National Pension Scheme
-
పెన్షన్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది. బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి.. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ కాని స్టార్టప్‌లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్‌లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నేషనల్ పెన్షన్ స్కీం గురించి పూర్తి సమాచారం..టాక్స్ బెనిఫిట్స్ - ప్లాన్స్...
-
నాలుగేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో), ఎన్పీఎస్ పథకాల్లో సభ్యుల చేరిక గణాంకాల ఆధారంగా గడిచిన నాలుగేళ్లలో 5.2 కోట్ల మందికి ఉపాధి లభించినట్టు ఎస్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇందులో 47 శాతం మందికి కొత్తగా ఉపాధి లభించగా, మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి ఈపీఎఫ్‌వో పేరోల్ డేటాను విశ్లేషించినప్పుడు నికర ఈపీఎఫ్ సభ్యుల చేరిక 2019–20 నుంచి 2022–23 మధ్య 4.86 కోట్లుగా ఉందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ‘ఎకోరాప్’ పేర్కొంది. ఇందులో కొత్తగా ఉపాధి లభించిన వారి సంఖ్య 2.27 కోట్లు ఉన్నట్టు, నికర పేరోల్ డేటాలో వీరు 47 శాతంగా ఉన్నట్టు ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. ఈ సంవత్సరాల్లో సంఘటిత రంగంలో 42 లక్షల మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలు మరింత ఆశాజనకంగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే 44 లక్షల మంది నికర సభ్యులు ఈపీఎఫ్‌లో భాగమయ్యారని, ఇందులో మొదటిసారి ఉపాధి పొందిన వారు 19.2 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. ‘‘ఇదే ధోరణి 2023–24 పూర్తి ఆర్థిక సంతవ్సరంలో కొనసాగితే అప్పుడు నికర సభ్యుల చేరిక 160 లక్షలుగా ఉండొచ్చు. మొదటిసారి చేరిన వారు 70–80 లక్షలుగా ఉండొచ్చు’’అని తెలిపింది. ఎన్పీఎస్ డేటా ప్రకారం 2022–23లో 8.24 లక్షల మంది కొత్త సభ్యులు చేరగా, ఇందులో రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి 4.64 లక్షలు, కేంద ప్రభుత్వం నుంచి 1.29 లక్షలు, ప్రభుత్వేతర సంస్థల నుంచి 2.30 లక్షల మంది ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్‌పీఎస్‌లో సభ్యుల చేరిక 31 లక్షలుగా ఉంది. 1.31 లక్షల ఒప్పంద ఉద్యోగాలు: ఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా తమ సభ్య కంపెనీలు 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో 1.31 లక్షల ఒప్పంద కారి్మకులను చేర్చుకున్నట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్‌లో 5.6 శాతం పెరిగాయని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. ఈ–కామర్స్, సరుకు రవాణా, తయారీ, ఆరోగ్యం, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, రిటైల్, బ్యాంకింగ్ విభాగాల రిక్రూట్మెంట్ కారణంగా ఇది సాధ్యమైందని చెప్పారు. 2023 జూన్ 30 నాటికి ఐఎస్ఎఫ్ సభ్య కంపెనీలు చేర్చుకున్న ఒప్పంద కారి్మకుల సంఖ్య 15 లక్షలకు చేరుకుందన్నారు. -
నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 45 శాతం పెన్షన్? ఆర్థిక శాఖ వివరణ
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కింద వారు ఉద్యోగ విరమణకు మందు చివరిగా అందుకున్న వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం ఒక కమిటీ చర్చిస్తోందని, ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పేర్కొంది. ఎన్పీఎస్ కింద ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పెన్షన్ ఖచ్చితమైన శాతం గురించి పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. ‘గత బడ్జెట్ సెషన్లో లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ, ప్రస్తుతం చర్చల స్థితిలో ఉంది. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ధారణలకు రాలేదు’ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారి చివరి వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్ వచ్చేలా నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించాలని భావిస్తోందంటూ రాయిటర్స్ కథనం వెలువరించింది. This is in reference to a news report carried in various news papers, purporting to give details of certain specific percentage of pension being proposed by the Government for the employees under National Pension System #NPS. This news report is false. The Committee, set up… — Ministry of Finance (@FinMinIndia) June 22, 2023 ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే! -
పెన్షన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త!
పెన్షన్ లబ్ధిదారలకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) శుభవార్త చెప్పింది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షన్ దారులు వారి నిర్ణయం ప్రకారం.. ఎంత నగదు కావాలనుకుంటే అంత నగదు విత్ డ్రా చేసుకోవచ్చని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మొహంతీ తెలిపారు. సిస్టమెటిక్ విత్‌డ్రా ప్లాన్‌లో భాగంగా 60 ఏళ్ల నుంచి 75 ఏళ్లలోపు నేషన్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) పెన్షన్ దారులు ఒకనెల, మూడు నెలలు, ఆరు నెలలు డబ్బుల్ని డ్రా చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ దారులు 60 ఏళ్ల తర్వాత తన రీటైర్మెంట్ సొమ్మును మొత్తం డ్రా చేసుకునేందుకు వీలు లేదు. కేవలం 60 శాతం మాత్రమే ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ఏడాదికి కొంత మొత్తాన్ని తీసుకునే సౌకర్యం ఉంది. తాజాగా, ఆ పథకంలో మార్పులు చేస్తున్నామని.. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు దీపక్ మొహంతీ పేర్కొన్నారు. ఇక, ఈ మార్పులతో ఎవరైతే 60 శాతం పెన్షన్‌ను ఒకేసారి తీసుకునేందుకు ఇష్టపడని వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దీంతో పాటు, ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన వారు 70 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. ఇప్పుడు ఆ కాలాన్ని మరో ఐదేళ్లు అంటే 75ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చివరిగా :: దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. చదవండి : సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట! -
రూ.10 లక్షల కోట్లకు పింఛను నిధులు
న్యూఢిల్లీ: పింఛను పధకాల నిర్వహణ ఆస్తుల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోనున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. చందాదారుల నుంచి క్రమం తప్పకుండా వస్తున్న చందాల వల్లే ఈ వృద్ధి సాధ్యమని చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం పీఎఫ్ఆర్డీఏ నిర్వహణలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), ఎన్పీఎస్ లైట్ పథకాల పరిధిలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.9.58 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘రూ.9.5 లక్షల కోట్ల ఏయూఎంను చేరుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం మధ్య భాగానికి ఏయూఎం రూ.10 లక్షలు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్క ఎన్పీఎస్ నిర్వహణ నిధి రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని తెలిపారు. నిధులపై వచ్చే రాబడులు, మార్కెట్ పనితీరు ఏయూఎంను ప్రభావితం చేస్తాయన్నారు. ఈక్విటీ, కొన్ని రకాల డెట్ ఆస్తుల రాబడులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుండడం తెలిసిందే. పింఛను పథకాల మొత్తం ఏయూఎం రూ.9.58 లక్షల కోట్లలో ఒక్క ఎన్పీఎస్ నిర్వహణ ఆస్తుల విలువే రూ.9.29 లక్షల కోట్లకు చేరినట్టు మహంతి తెలిపారు. ఏపీవై నిధులు రూ.28,538 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. విస్తరణకు చర్యలు ఎన్పీఎస్ కింద ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తుల పింఛను నిధులు కూడా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛను చందాలు వాటంతట అవే వస్తుంటాయని చెబుతూ.. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇవి వృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఇందుకోసం పీఎఫ్ఆర్డీఏ ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఏజెంట్లను అనుమతించామని, కార్పొరేట్ ఉద్యోగులు ఎన్పీఎస్ను తీసుకునే విధంగా ప్రోత్సాహక చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌గా ఈ–ఎన్పీఎస్ ఖాతాను తెరిచి, చందాలు చెల్లించే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదన్నారు. ఎన్పీఎస్ చందాదారుల సంఖ్య గతేడాదే 1.20 కోట్లకు చేరినట్టు తెలిపారు. ఈ ఏడాది చందాదారుల సంఖ్యను 1.3 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఏపీవై చందాదారుల సంఖ్య 5.2 కోట్లుగా ఉందని, ఇది చాలా గణనీయమైనదన్నారు. -
కేంద్ర ఉద్యోగుల్లో కొందరికి పాత పెన్షన్
న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ విధానం(ఎన్పీఎస్) అమల్లోకి వచ్చిన 2003 డిసెంబర్ 22వ తేదీకి ముందే ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ‘పాత పెన్షన్’ స్వీకరించే అవకాశం పొందారు. అంటే ఆ తేదీ కంటే ముందే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్/అడ్వర్ట్టైజ్డ్ చేసిన పోస్టుల్లో చేరిన ఉద్యోగులు మాత్రమే పాత పెన్షన్ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో చేరేందుకు వన్–టైమ్ ఆప్షన్ ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్ర సిబ్బంది శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ‘ఎన్పీఎస్ నోటిఫికేషన్‌కు ముందే ప్రకటించిన పోస్టులు/ఖాళీలకు అనుగుణంగా ఎంపికైనందున పాత పెన్షన్ స్కీమ్‌ను తమకు వర్తింపజేయాలని 2003 డిసెంబర్ 22కు ముందు కేంద్ర ఉద్యోగాల్లో చేరిన వారి వినతులు మాకు అందాయి. పలు రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనళ్లు వెలువర్చిన తీర్పులు, ఆ ఉద్యోగుల అభ్యర్థనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఉత్వర్వులో కేంద్రం పేర్కొంది. -
ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 5876 మంది చిరు వ్యాపారులు మాత్రమే నమోదయ్యారని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిపారు. రాజ్యసభలో గురువారం.. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయం తెలిపారు. 2023-2024 నాటికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 3 కోట్ల మంది వివిధ రకాలైన చిరు వ్యాపారులు, వర్తకులు, స్వయం ఉపాధిపై ఆధారపడే వారిని ఈ పథకంలో చేర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. చదవండి: చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి ఈ పథకం కింద ఈ ఏడాది జూలై 17 వరకు దేశవ్యాప్తంగా కేవలం 50680 మంది మాత్రమే నమోదయ్యారని మంత్రి చెప్పారు. గడిచిన రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి ఈ పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక మంది చిన్న వ్యాపారులు, వర్తకులు, వీధి వ్యాపారులు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ ధన్ పథకంలో ఇప్పటికే నమోదయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఆయా రాష్ట్రాల్లో అర్హులైన లబ్దిదారులు ఈ పథకంలో చేరేలా ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతీయ పెన్షన్ పథకంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని అన్నారు. -
ఎన్పీఎస్, ఏపీవై ఆస్తులు రూ.6.99 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల పరిధిలోని ఆస్తుల విలువ రూ.6.99 లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) మంగళవారం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి ఈ రెండు పథకాల పరిధిలో ఇన్వెస్టర్లకు చెందిన ఆస్తులు రూ.6,99,172 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. 2021 మార్చి 31 నాటికి ఈ ఆస్తులు రూ.5,78,025 కోట్లుగా ఉండడం గమనార్హం. 9 నెలల్లో 20 శాతం వృద్ధి చెందాయి. అసంఘటిత రంగంలోని వారికి ఉద్దేశించిన ఏపీవైలోని ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.19,807 కోట్లుగా ఉన్నాయి. ఎన్పీఎస్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పింఛను నిధులతోపాటు.. ప్రైవేటు రంగం ఉద్యోగుల పింఛను నిధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే, పౌరులు ఎవరైనా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్పీఎస్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ ఉద్యోగుల ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.3,52,217 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు రూ.2,11,656 కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఉద్యోగుల ఆస్తులు రూ.82,190 కోట్లుగా ఉన్నట్టు పీఎఫ్ఆర్డీఏ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరుల విభాగంలోని ఆస్తులు రూ.28,657 కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు పథకాలను పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షిస్తుంటుంది. -
పెన్షన్ ఇచ్చే ఫండ్స్
రిటైర్మెంట్ తర్వాతి జీవనం కోసం కొంత నిధిని ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మందికి సామాజిక భద్రత లేదు. కరెన్సీ విలువను హరించే ద్రవ్యోల్బణానికితోడు.. జీవన అవసరాలు, వ్యయాలు కాలక్రమంలో పెరుగుతూ వెళుతుంటాయి. ఆయుర్ధాయం సైతం గతంతో పోలిస్తే పెరిగింది. కనుక 60 ఏళ్లు వచ్చే నాటికి ప్రతి ఒక్కరి దగ్గర తగినంత నిధి లేకపోతే.. అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాలి. ఏదో నామమాత్రపు పొదుపు నిధిని సమకూర్చుకున్నా వృద్ధాప్య అవసరాలను ఎక్కువ కాలం తీర్చలేకపోవచ్చు. అందుకే ముందు నుంచీ భవిష్యత్తుపై ప్రణాళికతో విశ్రాంత జీవనానికి అవసరమైనంత నిధిని సమకూర్చుకోవాలి. ఇందుకోసం ఎన్నో సాధనాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు తోడు మ్యూచువల్ ఫండ్స్ అందించే పెన్షన్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సొల్యూషన్ ఓరియంటెడ్ రిటైర్మెంట్ విభాగం కూడా ఒకటి. ఈ ఫండ్స్ పనితీరు గురించి తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. సొల్యూషన్ ఓరియంటెడ్ రిటైర్మెంట్ కేటగిరీలో.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్, యాక్సిస్, ఫ్రాంక్లిన్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎల్ఐసీ, నిప్పన్ ఇండియా, ప్రిన్సిపల్, టాటా, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈక్విటీ, డెట్ ఆప్షన్లతో ఎన్నో రకాల రిటైర్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ఏక మొత్తంలో చేసే పెట్టుబడులు లేదా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో చేసే ప్రతీ పెట్టుబడికి ఐదేళ్లపాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే పెట్టుబడులను ఐదేళ్ల పాటు వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉండదు. ఒకవేళ ఐదేళ్లలోపే రిటైర్మెంట్ వయసు వచ్చేస్తే అప్పుడు ఉపసంహరణకు చాన్స్ ఉంటుంది. పన్ను ప్రయోజనం... ఈ ఫండ్స్ అన్నింటిలోనూ కేవలం ఐదు మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. ఫ్రాంక్లిన్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ, నిప్పన్ ఇండియా, యూటీఐ పథకాలకు పెన్షన్ ప్లాన్లుగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉంది. అంటే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం వీటి ద్వారా పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. మిగిలిన పథకాలకు ఈ ప్రయోజనం లేదు. ఎంపికలు ఎన్నో.. పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్లలో రాబడులు ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయి. ఇవి ఈక్విటీల్లో, డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఎల్ఐసీ, ఫ్రాంక్లిన్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒక్కొక్క ప్లాన్‌ను మాత్రమే ఆఫర్ చేస్తుంటే, మిగిలినవి ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన ఆప్షన్లతో ప్లాన్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ పథకం ప్రోగ్రెస్సివ్, మోడరేట్, కన్జర్వేటివ్ పేరుతో మూడు ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. పేరుకు తగినట్టు ఇవి వరుసగా.. 94 శాతం, 82 శాతం, 28 శాతం చొప్పున ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. యుక్తవయసులోని వారు, మధ్యస్థ వయసు, రిటర్మెంట్ వయసులోని వారికి నప్పే విధంగా వీటిని సంస్థ రూపొందించింది. ఈ విభాగంలో మొత్తం 25 పెన్షన్ పథకాలు ఉన్నాయి. ఎక్కువ పథకాలకు సంబంధించి ట్రాక్ రికార్డు తక్కువ కాలమే అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇవన్నీ గత పదేళ్ల కాలంలో వచ్చినవే. అంతేకాకుండా పెట్టుబడులకు సంబంధించి భిన్నమైన సాధనాలను అవి అనుసరిస్తుండడంతో వాటి మధ్య పనితీరును పోల్చడం అంత సరైనది అనిపించుకోదు. ఈక్విటీలకు చేసే కేటాయింపుల ఆధారంగా వీటిని నాలుగు ఉప విభాగాలుగా విభజించి చూడొచ్చు. ఈక్విటీలకు 85–100 శాతం ఈ విభాగంలో ఆరు పథకాలు కనీసం 85 శాతం ఈక్విటీల్లో పెట్టుబడి ఆప్షన్‌తో పనిచేస్తున్నాయి. అధిక రిస్క్ తీసుకునే, చిన్న వయసులోని వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రోగ్రెస్సివ్ ప్లాన్ ఇతర పథకాల కంటే పనితీరు విషయంలో మెరుగ్గా ఉంది. ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. కనుక ఐదేళ్ల కాలంలో ఈ పథకంలో రాబడులను గమనించినట్టయితే వార్షికంగా 11 శాతానికి పైనే ఉన్నాయి. ఏడేళ్లలో వార్షిక రాబడులు 15 శాతానికి పైగా ఉండడం గమనార్హం. ఈ విభాగంలోనే మరో పథకం హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఈక్విటీ ప్లాన్ 2016లో ప్రారంభమైంది. కనుక మూడేళ్లలో చూసుకుంటే రాబడులు వార్షికంగా 2 శాతం చొప్పునే ఉన్నాయి. నిప్పన్ ఇండియా రిటైర్మెంట్ వెల్త్ క్రియేషన్ ఐదేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడి కేవలం 2.75 శాతంగానే ఉంది. ప్రిన్సిపల్ రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రోగ్రెస్సివ్ ప్లాన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్–30, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ఫండ్ ప్యూర్ ఈక్విటీ పథకాల పనితీరు కూడా అంత మెరుగ్గా లేదు. ముఖ్యంగా ఇటీవలి మార్కెట్ పతనంతో రాబడుల తీరు మారిపోయింది. కనుక దీర్ఘకాలంలో ఈ పథకాలు మెరుగైన పనితీరు చూపించే అవకాశం లేకపోలేదు. ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలనుకునే వారు ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రోగ్సెస్సివ్ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. ఈక్విటీలకు 65–85 శాతం ఈ విభాగంలో 9 పథకాలు 65 నుంచి 85 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్‌తో ప్లాన్లలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు అధిక రాబడులకు తోడు కొంత శాతాన్ని డెట్‌కు కేటాయించడం ద్వారా రిస్క్‌ను తగ్గించే విధంగా పనిచేస్తాయి. రిస్క్ కొంచెం తక్కువ ఉండాలనుకునే మధ్య వయసు వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలోనూ టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ మోడరేట్ ప్లాన్ రాబడుల పరంగా ముందున్నది. ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10 శాతం చొప్పున, ఏడేళ్ల కాలంలో వార్షికంగా 15.68 శాతం చొప్పున ఇన్వెస్టర్ల పెట్టుబడులను వృద్ధి చేసింది. ఐదేళ్ల పది నెలల కాలంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. ఈ విభాగంలో హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ 2016 ఫిబ్రవరిలో మొదలైంది కనుక.. మూడేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడులు 4 శాతంగా ఉన్నాయి. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ యులిప్స్, ప్రిన్సిపల్ రిటైర్మెంట్ సేవింగ్స్ మోడరేట్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్ 40, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హైబ్రిడ్ అగ్రెస్సివ్, యాక్సిస్ రిటైర్మెంట్ సేవింగ్స్ డైనమిక్, యాక్సిస్ రిటైర్మెంట్ సేవింగ్స్ అగ్రెస్సివ్, ప్రిన్సిల్ రిటైర్మెంట్ సేవింగ్స్ కన్జర్వేటివ్ ప్లాన్లు కూడా ఈ విభాగం కిందకే వస్తాయి. హైబ్రిడ్ విభాగం.. ఈక్విటీలకు గరిష్టంగా 40 శాతం పెట్టుబడులను కేటాయించే పథకాలు ఇవి. మిగిలిన 60 శాతం నిధులను డెట్ విభాగంలో ఇన్వెస్ట్ చేస్తాయి. దీంతో రిస్క్ ఎక్కువ శాతం తగ్గుతుంది. తక్కువ రిస్క్ ఉండాలనుకునే వారు ఈ విభాగంలోని పథకాలను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో అచ్చమైన ఈక్విటీ పథకాలు ఇచ్చినంత రాబడులు వీటిల్లో ఉండవు. ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ కన్జర్వేటివ్ ప్లాన్ మంచి పనితీరు చూపిస్తోంది. ఐదేళ్ల లో 8 %, ఏడేళ్ల కాలంలో 10% చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, నిప్పన్ ఇండియా రిటైర్మెంట్ ఇన్కమ్ జనరేషన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్, యాక్సిస్ రిటైర్మెంట్ సేవింగ్స్ కన్జర్వేటివ్, ఐసీఐసీఐ ప్రు. రిటైర్మెంట్ హైబ్రిడ్ కన్జర్వేటివ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్ ఫండ్స్–50 ఈ విభాగం కిందకువస్తాయి. పూర్తి డెట్ ఫండ్స్ నూరు శాతం పెట్టుబడులను డెట్ విభాగంలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక ఓ మోస్తరు రాబడులను ఆశించొచ్చు. ఈ విభాగంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్ 50ప్లస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ప్యూర్ డెట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్ 50ప్లస్ ప్లాన్ 2019లోనే ప్రారంభమైంది. ఏడాది కాలంలో రాబడులు 6.63 శాతంగా ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ప్యూర్ డెట్ ప్లాన్ కూడా 2019లోనే ప్రారంభం కాగా, ఏడాది కాలంలో 9.77 శాతం రాబడులను చూపించింది. ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా..? మ్యూచువల్ ఫండ్స్ పెన్షన్ పథకాలకు అదనంగా ఇన్వెస్టర్లు తమ రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునేందుకు ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాలను కూడా పరిశీలించొచ్చు. కాకపోతే రిటర్మెంట్ పేరుతో ఉన్న ప్లాన్లలో ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. ఏదైనా అవసరమొచ్చినా నిధిని ఖాళీ చేసేయడానికి వీలుండదు. ఇది ఒక విధంగా ప్రయోజనకరమే. అదే ఎన్పీఎస్, యూఎల్‌పీపీ ప్లాన్లలో మెచ్యూరిటీ తర్వాత నిర్ణీత మొత్తంతో యాన్యుటి ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ పెన్షన్ ప్లాన్లలో ఇటువంటి నిబంధన లేదు. పెట్టుబడులను ఐదేళ్ల లాకిన్ తర్వాత ఎప్పుడైనా లేదా రిటైర్మెంట్ సమయంలోనూ పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ పెన్షన్ పథకాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.. అదే విధంగా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ రూపంలో కోరుకున్నంత ప్రతీ నెలా వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, యాక్సిస్, నిప్పన్ ఇండియా అయితే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఇన్వెస్టర్‌కు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నెలవారీ సిప్ మొత్తానికి 100 రెట్లు బీమా కవరేజీని అందిస్తోంది. ఇందుకు రూ.50 లక్షల గరిష్ట పరిమితి ఉంది. -
గడువు సమీపిస్తోంది.. సిద్ధ్దమేనా?
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను రిటర్నుల దాఖలు దగ్గర నుంచి పలు నిబంధనల అమలు విషయంలో ఎంతో ఊరట కల్పించింది. దీంతో వేతన జీవులకు, ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపశమనం లభించింది. మరి కొన్ని నిబంధనల అమలుకు ఇచ్చిన అదనపు గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. ఈ లోపు అమలు చేయాల్సిన వాటిపై ఇప్పుడే దృష్టి సారిస్తే చివరి నిమిషంలో కంగారు పడాల్సిన అవస్థ తప్పుతుంది. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయని వారికి కరోనా కారణంగా మరో అవకాశం లభించినట్టయింది. జూన్ 30 వరకు ఆలస్యపు రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. అదే విధంగా గతంలో దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేయాలనుకుంటే, దానికి సంబంధించి సవరణ రిటర్నులు వేసుకోవచ్చు. పాన్, ఆధార్ లింక్ చేయలేదా? పాన్ కార్డు కలిగిన ప్రతీ వ్యక్తి విధిగా తమ ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ఎప్పటి నుంచో కోరుతోంది. ఇందుకు సంబంధించిన గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. ఇలా పొడిగింపు ఇచ్చిన గడువు కూడా జూన్ 30తో ముగిసిపోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో విడత గడువు పొడిగించే అవకాశాలు లేకపోలేదు. అలా అని ఎంత కాలం పాటు దీన్ని వాయిదా వేయగలం? కనుక పాన్–ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేసుకోవడం మంచిది. గడువులోపు ఈ పని చేయకపోతే, ఒకవేళ గడువు పొడిగింపు ఇవ్వని పక్షంలో జూలై 1 నుంచి పాన్ పనిచేయకుండా పోతుంది. దాంతో పాన్ ఇవ్వలేని పరిస్థితి. దీనివల్ల ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద రూ.10,000 జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు పన్ను రిటర్నులు దాఖలు చేయలేరు. అలాగే బ్యాంకు ఖాతాల ప్రారంభం, బ్యాంకుల్లో డిపాజిట్లు, డీమ్యాట్ ఖాతాల ప్రారంభం, స్థిరాస్తుల లావాదేవీలు, సెక్యూరిటీల లావాదేవీలు, కారు కొనుగోలు వంటివి కష్టంగా మారతాయి. ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు దాటని వారు ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఫామ్ హెచ్15జీ (60 ఏళ్లు దాటిన వారు ఫామ్ 15హెచ్) సమర్పించొచ్చు. తమ ఆదాయం పన్ను వర్తించని కనీస పరిమితి (రూ.2.50 లక్షలు) లోపే ఉంటుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వడమే ఈ పత్రాలను సమర్పించడం. ఇలా ఇవ్వడం వల్ల బ్యాంకులు మీకు సంబంధించి డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్ అమలు చేయకుండా ఉంటాయి. ఒకవేళ బ్యాంకులు టీడీఎస్ అమలు చేస్తే రిటర్నులు దాఖలు చేసి కానీ రిఫండ్ కోరేందుకు అవకాశం ఉండదు. 2019–20 సంవత్సరానికి ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ సమర్పించేందుకు కేంద్రం జూన్ ఆఖరు వరకు గడువును పొడిగించింది. ఇక 2020–21 సంవత్సరానికి సంబంధించి ఈ పత్రాలను జూన్ 30 నాటికి సమర్పించాలి. దాంతో ఎటువంటి కోతల్లేకుండా చూసుకోవచ్చు. పన్ను ఆదాకు ఇప్పటికీ అవకాశం గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులకు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది. వాస్తవానికి మార్చి ఆఖరుతోనే గడువు ముగిసిపోవాల్సి ఉంది. కానీ, ఈ ఏడాది కరోనా కారణంగా లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. అదే విధంగా గృహ రుణం (మొదటి ఇంటికి) తీసుకుని దానికి చెల్లింపులు చేస్తుంటే, అసలు, వడ్డీ చెల్లింపులను కూడా రిటర్నుల్లో చూపించుకోవడం ద్వారా పన్ను రాయితీలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వైద్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులతోపాటు చట్ట పరిధిలో విరాళాలపైనా 2019–20 ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రయోజనాలను పొందేందుకు ఈ నెలాఖరు నాటికి ఇచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దు. ఇక కేంద్రం నోటిఫై చేసిన ఎన్హెచ్ఏఐ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ లేదా ఆర్ఈసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు చట్టపరంగా అవకాశం ఉంది. ఇతర పెట్టుబడులు పీపీఎఫ్ ఖాతాలో కనీసం రూ.500, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కనీసం రూ.250 చొప్పున ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ చేయడం తప్పనిసరి. కనుక 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిపాజిట్ కూడా చేయలేని వారికి గడువు ముగిసిపోయినా ప్రభుత్వం జూన్ 30 వరకు మరో అవకాశం ఇచ్చింది. దీనివల్ల రుసుములు పడవు. అదే విధంగా పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలోనూ ప్రతి నెలా కనీస మొత్తాన్ని తప్పకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీ పడుతుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జమలు చేయలేకపోయినప్పటికీ.. జూన్ 30 నాటికి చేయడం ద్వారా పెనాల్టీ లేకుండా చూసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో 60 ఏళ్లు దాటిన వారు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 55–60 ఏళ్ల మధ్య రిటైర్ అయిన వారు తమ రిటైర్మెంట్ నగదు ప్రయోజనాలను అందుకున్న నెలరోజుల్లోపు ఎస్సీఎస్ఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఇలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉండి, చేయలేకపోయిన వారు జూన్ 30 వరకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ ఈ ఏడాది మార్చి 20 నుంచి జూన్ 29వ తేదీ మధ్య కాలంలో చేయాల్సిన ముందస్తు పన్ను చెల్లింపులు, టీడీఎస్ వంటి వాటికి గడువు జూన్ 30 వరకు ఉంది. తగ్గించిన పెనాల్టీ చెల్లించడం ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్లు 234బి, 234సి ప్రకారం ఆలస్యపు చెల్లింపులపై ప్రతి నెలా 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా.. దీనికి బదులు 0.75 శాతం చెల్లిస్తే చాలు. 2020–21 అసెస్మెంట్ (మదింపు) సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ముందస్తు పన్ను చెల్లించేందుకు గడువు జూన్ 15వ తేదీ. జూన్ 30 తర్వాత చేసే ఆలస్యపు చెల్లింపులపై 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సిందే. -
ఆందోళన బాట పట్టిన రైల్వే ఉద్యోగులు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఏకంగా పార్లమెంట్ ముందే నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. మంగళవారం నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలో 40వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని సమాచారం. దీనిపై ఆల్ ఇండియా రైల్వే ఫెడరేరషన్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. జాతీయ పెన్షన్ విధానాన్ని(ఎన్పీఎస్) రద్ధు చేయడంతో పాటు, తమ జీతాలను పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రస్తుత ఎన్పీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ విధానంపై సమీక్షించడానికి గత సంవత్సరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారికి కనీసం పెన్షన్ భద్రత కూడా లేదన్నారు. అన్నీ రైల్వే డివిజన్లకు చెందిన ఉద్యోగులు నిరసనలో పాల్గొంటారని తెలిపారు. కనీస వేతనాన్ని 18వేల నుంచి 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ ఆందోళనల వల్ల రైళ్లలో ప్రయాణించేవారికి ఎటువంటి అంతరాయం ఉండబోదన్నారు. -
సొంతింటికి పెన్షన్ రుణం!
ఈ ఏడాది చివరికల్లా జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) చందాదారులకు గృహ రుణాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక దేశాల్లో గృహ అవసరాల కోసం ఎన్‌పీఎస్‌లో కొంత నిధులను వినియోగించుకునే వీలుంది. అంతెందుకు! పీఎఫ్‌లోనూ ఈ సౌకర్యం ఉంది. అందుకే ఎన్‌పీఎస్‌లోనూ దీన్ని అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఎ.జి.దాస్ చెప్పారు. ఇక్కడ ఎన్పీఎస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఎన్పీఎస్ సభ్యులకు గృహ రుణాలివ్వాలనే ప్రతిపాదనపై కమిటీ ఏర్పాటు చేశాం. అది నివేదిక ఇచ్చింది. ఆర్థిక మంత్రి అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని ఆయన వివరించారు. వివిధ అంశాలపై ఆయన ఏం చెప్పారనేది ఆయన మాటల్లోనే... మూడేళ్లకే 25 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు ఈ ఏడాది జనవరి నుంచి ఎన్‌పీఎస్‌లో 25 శాతం సొమ్మును ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తూ పీఎఫ్ఆర్డీఏ నిబంధనలను సడలించటం తెలిసిందే. అయితే చందాదారులు ఎన్‌పీఎస్‌లో చేరి కనీసం మూడేళ్లు దాటితేనే ఈ వెసులుబాటు ఉంటుంది. గతంలో సభ్యత్వం తీసుకున్న పదేళ్ల తర్వాతే ఈ ఉపసంహరణకు వీలుండేది. పథకం మొత్తం కాలంలో 3 సార్లు మాత్రమే ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. గృహ అవసరాలకే కాకుండా సొంతిల్లు కొనేందుకు, అనారోగ్య సమస్యలు, ఉన్నత చదువులు, పిల్లల పెళ్లి వంటి వాటికి ఉప సంహరణ చేసుకునే వీలు కల్పించారు. అయితే చందాదారులకు అప్పటికే వ్యక్తిగత, ఉమ్మడి లేదా పూర్వీకుల ఆస్తి ఉంటే ఉపసంహరణకు వీలుండదు. పెన్షన్ పథకాలన్నీ పీఎఫ్ఆర్డీఏ పరిధిలోకే.. మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు సైతం పెన్షన్ పథకాలను నిర్వహిస్తున్నాయి. ఇవి సెబీ, ఐఆర్డీఏఐ నియంత్రణలో ఉంటాయి. దేశంలోని అన్ని పెన్షన్ పథకాలు పీఎఫ్ఆర్డీఐ పరిధిలోనే ఉండాలనే ప్రభుత్వాన్ని కోరాం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం దేశంలో 78 డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఉన్నాయి. గతంలో ఫండ్ మేనేజర్ల కోసం టెండర్లు పిలిచాం. 