ప్రాన్‌ కార్డుతో.. ప్రయోజనాలెన్నో.. | pran card use for national pension scheme | Sakshi
Sakshi News home page

ప్రాన్‌ కార్డుతో.. ప్రయోజనాలెన్నో..

Published Thu, Feb 15 2018 1:26 PM | Last Updated on Thu, Feb 15 2018 1:26 PM

pran card use for national pension scheme - Sakshi

ప్రాన్ కార్డు నమూనా

నిడమర్రు : పాన్‌ కార్డు.. ప్రాన్‌ కార్డు.. అక్షరమే తేడా ఉన్నా రెండు కార్డులు ఎంతో ఉపయుక్తమైనవి. పాన్‌ కార్డు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారందరికీ అవసరమైనదైతే, ప్రాన్‌ కార్డు ఉద్యోగులు, జాతీయ పింఛన్‌ పథకం ఖాతా దారులకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వమే దీన్ని అందజేస్తుంది. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయుల, ఉద్యోగులకు ఈ కార్డులు అందజేస్తుంది. చాలామంది పింఛన్‌దారులు వినియోగించక పోవడంతో దీని ప్రయోజనం పొందలేకపోతున్నారు. 2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్‌ సదుపాయం లేదు. వీరి జీతాల నుంచే నెలనెలా కొంత మొత్తం ప్రభుత్వం వసూలు చేసి ప్రత్యేక ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంది. దీన్ని కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం అంటారు. ఈ సీపీఎస్‌ విధానంలో ఉన్నవారికి ప్రాన్‌ కార్డు తప్పనిసరి. చాలామందికి ప్రాన్‌ కార్డు గురించి అవగాహన ఉన్నా కార్డు గురించి పూర్తిగా తెలియదు.  ఈ కార్డు  ప్రయోజనం తెలుసుకుందాం.

ప్రాన్‌ అంటే..?
పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నంబర్‌(ప్రాన్‌).. ఏటీఎం కార్డు వంటిది. సీపీఎస్‌ విధానంలో జీతాలు పొందుతున్న వారితోపాటు పింఛన్‌ పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కార్డు. తొలుత పింఛనర్లకే ఇచ్చేవారు. 2004లో కేంద్రం జాతీయ పింఛన్‌ పథకం బిల్లును ఆమోదించినప్పటి నుంచి ఈ కార్డు అమలులోకి వచ్చింది. ప్రాన్‌ కార్డు ద్వారా ఉద్యోగులు, పింఛన్‌దారులు ఎప్పటికప్పుడు తమ ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. ఉద్యోగం మారినా కార్డు మార్చుకోనవసరం లేదు. పిన్‌ నంబర్‌ ఆధారంగా కార్డును వినియోగించు కోవచ్చు. అయితే ఈ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం మాత్రం లేదు.

పొందడం ఇలా..
జీతాలు అందించే శాఖాధిపతుల(డ్రాయింగ్‌ అధికారులు) సిఫారసులతో జిల్లా కేంద్రాల్లో ఉండే కార్వీ కేంద్రాలకు పదో తరగతి సర్టిఫికెట్‌ అందించి నేరుగా గాని, గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారాగాని దరఖాస్తు చేసుకోవాలి. సీపీఎస్‌ ఉద్యోగులైతే జీతాల స్లిప్‌ను జతచేయాలి. వంద రూపాయలు చెల్లిస్తే రిజిస్టర్‌ పోస్టులో కార్డు అందుతుంది. జీతాల నుంచి పీఎఫ్‌ కోత ఉన్న ఉద్యోగులు ఈ ప్రాన్‌ కార్డు పొందే వీలు లేదు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌లో వివరాలు వచ్చాక పిన్‌ ఎంటర్‌ చేస్తే అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వీటిని సవరించుకోవచ్చు. వరుసగా మూడు నెలలపాటు ఒక్కసారి కూడా కార్డు వినియోగించకుంటే బ్లాక్‌ అవుతుంది. మళ్లీ వేరే పాస్‌వర్డ్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రయోజనాలు..
ఖాతాలో సొమ్ము నిల్వ గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు.
సీపీఎస్‌ విధానంలో ప్రతినెలా తమ వాటా సొమ్ము ఖాతాకు జమ అవుతోందో లేదో తెలుసుకునే వీలు కలుగుతుంది.
పింఛన్‌ లావాదేవీలకు పాన్‌ కార్డుతోపాటు ప్రాన్‌ కార్డు కూడా ఉపయోగించవచ్చు.
ప్రభుత్వపరంగా రుణాలు తీసుకున్నప్పుడు ఉపయుక్తమవుతుంది.
ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేసే సమయంలో ప్రాన్‌ కార్డు తప్పనిసరి

పిన్‌ నంబర్‌ మర్చిపోతే..
ప్రాన్‌ కార్డు పిన్‌ నంబర్‌ మర్చిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త పిన్‌ నంబర్‌ తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం ఉంది.  ఠీఠీఠీ.ఛిట్ఛ/nఛీట.ఛిౌఝ లోకి ఎంటర్‌ కావాలి. ఇందులో ఛిట్చnటఛీ∙పదాన్ని క్లిక్‌ చేయాలి. సీ యువర్‌ ప్రాన్‌ స్టేటస్‌ అనే పదం వద్ద క్లిక్‌ చేయాలి. సబ్‌స్క్రైబర్‌ ఇన్‌ఫర్మేషన్, నోడల్‌ అధికారి ఇన్‌ఫర్మేషన్‌ అనే రెండు బాక్స్‌లు వస్తాయి. సబ్‌స్క్రైబర్‌ బాక్స్‌లో ప్రాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. పాస్‌వర్డ్‌ అనే బాక్స్‌ వద్ద ఫర్‌ గెట్‌ పాస్‌వర్డ్‌/సీక్రెట్‌ క్వశ్చన్‌ రీసెట్‌ పాస్‌వర్డ్‌ అనే పదం కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. పాన్‌ కార్డుపై ప్రింట్‌ వివరాలు అడుగుతుంది. వాటిని నమోదు చేసి ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

సబ్మిట్‌ కొట్టిన తర్వాత మన ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది. అలా వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) నంబర్‌ బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి. అప్పడు కొత్త పాస్‌వర్డ్‌ వస్తుంది. దీన్ని తర్వాత వినియోగించుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement