Pran
-
22న మరో రామాలయంలోనూ ప్రాణప్రతిష్ఠ
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే అదేసమయంలో మధ్యప్రదేశ్‌లోని సౌసర్ నగర్లో గల 200 ఏళ్ల పురాతన రామాలయంలోనూ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఆలయ కమిటీ జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భారీ ఆలయాన్ని నిర్మించి, అందులో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, అదే సమయంలో తాము కూడా ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపనకు నిర్ణయం తీసుకున్నప్పుడు, తాము కూడా అదే రోజున ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించామన్నారు. కమిటీ మేనేజర్ నరేష్ బగానీ మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి తమ కుటుంబసభ్యులు శ్రీరామ మందిరాన్ని నిర్మించినప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఆలయాన్ని పునరుద్ధరించాలని తమ కుటుంబీకులు నిర్ణయించారని, గత రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు కొనసాగాయన్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 22 నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానున్నదని అన్నారు. -
నేడు ఆలయ ప్రాంగణంలోకి బాలరాముని విగ్రహం!
ఈ నెల 22న జరగబోయే బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు జరిగాయి. అనంతరం డాక్టర్ అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. తరువాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ, కళ్లకు గంతలు కట్టారు. వీటిని జనవరి 22న తెరవనున్నారు. వివేక్ సృష్టి ప్రాంగణంలో ఆచార్య అరుణ్ దీక్షిత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజలు ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ కూడా పాల్గొన్నారు. ప్రాయశ్చిత్త పూజలో భగవంతుడిని క్షమాపణలు కోరారు. విగ్రహ తయారీలో ఉలి, సుత్తి లేదా మరేదైనా పరికరాన్ని ఉపయోగించినందున భగవంతునికి గాయం తగిలిందన్న భావనతో ఈ విధమైన క్షమాపణలు కోరారు.. అనంతరం ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు సరయూ తీరానికి చేరుకుని దశవిధ స్నానం చేశారు. ఈ సమయంలో ప్రాయశ్చిత్త పూజలకు సంబంధించిన మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించాయి. ఈరోజు (బుధవారం) బాలరాముని విగ్రహాన్ని అయోధ్య ఆలయ ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి. ఇది కూడా చదవండి: అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం -
రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్!
అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో ఆలయానికి సంబంధించిన ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో రామాలయంలో ఏర్పాటు చేసిన బంగారు తలుపునకు సంబంధించిన తొలి ఫొటో బయటకు వచ్చింది. దానిపై ముచ్చట గొలిపే కళాకృతులు ఉన్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ తలుపు 12 అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ తలుపును మొదటి అంతస్తులో అమర్చారు. రామ మందిరంలో మొత్తం 46 తలుపులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 42 తలుపులకు 100 కిలోల బంగారు పూత వేయనున్నారు. గుడి మెట్ల దగ్గర ఉండే నాలుగు తలుపులకు బంగారు పూత ఉండదు. మీడియా నివేదికల ప్రకారం రాబోయే రోజుల్లో మరో 13 బంగారు తలుపులను అమర్చనున్నారు. రామాలయం తలుపునకు సంబంధించిన ఫొటోలో రెండు ఏనుగులు స్వాగతం పలుకుతూ కనిపిస్తున్నాయి. ద్వారం పైభాగంలో రాజభవనం తరహా ఆకృతి కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు సేవకులు ముకుళిత హస్తాలతో కనిపిస్తారు. తలుపునకు దిగువన చదరపు ఆకారంలో అందమైన కళాకృతులు కనిపిస్తాయి. ఈ తలుపులను తయారు చేసేపనిని హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ చేపడుతోంది. ఈ కంపెనీ మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల నుంచి తలుపులకు అవసరమయ్యే కలపను ఎంపిక చేసింది. తలుపులను కన్యాకుమారికి చెందిన కళాకారులు తయారుచేస్తున్నారు. నూతన రామాలయానికి సంబంధించి బయటకు వస్తున్న ఫొటోలను అనురించి చూస్తే రామాలయం ఎంతో వైభవంగా ఉండనున్నదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం -
ఆ ఐదుగురు.. ‘ప్రాణ ప్రతిష్ఠ’ ప్రధాన అతిథులు!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముడు ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నేపధ్యంలో ఇప్పటికే అయోధ్యలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ఆచార్యులు, అతిథుల ఫైనల్ జాబితాను ఖరారు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన అతిథిగా హాజరుకానుండగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరు గర్భాలయంలో జరిగే పూజలలో పాల్గొననున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు. ఇదిలా ఉండగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 న దేశ, ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల కోసం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించింది. దీని ప్రకారం జనవరి 14 నుంచి 22 వరకు దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 22న వివిధ దేవాలయాలలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం భక్తులు రామ జ్యోతులు వెలిగించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం బ్రహ్మ గణేశ్వర శాస్త్రి, ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ సారధ్యంలో జరగనుంది. వీరితో పాటు సునీల్ దీక్షిత్, గజానంద్ జోగ్కర్, అనుపమ్ దీక్షిత్, ఘాటే గురూజీలు కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారయ్యింది. 2024, జనవరి 22న అభిజీత్ లగ్నం, మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం 12:20 గంటలకు శ్రీరాముని విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు ఆదివారం సాకేత్ నిలయంలో సంఘ్ పరివార్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో మొదటి దశ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఇది డిసెంబర్ 20 వరకు కొనసాగనుంది. దీనిలో ఆరోజు నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపురేఖలను సిద్ధం చేయనున్నారు. అలాగే స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో పది మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండో దశలో డోర్ టు డోర్ కాంటాక్ట్ స్కీమ్ కింద 10 కోట్ల కుటుంబాలకు అక్షతలు, రాంలాల చిత్రం, కరపత్రం అందజేయనున్నారు. జనవరి 22న మొదలయ్యే మూడో దశలో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలగనుంది. ఈ నాలుగో దశ గణతంత్ర దినోత్సవం నుండి ప్రారంభమై ఫిబ్రవరి 22 వరకు కొనసాగనుంది. నవంబర్ 20న భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేపట్టనున్నారు. ఈ మార్గంలోని రోడ్లు, కూడళ్లకు మరమ్మతులు చేస్తున్నారు. తాత్కాలిక బస్టాండ్ నిర్మించారు. మఠాలు, ఆలయాలను అలంకరించారు. లక్నో నుండి వచ్చే భక్తులు సహదత్‌గంజ్ పరిక్రమ మార్గంలో ఫైజాబాద్ బస్సు స్టేషన్‌కు చేరుకుంటారు. రైలులో వచ్చే వారు అయోధ్య కాంట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుండి వారు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఈ ప్రదక్షిణల కార్యక్రమం నవంబర్ 21వ తేదీ రాత్రి 11:38 గంటలకు ముగియనుంది. ఇది కూడా చదవండి: విశ్వసుందరి పలాసియోస్ -
ప్రాన్ కార్డుతో.. ప్రయోజనాలెన్నో..
నిడమర్రు : పాన్ కార్డు.. ప్రాన్ కార్డు.. అక్షరమే తేడా ఉన్నా రెండు కార్డులు ఎంతో ఉపయుక్తమైనవి. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారందరికీ అవసరమైనదైతే, ప్రాన్ కార్డు ఉద్యోగులు, జాతీయ పింఛన్ పథకం ఖాతా దారులకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వమే దీన్ని అందజేస్తుంది. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయుల, ఉద్యోగులకు ఈ కార్డులు అందజేస్తుంది. చాలామంది పింఛన్‌దారులు వినియోగించక పోవడంతో దీని ప్రయోజనం పొందలేకపోతున్నారు. 2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం లేదు. వీరి జీతాల నుంచే నెలనెలా కొంత మొత్తం ప్రభుత్వం వసూలు చేసి ప్రత్యేక ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంది. దీన్ని కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అంటారు. ఈ సీపీఎస్ విధానంలో ఉన్నవారికి ప్రాన్ కార్డు తప్పనిసరి. చాలామందికి ప్రాన్ కార్డు గురించి అవగాహన ఉన్నా కార్డు గురించి పూర్తిగా తెలియదు. ఈ కార్డు ప్రయోజనం తెలుసుకుందాం. ప్రాన్ అంటే..? పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్).. ఏటీఎం కార్డు వంటిది. సీపీఎస్ విధానంలో జీతాలు పొందుతున్న వారితోపాటు పింఛన్ పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కార్డు. తొలుత పింఛనర్లకే ఇచ్చేవారు. 2004లో కేంద్రం జాతీయ పింఛన్ పథకం బిల్లును ఆమోదించినప్పటి నుంచి ఈ కార్డు అమలులోకి వచ్చింది. ప్రాన్ కార్డు ద్వారా ఉద్యోగులు, పింఛన్‌దారులు ఎప్పటికప్పుడు తమ ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. ఉద్యోగం మారినా కార్డు మార్చుకోనవసరం లేదు. పిన్ నంబర్ ఆధారంగా కార్డును వినియోగించు కోవచ్చు. అయితే ఈ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం మాత్రం లేదు. పొందడం ఇలా.. జీతాలు అందించే శాఖాధిపతుల(డ్రాయింగ్ అధికారులు) సిఫారసులతో జిల్లా కేంద్రాల్లో ఉండే కార్వీ కేంద్రాలకు పదో తరగతి సర్టిఫికెట్ అందించి నేరుగా గాని, గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారాగాని దరఖాస్తు చేసుకోవాలి. సీపీఎస్ ఉద్యోగులైతే జీతాల స్లిప్‌ను జతచేయాలి. వంద రూపాయలు చెల్లిస్తే రిజిస్టర్ పోస్టులో కార్డు అందుతుంది. జీతాల నుంచి పీఎఫ్ కోత ఉన్న ఉద్యోగులు ఈ ప్రాన్ కార్డు పొందే వీలు లేదు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో వివరాలు వచ్చాక పిన్ ఎంటర్ చేస్తే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వీటిని సవరించుకోవచ్చు. వరుసగా మూడు నెలలపాటు ఒక్కసారి కూడా కార్డు వినియోగించకుంటే బ్లాక్ అవుతుంది. మళ్లీ వేరే పాస్వర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోజనాలు.. ♦ ఖాతాలో సొమ్ము నిల్వ గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు. ♦ సీపీఎస్ విధానంలో ప్రతినెలా తమ వాటా సొమ్ము ఖాతాకు జమ అవుతోందో లేదో తెలుసుకునే వీలు కలుగుతుంది. ♦ పింఛన్ లావాదేవీలకు పాన్ కార్డుతోపాటు ప్రాన్ కార్డు కూడా ఉపయోగించవచ్చు. ♦ ప్రభుత్వపరంగా రుణాలు తీసుకున్నప్పుడు ఉపయుక్తమవుతుంది. ♦ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో ప్రాన్ కార్డు తప్పనిసరి పిన్ నంబర్ మర్చిపోతే.. ప్రాన్ కార్డు పిన్ నంబర్ మర్చిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త పిన్ నంబర్ తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంది. ఠీఠీఠీ.ఛిట్ఛ/nఛీట.ఛిౌఝ లోకి ఎంటర్ కావాలి. ఇందులో ఛిట్చnటఛీ∙పదాన్ని క్లిక్ చేయాలి. సీ యువర్ ప్రాన్ స్టేటస్ అనే పదం వద్ద క్లిక్ చేయాలి. సబ్‌స్క్రైబర్ ఇన్ఫర్మేషన్, నోడల్ అధికారి ఇన్ఫర్మేషన్ అనే రెండు బాక్స్‌లు వస్తాయి. సబ్‌స్క్రైబర్ బాక్స్‌లో ప్రాన్ నంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనే బాక్స్ వద్ద ఫర్ గెట్ పాస్వర్డ్/సీక్రెట్ క్వశ్చన్ రీసెట్ పాస్వర్డ్ అనే పదం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. పాన్ కార్డుపై ప్రింట్ వివరాలు అడుగుతుంది. వాటిని నమోదు చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మన ఫోన్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అలా వచ్చిన వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నంబర్ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. అప్పడు కొత్త పాస్వర్డ్ వస్తుంది. దీన్ని తర్వాత వినియోగించుకోవచ్చు.