8 మందిని ఖరారు చేశాం కూడా. అయితే గతంలో ఫండ్ మేనేజర్లిచ్చిన ఆర్ఎఫ్పీ దీనికి చెల్లదు. మళ్లీ తాజా టెండర్లు పిలవాలి. కొత్త ఎఫ్‌డీఐ విధానం ఖరారయ్యాక.. మళ్లీ ఫండ్ మేనేజర్ల కోసం టెండర్లు పిలుస్తాం. పెన్షన్ పరిశ్రమకు ప్రత్యేక ఎఫ్‌డీఐ.. ప్రస్తుతం పెన్షన్, బీమా పరిశ్రమ రెండింటికీ ఒకే రకమైన ఎఫ్‌డీఐ నిబంధనలున్నాయి. తాజాగా పెన్షన్‌లో ఎఫ్‌డీఐ నిబంధనల్ని మార్చాలంటూ కమిటీ నివేదించింది. బీమాతో సంబంధం లేకుండా పెన్షన్ పరిశ్రమకు ప్రత్యేక ఎఫ్‌డీఐ విధానాన్ని ప్రకటించాలని ఆర్ధిక మంత్రిని, పారిశ్రామిక ప్రోత్సాహకాల, విధాన విభాగాన్ని (డీఐపీపీ) కోరాం. అంతిమ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. 2015లో కేంద్రం బీమా, పెన్షన్ పరిశ్రమలో 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐలను 49 శాతానికి పెంచింది. ఉద్యోగుల్లో 14–15 శాతమే పెన్షన్‌లో... విదేశాలతో పోలిస్తే మన దేశంలో పెన్షన్ చందాదారుల సంఖ్య చాలా తక్కువ. పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో ఆర్ధిక భరోసా కోసం ముందే ఆలోచించకపోతే అనేక ఇబ్బందులు పడాలి. ప్రస్తుతం దేశంలో ప్రతి 12 మందిలో ఒకరు 60 ఏళ్లకు పైబడి ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య ఐదుగురిలో ఒకరికి చేరుతుంది. మొత్తంగా దేశంలో 10 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడిన వారున్నారు. 2050 నాటికిది 30 కోట్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం జనాభాలోని ఉద్యోగుల్లో 14–15 శాతమే ఏదో ఒక పెన్షన్ పథకంలో చేరారు. ప్రతి 8 మందిలో ఒకరే పెన్షన్ పథకంలో చందాదారులుగా ఉన్నారు. 2.05 కోట్ల సభ్యులు; రూ.2.25 లక్షల కోట్లు ఆస్తులు.. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ ఎన్‌పీఎస్‌లో సభ్యులే. ప్రస్తుతం ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) రెండు కలిపి 2.05 కోట్ల మంది చందాదారులున్నారు. రెండింటి నిర్వహణ ఆస్తి విలువ (ఏయూఎం) రూ.2.25 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చి 6 నాటికి ఎన్పీఎస్ సభ్యులు 13.16 లక్షలకు చేరారు. ఇందులో 6.83 మంది లక్షల సభ్యులు 4,365 కార్పొరేట్ కంపెనీలలో నుంచి ఉన్నారు. నిర్వహణ ఆస్తుల్లో అటల్ పెన్షన్‌కు రూ.3,500 కోట్ల వాటా ఉంది. ఈ ఏడాది ముగిసే నాటికి ఏపీవై సభ్యుల సంఖ్యను కోటికి చేర్చాలని లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది కాలంలో సభ్యత్వంలో 28 శాతం, ఏయూఎం 47–48 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. గత ఐదేళ్లలో ఎన్‌పీఎస్‌లో 10 శాతం రిటర్న్స్ వచ్చాయి. -
ఎన్పీఎస్ ఉపసంహరణ అవకాశం ఇక మూడేళ్లకే..
పశ్చిమగోదావరి, నిడమర్రు : జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్) ఖాతాదారులు తాము జమ చేసిన నగదులో కొంత మొత్తాన్ని ఇకపై మూడేళ్ల తర్వాతే తీసుకునేలా ఇటీవల నిబంధనలను సవరించారు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) జనవరిలో ఓ నోటీసులో పేర్కొంది. ఇప్పటివరకూ చందాదారులు భవిష్యత్తు కోసం దాచుకోవడం ప్రారంభించిన సొమ్మును, ఎంత అత్యవసరమైనా సుదీర్ఘ కాలం పాటు తీసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పటివరకూ పదేళ్లు పథకంలో కొనసాగిన తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతించేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత నిర్దిష్ట అవసరాల కోసం ఎన్పీఎస్ నుంచి సొమ్ము తీసుకునేందుకు ఇకపై అనుమతిస్తారు. గత నెల 10వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ తాజా నిబంధనలు తెలుసుకుందాం. పాక్షిక ఉపసంహరణకు గరిష్ట మొత్తం 25 శాతం.. పాక్షిక వాపసు తీసుకునేందుకు అనుమతించే గరిష్ట మొత్తం 25 శాతం మాత్రమే. ఎన్పీఎస్ ఖాతాలు రెండు రకాలు టైర్ 1 ఖాతాలో జమ చేసే సొమ్మును 60 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉపసంహరించుకునే వీల్లేదు. టైర్ 2 ఖాతా తెరిచిన వారికి సేవింగ్స్ ఖాతా మాదిరి ఎప్పుడైనా ఉనసంహరణకు అనుమతిస్తారు. అంటే చందాదా రుడు చెల్లించిన మొత్తానికి 25 శాతం మించిన మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వ వాటాగా చెల్లించవలసిన 10 శాతం మొత్తం నుంచి పాక్షిక ఉనసంహరణకు అనుమతించరు. మొదటి తరహా ఖాతా విషయంలోనే ఉపసంహరణ నిబంధనలు ఇప్పుడు సవరించారు. నిబంధనలు ఇలా ♦ చందాదారునికి పిల్లలు/చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి ♦ చందాదారుని పిల్లలు/చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల వివాహం కోసం ♦ చందాదారుడు సొంతంగా కాని/జీవిత భాగస్వామితో గాని కలిపి నివాసగృహం/ప్లాట్ కొనుగోలు/నిర్మాణం కోసం (పూర్వీకుల ఆస్తి కాకుండా చందాదారుడు వ్యక్తిగతంగా కానీ ఉమ్మడిగా గాని గృహం/ప్లాట్ కలిగిఉంటే ఉపసంహరణకు అనుమతించరు) ♦ చందాదారుడు/జీవిత భాగస్వామి, పిల్లలు, దత్తత పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులు పలు వ్యాధులతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నప్పుడు వైద్య చికిత్సల కోసం అనుమతించే వ్యాధులు క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ, పల్మనరీ ఆర్టిరియల్ హైపర్ టెన్సన్, మల్టిపుల్ స్లి్కరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, ఆర్టోగ్రాఫ్ సర్జరీ, హార్ట్ వాల్వ్ సర్జరీ, స్ట్రోక్, మయోకార్టియల్ ఆంఫోరష్కన్, కోమా, అంధత్వం, పక్షవాతం, యాక్సిడెంట్, ప్రాణాంతక ఇతర వ్యాధులు ఉపసంహరణకు పరిమితులు ♦ పాక్షిక ఉపసంహరణ చందాదారుడు ఈ పరిమితులకు లోబడి అనుమతిస్తారు. ♦ చందాదారుడు జాతీయ పెన్షన్ పథకంలో చేరిన తేదీ నుంచి మూడేళ్లు పూర్తి అయి ఉండాలి. ♦ చందాదారుడు దరఖాస్తు చేసిన నాటికి చందాదారుడు చెల్లించిన మొత్తానికి 25 శాతం మించిన మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు. గరిష్ట కాలపరిమితి జాతీయ పెన్షన్ పథకం కాలపరిమితి ముగిసేలోపు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పాక్షిక ఉనసంహరణకు అనుమతిస్తారు. పాక్షిక ఉపసంహరణకు చందాదారుడు సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ(సీఆర్ఏ) లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌కు తగిన ధ్రువీకరణ పత్రాలతో నోడల్ అధికారి ద్వారా దరఖాస్తు చేయాలి. చందాదారుడు ఏదేని అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయవచ్చు. పాక్షిక ఉపసంహరణ విధానం చందాదారులు తమ పాక్షిక ఉపసంహరణ (పార్షియల్ విత్ డ్రాయల్) కోసం ఫారం 601పీడబ్లూ ఉపయోగించాలి. గత సర్క్యులర్‌లో ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తించు మార్గదర్శకాలే పాక్షిక ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తిస్తాయి. -
ప్రాన్ కార్డుతో.. ప్రయోజనాలెన్నో..
నిడమర్రు : పాన్ కార్డు.. ప్రాన్ కార్డు.. అక్షరమే తేడా ఉన్నా రెండు కార్డులు ఎంతో ఉపయుక్తమైనవి. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారందరికీ అవసరమైనదైతే, ప్రాన్ కార్డు ఉద్యోగులు, జాతీయ పింఛన్ పథకం ఖాతా దారులకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వమే దీన్ని అందజేస్తుంది. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయుల, ఉద్యోగులకు ఈ కార్డులు అందజేస్తుంది. చాలామంది పింఛన్‌దారులు వినియోగించక పోవడంతో దీని ప్రయోజనం పొందలేకపోతున్నారు. 2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం లేదు. వీరి జీతాల నుంచే నెలనెలా కొంత మొత్తం ప్రభుత్వం వసూలు చేసి ప్రత్యేక ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంది. దీన్ని కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అంటారు. ఈ సీపీఎస్ విధానంలో ఉన్నవారికి ప్రాన్ కార్డు తప్పనిసరి. చాలామందికి ప్రాన్ కార్డు గురించి అవగాహన ఉన్నా కార్డు గురించి పూర్తిగా తెలియదు. ఈ కార్డు ప్రయోజనం తెలుసుకుందాం. ప్రాన్ అంటే..? పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్).. ఏటీఎం కార్డు వంటిది. సీపీఎస్ విధానంలో జీతాలు పొందుతున్న వారితోపాటు పింఛన్ పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కార్డు. తొలుత పింఛనర్లకే ఇచ్చేవారు. 2004లో కేంద్రం జాతీయ పింఛన్ పథకం బిల్లును ఆమోదించినప్పటి నుంచి ఈ కార్డు అమలులోకి వచ్చింది. ప్రాన్ కార్డు ద్వారా ఉద్యోగులు, పింఛన్‌దారులు ఎప్పటికప్పుడు తమ ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. ఉద్యోగం మారినా కార్డు మార్చుకోనవసరం లేదు. పిన్ నంబర్ ఆధారంగా కార్డును వినియోగించు కోవచ్చు. అయితే ఈ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం మాత్రం లేదు. పొందడం ఇలా.. జీతాలు అందించే శాఖాధిపతుల(డ్రాయింగ్ అధికారులు) సిఫారసులతో జిల్లా కేంద్రాల్లో ఉండే కార్వీ కేంద్రాలకు పదో తరగతి సర్టిఫికెట్ అందించి నేరుగా గాని, గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారాగాని దరఖాస్తు చేసుకోవాలి. సీపీఎస్ ఉద్యోగులైతే జీతాల స్లిప్‌ను జతచేయాలి. వంద రూపాయలు చెల్లిస్తే రిజిస్టర్ పోస్టులో కార్డు అందుతుంది. జీతాల నుంచి పీఎఫ్ కోత ఉన్న ఉద్యోగులు ఈ ప్రాన్ కార్డు పొందే వీలు లేదు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో వివరాలు వచ్చాక పిన్ ఎంటర్ చేస్తే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వీటిని సవరించుకోవచ్చు. వరుసగా మూడు నెలలపాటు ఒక్కసారి కూడా కార్డు వినియోగించకుంటే బ్లాక్ అవుతుంది. మళ్లీ వేరే పాస్వర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోజనాలు.. ♦ ఖాతాలో సొమ్ము నిల్వ గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు. ♦ సీపీఎస్ విధానంలో ప్రతినెలా తమ వాటా సొమ్ము ఖాతాకు జమ అవుతోందో లేదో తెలుసుకునే వీలు కలుగుతుంది. ♦ పింఛన్ లావాదేవీలకు పాన్ కార్డుతోపాటు ప్రాన్ కార్డు కూడా ఉపయోగించవచ్చు. ♦ ప్రభుత్వపరంగా రుణాలు తీసుకున్నప్పుడు ఉపయుక్తమవుతుంది. ♦ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో ప్రాన్ కార్డు తప్పనిసరి పిన్ నంబర్ మర్చిపోతే.. ప్రాన్ కార్డు పిన్ నంబర్ మర్చిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త పిన్ నంబర్ తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంది. ఠీఠీఠీ.ఛిట్ఛ/nఛీట.ఛిౌఝ లోకి ఎంటర్ కావాలి. ఇందులో ఛిట్చnటఛీ∙పదాన్ని క్లిక్ చేయాలి. సీ యువర్ ప్రాన్ స్టేటస్ అనే పదం వద్ద క్లిక్ చేయాలి. సబ్‌స్క్రైబర్ ఇన్ఫర్మేషన్, నోడల్ అధికారి ఇన్ఫర్మేషన్ అనే రెండు బాక్స్‌లు వస్తాయి. సబ్‌స్క్రైబర్ బాక్స్‌లో ప్రాన్ నంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనే బాక్స్ వద్ద ఫర్ గెట్ పాస్వర్డ్/సీక్రెట్ క్వశ్చన్ రీసెట్ పాస్వర్డ్ అనే పదం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. పాన్ కార్డుపై ప్రింట్ వివరాలు అడుగుతుంది. వాటిని నమోదు చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మన ఫోన్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అలా వచ్చిన వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నంబర్ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. అప్పడు కొత్త పాస్వర్డ్ వస్తుంది. దీన్ని తర్వాత వినియోగించుకోవచ్చు. -
జాతీయ పెన్షన్ పథకం: ఒక ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పి ఎస్) లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ పెన్షన్ పథకానికి సంబంధించి వయో పరిమితి 65 సంవత్సరాలకు పెంచింది. ఈ మేరకు పెన్షన్ రెగ్యులేటరీ బోర్డు ఆమోదించిందనీ పిఎఫ్ఆర్డీఏ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు ఇది 60 ఏళ్లుగా ఉంది. నేషనల్ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) లో చేరిన ఉన్నత వయస్సు పరిమితి ప్రస్తుత 60 ఏళ్లకు 65 ఏళ్లుగా పెంచిందని సోమవారం ప్రకటించింది. పెన్షన్ రెగ్యులేటర్ బోర్డు ఇప్పటికే సవరణను ఆమోదించిందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డీఏ) ఛైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ ప్రకటించారు. దీనిపై త్వరలోనే నోటిఫై చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 18-60 మధ్య వయసు పరిమితిని తాజా సవరణ ప్రకారం గరిష్టంగా 65 సం.రాలుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇదే లో-కాస్ట్ పెన్షన్ పథకమని చెప్పారు. తాజా సవరణ ద్వారా వేలాదిమందికి లాభం కలిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వయసు చెల్లిన నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలను సులభంగా అందించేందుకు పీఎఫ్ఆర్డీఏ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న 85 శాతం మంది ఉద్యోగులకు కూడా పెన్షన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హేమంత్ వెల్లడించారు. -
‘ఎన్పీఎస్ నుంచి రైల్వేని మినహాయించండి’
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)నుంచి రైల్వే శాఖను తప్పించి పాత రైల్వే సర్వీసెస్ పెన్షన్ స్కీమ్-1993ను పునరుద్ధరించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ‘రైల్వే కార్మికుల విధులు సైనిక బలగాల విధుల్లా కష్టభరితంగా ఉంటాయి. ఏడాదిపొడవునా 24 గంటలూ రైల్వేలను నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మినహాయింపివ్వాలి’ అని కోరారు -
ప్రీమియం చెల్లించకపోయినా, చార్జీలు తప్పవా?
