
ఈ నెల 22న జరగబోయే బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు.
సుమారు మూడు గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు జరిగాయి. అనంతరం డాక్టర్ అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. తరువాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ, కళ్లకు గంతలు కట్టారు. వీటిని జనవరి 22న తెరవనున్నారు.
వివేక్ సృష్టి ప్రాంగణంలో ఆచార్య అరుణ్ దీక్షిత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజలు ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ కూడా పాల్గొన్నారు. ప్రాయశ్చిత్త పూజలో భగవంతుడిని క్షమాపణలు కోరారు. విగ్రహ తయారీలో ఉలి, సుత్తి లేదా మరేదైనా పరికరాన్ని ఉపయోగించినందున భగవంతునికి గాయం తగిలిందన్న భావనతో ఈ విధమైన క్షమాపణలు కోరారు..
అనంతరం ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు సరయూ తీరానికి చేరుకుని దశవిధ స్నానం చేశారు. ఈ సమయంలో ప్రాయశ్చిత్త పూజలకు సంబంధించిన మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించాయి. ఈరోజు (బుధవారం) బాలరాముని విగ్రహాన్ని అయోధ్య ఆలయ ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి.
ఇది కూడా చదవండి: అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం