భారీ రథయాత్ర బయలుదేరనుంది. ఈఫిల్ టవర్ సమీపంలోని ప్యాలెస్ డి ట్రోకాడెరో సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రథయాత్ర ముగియనుంది. దీనికి ముందు ఉదయం 10.30 గంటలకు లా చాపెల్లే సమీపంలో విశ్వకళ్యాణ యాగం నిర్వహించనున్నారు. థాయ్‌లాండ్‌లో.. భారతదేశానికి 3,500 కిలోమీటర్ల దూరంలోని థాయ్‌లాండ్‌లోనూ మరో అయోధ్య ఉంది. దీనిని ఆ దేశంలో ‘అయుతయ’ అని పిలుస్తారు. బ్యాంకాక్‌లోని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అయుతయతో సహా థాయ్‌లాండ్‌లోని అన్ని హిందూ దేవాలయాలలో రామ మందిర ప్రతిష్టాపన వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. దేశంలోని పలు నగరాల్లో ‘అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. -
Ayodhya Ram Mandir: జగదానంద కారకునికి జేజేలు
తండ్రి మాటను జవదాటని తనయుడు, సోదరులను అభిమానించిన అన్న, ఆలిని అనునిత్యం మనుసులో నిలుపుకున్న భర్త, స్నేహధర్మాన్ని పాటించిన మిత్రోత్తముడు. ఈ బంధాలు ఎన్ని ఉన్నా... ధర్మం తప్పకుండా ప్రజల కోసమే నిరంతరం పాటుపడిన ప్రభువు. మొత్తంగా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడని రామాయణ మహాకావ్యం చెబుతోంది. మహావిష్ణువు అవతారమే అయినప్పటికీ ఎక్కడా మహిమలు చూపలేదు. మాయలు చేయలేదు. ముమ్మూర్తులా మానవుడిలాగే వ్యవహరించాడు. మానవులలాగే కష్టాలననుభవించాడు. నిందలు మోశాడు. బాధలు పడ్డాడు. చిన్న చిన్న సంతోషాలనూ, సరదాలనూ కూడా మామూలు మనుషులలాగే అనుభవించాడు. అయితే ఎక్కడా ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు. ఆపత్సమయంలోనూ ధర్మాన్నే అనుసరించాడు. ధర్మాన్నే ఆచరించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ధర్మమంటే ఇదే అన్నట్టుగా ప్రవర్తించాడు. రాముడు అనుసరించిన మార్గం కనుకనే ఆయన చరితామృతానికి రామాయణమనే పేరు వచ్చింది. షోడశ మహాగుణ సంపన్నుడు వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడి లక్షణాల గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపాడు. పితృవాక్పాలకుడిగా పేరు పొందాడు. తండ్రి దశరథుడి మాటను ఎన్నడూ జవదాటలేదు. కన్నతల్లి కౌసల్యతో సమానంగా సవతి తల్లులైన సుమిత్రతోనూ, తనను అడవులకు పంపిన కైకతోనూ కూడా ప్రియంగానే మెలిగాడు. సోదర ప్రేమకు పెట్టింది పేరు సోదర ప్రేమ రాముని చూసి నేర్చుకోవలసిందే. తమ్ముడు లక్ష్మణుని ఎంతగానో ప్రేమించాడు. కొద్దిపాటి దుడుకు స్వభావి అయినప్పటికీ అతడిని ఏనాడూ పల్లెత్తు మాటనలేదు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛిల్లితే ఒక అతి సాధారణమైన అన్నయ్యలాగే తల్లడిల్లాడు. తమ్ముణ్ణి తిరిగి మామూలుగా చూసేంత వరకు స్థిమిత పడలేకపోయాడు. భరతునితో కూడా ఎంతో వాత్సల్యంతో మెలిగాడు. తాను వనవాసం పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు తాను వస్తున్న వార్తను భరతుడికి చేరవేసి, అతడి ముఖ కవళికలలో ఏమైనా మార్పు వచ్చిందేమో జాగ్రత్తగా గమనించి తనకు చెప్పమంటూ నమ్మిన బంటు హనుమను అందుకు నియోగించాడు. ఒకవేళ భరతుడు గనక రాజుగా ఉండేందుకు ఇష్టపడితే అందుకు తానేమీ అడ్డుపడదలచుకోలేదు. అంతేకాదు, శత్రుఘ్నుని కూడా అమితంగా ప్రేమించాడు. లవణాసురుడనే రాక్షసుని వధకు శత్రుఘ్నునే నియోగించాడు. అతడు జయించిన రాజ్యాన్ని అతడికే అప్పగించాడు. అందుకే ఆదర్శవంతులైన అన్నదమ్ములను రామలక్ష్మణుల్లా ఉన్నారంటారు. మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు. అహంకారం లేని వాడు. అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడి పాద స్పర్శతో అయోధ్యా నగరం పావనమైంది. అడవులు ధన్యమైనాయి. ఆత్మశతృవుని అధిగమించాడు కామం, కోపం, అత్యాశ, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని రామాయణం రుజువు చేస్తుంది. ఏక పత్నీవ్రతుడు నేటి సమాజంలో ఒక భార్యను కలిగి ఉండటం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. మనసావాచా కర్మణా ప్రేమించిన సీతాదేవిని తప్ప మరొక మహిళ వంక కన్నెత్తి చూడలేదు. ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. స్మిత పూర్వభాషిగా శ్రీరాముడికి పేరు. అంటే అవతలి వారు తనను పలకరించేవరకు వేచి చూడాలని అనుకోడు. ముందుగా తానే వారిని మాట్లాడించేవాడు. అంతటి మర్యాదా పురుషోత్తముడు. అటువంటి ఆదర్శమూర్తి, ధర్మప్రభువు... ఆయన నడయాడిన పుణ్యపుడమిగా పేర్కొంటున్న అయోధ్యలో బాల రాముడిగా నేడు విగ్రహ రూపంలో కొలువుతీరనున్నాడు. ఈ శుభ సందర్భంలో ఆ జగదానంద కారకుడికి జేజేలు చెబుదాం... – డి.వి.ఆర్. -
రాముని మార్గంలో నడుద్దాం!
మన భారతదేశపు శతాబ్దిన్నర చరిత్ర విదేశీ దురాక్రమణదారులతో సాగించిన నిరంతర సంఘర్షణలతో నిండి ఉంది. ప్రారంభంలో కొద్దిమంది అప్పుడప్పుడు ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం (సికందర్ దాడి) ఈ దేశంపై దాడి చేసేవారు. కానీ ఆ తరువాత ఇస్లాం పేరున పశ్చిమం నుండి సాగిన దాడులు ఇక్కడి సమాజాన్ని తీవ్రంగా నష్టపరచడమేకాక వేర్పాటువాద ధోరణిని కూడా తీసుకువచ్చాయి. సమాజంలో నిరాశ, నిస్పృహ, పరాజయ భావాలను నింప డానికి విదేశీ దురాక్రమణదారులు ఇక్కడి ధార్మిక స్థలాలు, మందిరాలపై దాడి చేసి, వాటిని ధ్వంసం చేశారు. ఇలా ఒక్కసారి కాదు, అనేకసార్లు జరిగింది. ఈ విధంగా భారతీయ సమాజాన్ని బలహీనపరచి దీర్ఘకాలం ఇక్కడ రాజ్యం చేయా లన్నది వారి ప్రయత్నం. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని కూడా ఇదే ఉద్దేశ్యంతో, లక్ష్యంతో ధ్వంసం చేశారు. దురా క్రమణకారుల ఈ లక్ష్యం కేవలం ఒక మందిరానికే పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టు కోవాలన్నది వారి అసలు ఉద్దేశ్యం. ఈ దేశానికి చెందిన రాజులు ఎప్పుడూ, ఏ దేశంపైనా దురాక్రమణ చేయలేదు. కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాలకు చెందిన రాజులు మాత్రం అటువంటి దాడులు, దురాక్రమణలకు పాల్పడ్డారు. అయినా ఏ పాలకుడూ భారత్‌పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోయాడు. భారతీయ సమాజం ఎప్పుడూ ఈ దురాక్రమణదారుల ముందు తలవంచలేదు. వీరిని ఎదుర్కొనేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. అయోధ్య జన్మస్థానాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ భవ్యమైన రామమందిరాన్ని పునర్నిర్మించడానికి నిరంతర ప్రయత్నం సాగుతూనే వచ్చింది. అనేక యుద్ధాలు, సంఘర్షణ, బలిదానాలు జరిగాయి. రామజన్మభూమిలో మందిర నిర్మాణ సంకల్పం హిందువుల మనస్సుల నుండి ఎప్పుడూ తొలగిపోలేదు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు హిందువులు, ముస్లింలు కలిసే ఆ పని చేశారు. అప్పటివరకూ ఇద్దరూ ఆలో చనలు పంచుకునేవారు. అప్పుడు గోవధ నిషేధం, రామజన్మభూమి గురించి రెండు వర్గాల మధ్య ఒక అంగీకారం కుదిరే పరిస్థితి ఏర్పడి ఉంది. తన ప్రమాణపత్రంలో గోవధ నిషేధం అమలు గురించి కూడా బహదూర్ షా జాఫర్ పేర్కొన్నారు. అందు వల్లనే సమాజం మొత్తం ఒకటిగా నిలచి పోరాడింది. భారతీయులందరూ వీరోచితంగా పోరాడినా దుర దృష్టవశాత్తూ ఆ యుద్ధం విఫలమైంది. దానితో బ్రిటిష్ పాలన కొనసాగింది. అయితే రామ జన్మ భూమి ముక్తి పోరాటం మాత్రం ఆగలేదు. బ్రిటిష్ వాళ్ళు మొదటి నుండి అనుసరిస్తూ వచ్చిన ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని ఆ తరువాత మరింతగా అమలుచేశారు. సమాజంలోని ఐకమత్యాన్ని నాశనం చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర వీరులను అయోధ్యలో ఉరితీశారు. అయినా అయోధ్య ముక్తి పోరాటం ఆగలేదు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సోమనాథ మందిర జీర్ణోద్ధరణ జరగడంతో ఇటు వంటి దేవాలయాల గురించి చర్చ మళ్ళీ ప్రారంభమయింది. రామజన్మభూమి ముక్తి గురించి అందరి ఆమోదం, అంగీకారం సాధించే అవకాశం అప్పుడు వచ్చినా రాజకీయాలు మరోదారి పట్టాయి. విచ్ఛిన్న వాదం, ప్రాంతీయవాదం వంటివి రాజకీయాల ముసుగులో పెచ్చరిల్లాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయమై హిందువుల మనోభావాలను పట్టించు కోకపోగా వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రజలు చేసిన ప్రయత్నాలను కూడా ముందుకు సాగనివ్వలేదు. ఈ విషయమై స్వాతంత్య్రానికి ముందు నుండి సాగుతూ వచ్చిన న్యాయపోరాటాన్ని కొనసాగించారు. రామజన్మభూమి విముక్తి కోసం ప్రజా ఉద్యమం 1980 తరువాత ఊపందుకుంది. అప్పటి నుండి మూడు దశాబ్దాల పాటు సాగింది. 1949లో జన్మభూమిలో భగవాన్ శ్రీరామచంద్రుని విగ్రహం వెలిసింది. 1986లో కోర్టు ఆదేశం మేరకు ఆలయ తాళాలు తెరిచారు. ఆ తరువాత అనేక ఉద్యమాలు, రెండుసార్లు కరసేవ వంటి కార్య క్రమాల ద్వారా హిందూ సమాజపు నిరంతర సంఘర్షణ కొనసాగింది. 2010లో అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ తరువాత ఈ విషయంలో అంతిమ తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువరించాలంటూ కోర్టుకు పదేపదే అభ్యర్థనలు వెళ్ళాయి. చివరికి హిందూ సమాజపు 30 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తరువాత 2019 నవంబర్ 9న అన్ని సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు సముచితమైన, సంతులితమైన తీర్పును ప్రకటించింది. రెండు పక్షాల మనోభావాలు, సాక్ష్యాధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి అన్ని పక్షాల వాదనలను కూడా పూర్తిగా విన్న తరువాత తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి మందిర నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. 2020 ఆగస్ట్ 5న మందిర భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు పుష్య మాస శుక్లపక్ష ద్వాదశి, యుగాబ్ది 5125... 2024 జనవరి 22న శ్రీ రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధార్మిక దృష్టితో చూస్తే శ్రీరాముడు ఈ దేశంలో అధిక సంఖ్యాకులకు ఆరాధ్య దేవుడు. ఆయన జీవితం ఆదర్శప్రాయమనీ, అనుసరణీయమనీ నేటికీ సమాజంలో అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి సంబంధించి వస్తున్న చిన్నపాటి అభ్యంతరాలు, అనుమానాలను పూర్తిగా పక్కన పెట్టాలి. వివాదాలు, వాదనలు పూర్తిగా సమసిపోయేట్లు మేధావులు చూడాలి. అయోధ్య అంటే ‘యుద్ధం లేనిది’, ‘సంఘర్షణ లేని స్థానం’ అని అర్థం. సమాజంలోని ప్రతి ఒక్కరి మనస్సులలో అటువంటి అయోధ్య నిర్మాణం కావాలి. అది మనందరి కర్తవ్యం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జాతి గౌరవ పునర్ జాగరణకు గుర్తు. ఇది శ్రీరాముని జీవితం ఇచ్చే సందేశాన్ని ఆధునిక సమాజం కూడా స్వీకరించిందనడానికి గుర్తు. శ్రీరామ మందిరంలో పత్రం, ఫలం, పుష్పంతో పూజతోపాటు రామదర్శనంతో మనస్సులో ఆయనను ఉంచుకుని ఆదర్శవంత మైన ఆచరణను అలవరచుకుని శ్రీరాముని పూజ చేయాలి. ఎందుకంటే ‘శివో భూత్వా శివం భజేత్, రామో భూత్వా రామం భజేత్’ (శివుడే తానై శివుని పూజించు, రాముడే తానై రాముడిని పూజించు) అనేదే నిజమైన పూజ అవుతుంది. భారతీయ సాంస్కృతిక దృష్టి ప్రకారం... మాతృవత్ పర దారేషు పర ద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సః పణ్డితాః (పర స్త్రీని మాతృభావనతో చూడాలి. పరుల సొమ్మును మట్టిగా ఎంచాలి. సర్వ జీవులలో ఆత్మను చూడాలి అని పండితులు చెబుతారు.) ఈ విధంగా మనం శ్రీరాముని మార్గంలో నడవాలి. సత్యనిష్ఠ, బలపరాక్రమాలతోపాటు క్షమ, వినయం, అందరినీ సమాదరించే ధోరణి, కారుణ్యం, కర్తవ్య పాలనలో పట్టుదల వంటి శ్రీరామచంద్రుని గుణాలను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అలవ రచుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ తెచ్చుకోవాలి. ఇటువంటి క్రమశిక్షణ ద్వారానే రామలక్ష్మణులు 14 ఏళ్ల అరణ్యవాసాన్ని పూర్తిచేయడమేకాక శక్తిశాలి రావణునితో పోరాడి విజయం సాధించారు. శ్రీరాముని జీవితంలో కనిపించే న్యాయబుద్ధి, కరుణ, సద్భావం, నిష్పక్షపాత ధోరణి వంటి సామాజిక గుణాలను తిరిగి ఈ సమాజంలో పాదుకొల్పాలి. శోషణ లేని, సమాన న్యాయం లభించే సమాజాన్ని, శక్తితోపాటు కరుణ నిండిన ఒక సమాజాన్ని నిర్మించడమే శ్రీరాముని నిజమైన పూజ అవుతుంది. అహంకారం, స్వార్థం, భేదభావాల మూలంగా ప్రపంచం వినాశం వైపు పరుగులు తీస్తోంది. ఎన్నో ఆపదలను కొనితెచ్చుకుంటోంది. సద్భావన, ఏకత, ప్రగతి, శాంతి వంటి మార్గాన్ని చూపిన జగద భిరాముని ఆదర్శం సర్వకల్యాణకారి, ‘సర్వేషాం అవిరోధి’ (ఎవరితోనూ విరోధం లేని) అయిన సమాజ నిర్మాణపు ప్రారంభానికి దారి చూపాలి. ఆ మహా ప్రయత్నానికి శ్రీ రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నాంది కావాలి. మనమంతా ఆ ప్రయత్నంలో, ఆ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. జనవరి 22న జరిగే ఉత్సవంలో పాల్గొని మందిర పునర్నిర్మాణ కార్యంతో భారత్, తద్వారా ప్రపంచపు పునర్నిర్మాణ సంకల్పం చేపడదాం. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని ముందుకు నడుద్దాం! డా‘‘ మోహన్ భాగవత్ వ్యాసకర్త ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ -
రాముడి ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తున్నా: నిత్యానంద
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తాను వస్తున్నాని తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద స్పష్టం చేశాడు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు నిత్యానంద తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిత్యానంద ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహనం అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని కామెంట్స్ చేశారు. అలాగే, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు అంటూ చెప్పుకొచ్చారు. 2 More Days Until the Inauguration of Ayodhya Ram Mandir! Don't miss this historic and extraordinary event! Lord Rama will be formally invoked in the temple's main deity during the traditional Prana Pratishtha and will be landing to grace the entire world! Having been formally… pic.twitter.com/m4ZhdcgLcm — KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) January 20, 2024 ఇదిలా ఉండగా.. నిత్యానంద 2020లో భారత్ నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. అయితే, అంతకుముందు కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో పలు మార్లు సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేస్తున్నారు. -
కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి పూలను తెప్పించారు. అయోధ్యను అలంకరించేందుకు కాశీ నుంచి కూడా పూలు తెప్పించారు. పూర్వాంచల్‌లోని అతిపెద్ద పండ్ల మార్కెట్ నుంచి 50 క్వింటాళ్ల పూలను రెండు రోజుల క్రితం అయోధ్యకు తరలించారు. ఈ పూలలో ఆరెంజ్, పసుపు రంగు బంతిపూలు ఉన్నాయి. ఇదేవిధంగా కాశీ నుంచి అయోధ్యకు పెద్ద మొత్తంలో గులాబీలను పంపించామని, పది వేల బంతిపూల దండలను కూడా పంపినట్లు మాల్దాహియా పూల మార్కెట్ హెడ్ విశాల్ దూబే తెలిపారు. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ, కొద్దిమొత్తంలోనే పూలను అయోధ్యకు పంపించామన్నారు. కాగా కాన్పూర్, లక్నో, కోల్‌కతాల నుంచి కూడా అయోధ్యకు పూలను ఆర్డర్ చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి యూపీలో ప్రస్తుతం పూలకు విపరీతమైన గిరాకీ ఉంది. జనవరి 22న వివిధ ఆలయాల్లో పూజలు, వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా వివిధ రకాల పూలకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. బంతిపూలతో పాటు గులాబీ, మల్లె పూలకు విపరీతమైన ఆర్డర్లు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలరామునికి భారీ వేణువు -
అయోధ్యకు ఆఫ్గనిస్థాన్ కానుక
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో కొలువయ్యే బాలరామునికి ఆఫ్గనిస్థాన్‌తో సహా ప్రపంచం నలుమూలల నుండి కానుకలు అందుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తాజాగా కశ్మీర్, తమిళనాడు, ఆఫ్గనిస్థాన్ నుండి వచ్చిన కానుకలను రామాలయ ట్రస్ట్‌కు అందజేశారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై ముస్లిం సమాజం కూడా సంతోషంగా ఉందని అలోక్ కుమార్ పేర్కొన్నారు. కాశ్మీర్‌కు చెందిన ముస్లిం సోదరులు, సోదరీమణులు తనను కలవడానికి వచ్చి, రామమందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వారు సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రెండు కిలోల స్వచ్ఛమైన కుంకుమపువ్వును అందజేశారన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు ఆఫ్గనిస్థాన్ నుండి కూడా ప్రత్యేక బహుమతి వచ్చిందని అలోక్ కుమార్ చెప్పారు. ఆఫ్గనిస్థాన్లోని కాబూల్‌లో గల ‘కుబా’నదిలోని నీటిని కానుకగా స్వీకరించామని అన్నారు. తమిళనాడుకు చెందిన పట్టు వస్త్రాల తయారీదారులు శ్రీరాముని ఆలయ చిత్రంతో నేసిన సిల్క్ దుస్తులను పంపారన్నారు. -
అయోధ్య గుడికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం
అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూపీలోని అలీఘర్కు చెందిన జ్వాలాపురి నివాసి సత్యప్రకాష్ శర్మ తయారుచేసిన 400 కిలోల బరువున్న తాళాన్ని అయోధ్యకు తరలించనున్నారు. ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా గుర్తింపు పొందింది. ఈ తాళాన్ని సత్యప్రకాశ్ శర్మతో పాటు అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ చంద్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ తాళాన్ని అయోధ్యలో సమర్పించేందుకు మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు రుక్మిణిదేవి అప్పగించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేవారు ఈ తాళాన్ని అలీఘర్ ప్రాంతానికి చిహ్నంగా గుర్తించనున్నారు. హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ తాళాల తయారీదారుడు సత్య ప్రకాష్ శర్మ దంపతులు తయారు చేసిన ఈ తాళాన్ని బాలరామునికి అర్పించనున్నట్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్ శర్మ, అతని భార్య రుక్మిణి శర్మ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని, తాము స్వయంగా తయారుచేసిన ఆరు కిలోల తాళాన్ని ఆయనకు బహుకరించారు. అలాగే తాము అయోధ్యలోని శ్రీరామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం సిద్ధం చేశామని, ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు ప్రధానికి తెలిపారు. ఇది కూడా చదవండి: కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు మూడు అడుగుల నాలుగు అంగుళాల పొడవున్న ఈ తాళానికి గల తాళం చెవి 30 కిలోల బరువుంటుందని రుక్మణి దేవి తెలిపారు. ఈ తాళం తయారీకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందన్నారు. కాగా సత్యప్రకాష్ శర్మ గత డిసెంబర్ 12న గుండెపోటుతో కన్నుమూశారు. అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ శర్మ తండ్రి కోరిక మేరకు ఈ తాళాన్ని మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు అప్పగించారు. -
బాలరామునికి భారీ వేణువు
అయోధ్యలో 22న జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాలరామునికి దేశవ్యాప్తంగా పలువురు కానుకలు పంపుతున్నారు. ఈ క్రమంలో 21.6 అడుగుల పొడవైన భారీ వేణువును పిలిభిత్(ఉత్తరప్రదేశ్) నుంచి అయోధ్యకు పంపించనున్నారు. అయోధ్యలోని మ్యూజియంలో ఈ వేణువును ఉంచనున్నారు. అత్యంత పొడవైన ఈ వేణువును పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, కుమారుడు అర్మాన్ నబీ, వారి బంధువు షంషాద్ తదితరులు వారి స్నేహితుల సాయంతో తయారుచేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ వెదురును చరిత్రకు గుర్తు చాలా ఏళ్లుగా దాచివుంచామని, ఇప్పుడిది వేణువు రూపంలో శ్రీరాముని చెంతకు చేరుతున్నదని హీనా పర్వీన్ తెలిపారు. కాగా ఈ వేణువును హీనా పర్వీన్ స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అప్పగించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త హరీష్ రౌతేలా ఈ వేణువుకు పూజలు చేశారు. ఈ వేణువును జనవరి 26న అయోధ్యధామానికి పంపనున్నారు. కాగా వేణువు తయారీదారులలో ఒకరైన అర్మాన్ మాట్లాడుతూ ఈ వేణువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలిచిందన్నారు. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామన్నారు. ఇటువంటి వెదురు ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదన్నారు. ఇది కూడా చదవండి: ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే.. ఈ వేణువును తయారీకి 10 రోజులు పట్టిందని, ఈ వేణువును రెండు వైపుల నుండి వాయించవచ్చని తెలిపారు. దీని తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని తెలిపారు. ఈ బారీ వేణువుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేణువును ఒక ట్రక్కులో అయోధ్యకు తరలించనున్నారు. -
అయోధ్యకు యూపీ ప్రభుత్వ విరాళమెంత?
22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపధ్యంలో దేశమంతటా రామనామం మారుమోగిపోతోంది. ఇదే సమయంలో రామాలయానికి యూపీ ప్రభుత్వం ఇచ్చిన విరాళంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రభుత్వ విరాళాలకు సంబంధించి ఒక వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో యోగి ఆదిత్యనాథ్.. ‘కరసేవకులు ఎన్నో త్యాగాలు చేశారు. దీనికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మార్గదర్శకత్వం, విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం, సాధువుల నుండి ఆశీర్వాదాలు తోడుగా నిలిచాయి. కరసేవకుల ఉద్యమం కారణంగానే రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం జరుగుతోంది. దీనికి యూపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు అందించలేదు. నిర్మాణం కోసం వెచ్చిస్తున్న సొమ్ము దేశంతో పాటు ప్రపంచం నలుమూలల ఉన్న రామభక్తులు అందించారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? అయితే యూపీ ప్రభుత్వం ఏయే పనులకు నిధులు వెచ్చిస్తున్నదో సీఎం యోగి తెలిపారు. రామ మందిరం వెలుపల రైల్వే స్టేషన్, విమానాశ్రయ నిర్మాణం, గెస్ట్ హౌస్ నిర్మాణం, క్రూయిజ్ సర్వీస్, రోడ్డు విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల కోసం ప్రభుత్వం నిధులు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ పనులన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. దేశం నలుమూలల నుండి రామాలయానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఆలయానికి కానుకలు కూడా భారీగానే వస్తున్నాయి. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు విరాళంగా భక్తులు అందజేస్తున్నారు. నెల మొత్తం మీద చూసుకుంటే రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకూ నిధులు అందుతున్నాయి. అయితే ఆన్లైన్ విరాళాల విరాళాల లెక్కింపు ఇంకా జరగలేదని సమాచారం. एक पाई सरकार ने नहीं दी है, न केंद्र की सरकार ने, न राज्य की सरकार ने, मंदिर के किसी काम में नहीं! ये सारा पैसा रामभक्तों ने देश भर से दिया है, दुनिया भर से दिया है... pic.twitter.com/m6DOFSdI4t — Yogi Adityanath (@myogiadityanath) January 17, 2024 -
నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి?
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు రోజులుగా జరుగుతున్న రామ్‌లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు ఐదో రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. అయోధ్యలో ఈరోజు(శనివారం) జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగినది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈరోజు రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి, వాస్తు శాంతి, ‘అన్నాధివాసం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠనాలు జరగనున్నాయి. పంచదారలో, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు. ఇది కూడా చదవండి: 400 కేజీల తాళానికి 30 కిలోల చెవి! ఆరో రోజున అంటే ఆదివారంనాడు రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.