నేను 2008, మార్చిలో బజాజ్ అలయంజ్ న్యూ ఫ్యామిలీ గెయిన్ పాలసీని తీసుకున్నాను. 2011 మార్చి వరకూ రూ.36,000 ప్రీమియమ్ చెల్లించాను. ఆ తర్వాత ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేశాను. ప్రస్తుతం ఈ ఫండ్ విలువ రూ.27,443గా ఉంది. ఈ పాలసీ 2018 మార్చిలో మెచ్యూర్ అవుతుంది. గత ఏడాది వివిధ చార్జీల కింద రూ.5,013ను ఈ ఫండ్ నుంచి కోత కోశారు. ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పటికీ, చార్జీల కోత తప్పదా? ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? కొనసాగమంటారా ? సలహా ఇవ్వండి. - సర్వేశ్, విశాఖపట్టణం బజాజ్ అలయంజ్-న్యూ ఫ్యామిలీ గెయిన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(యూలిప్) పాలసీ. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించిన ప్రీమియమ్ నుంచి మెర్టాలిటీ చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు,... తదితర చార్జీలను మ్యూచువల్ ఫండ్ సంస్థ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ బాగా ఉన్నప్పటికీ, ఈ చార్జీల కారణంగా ఈ తరహా యులిప్‌లపై వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. మీరు ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పటికీ, పూర్తి కాలానికి వర్తించే ఫిక్స్డ్ చార్జీలను మీ ఫండ్ నుంచి మినహాయించుకుంటారు. భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికి గాను ఈ ప్లాన్‌ను సరెండర్ చేయండి. మీరు సరెండర్ చేసేటప్పుడు ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే మీ సరెండర్ వాల్యూ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడూ బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లను ఎంచుకోవద్దు. బీమా కోసం టర్మ్ పాలసీ తీసుకోవాలి. టర్మ్ పాలసీల్లో ప్రీమియమ్‌లు తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఏదైనా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 50 సంవత్సరాలు. ప్రవాస భారతీయుడిని. రూ.3 కోట్లకు టర్మ్ పాలసీని (రూ.3 కోట్ల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కవర్ కూడా ఉండాలి) తీసుకోవాలనుకుంటున్నాను. ప్రవాస భారతీయులకు పాలసీలను ఆఫర్ చేస్తున్న భారత కంపెనీల వివరాలను తెలియజేయండి. అలాగే నా అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్వీస్, క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియా, తదితర అంశాల ఆధారంగా నాకు తగిన టర్మ్ పాలసీని సూచించండి. - ప్రదీప్ జైన్, ఈ మెయిల్ ద్వారా పలు భారత బీమా కంపెనీలు ప్రవాస భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ పాలసీలను తీసుకునే ముందు మీరు రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది వ్యయం. మీరు ఎంచుకున్న పాలసీ విదేశాల్లో చౌకగా లభించే అవకాశాలున్నాయా? రెండోది. పన్ను వ్యవహారాలు. మీరు నివసిస్తున్న దేశంలో పన్ను చట్టాలు ఎలా ఉన్నాయి. .. ఈ రెండు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక మీరు తీసుకున్న పాలసీకి చెల్లించే ప్రీమియమ్.. అదనపు రైడర్స్‌కు కూడా కవరవుతుందో, లేదో చెక్ చేసుకోవాలి. లేకుంటే అదనపు రైడర్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయం కూడా చెక్ చేసుకోవాలి. మీరు భారత్‌కు వచ్చినప్పుడు టర్మ్ పాలసీ తీసుకుంటే బావుంటుంది. దీని వల్ల విదేశాల్లో వైద్య పరీక్షలు జరిపించుకొని, సంబంధిత రిపోర్టులను బీమా కంపెనీకి పంపించడం కొంచెం వ్యయభరితమైనది. మీరు భారత్‌లోనే ఉన్నప్పుడు టర్మ్ పాలసీ తీసుకుంటే, ఈ వ్యయం మీకు తప్పుతుంది. 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తికి 3 కోట్ల బీమా కవరేజ్‌కు కొన్ని కంపెనీలు వసూలు చేస్తున్న వార్షిక ప్రీమియమ్‌లు, వాటి క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి(గత ఆర్థిక సంవత్సరం) వివరాలు ఇస్తున్నాం. పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మ్యాక్స్‌లైఫ్ వార్షిక ప్రీమియం రూ.54,960గా, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 96.03గా ఉంది. బిర్లా సన్‌లైఫ్ వార్షిక ప్రీమియం రూ.48,262 కాగా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95.3గా ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ లైఫ్ వార్షిక ప్రీమియం రూ.54,025గా ఉండగా, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 90.5గా ఉంది. నేను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) ఖాతాను ప్రారంభించాను. ఈ ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది కదా! ఇప్పుడు పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవచ్చా? అలాంటి వెసులుబాటు లభిస్తుందా? వివరించగలరు. - మాధురి, హైదరాబాద్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపికను మార్చుకునే అవకాశం ఎన్‌పీఎస్‌లో ఉంది. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌ను(యాక్టివ్ నుంచి ఆటో చాయిస్‌కు లేదా ఆటో చాయిస్ నుంచి యాక్టివ్‌కు) కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు మీ ఎన్పీఎస్ ఖాతాకు సంబంధించి ఎనిమిది పెన్షన్ ఫండ్స్ నుంచి ఒకదానిని ఎంచుకోవచ్చు. ఆ ఎనిమిది పెన్షన్ ఫండ్స్ఏమంటే-ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్, ఎల్ఐసీ పెన్షన్ ఫండ్, కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్ పెన్షన్ ఫండ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ ఫండ్, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ కంపెనీ, డీఎస్పీ బ్లాక్‌రాక్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్.. ఈ ఎనిమిది పెన్షన్ ఫండ్స్ నుంచి ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. గతంలో ఎంచుకున్నదానిని మార్చుకోవచ్చు. ఈ మార్పును సూచిస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు ప్రాసెస్కాగానే సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీ(సీఆర్ఏ) సిస్టమ్ నుంచి మీ నమోదిత ఈమెయిల్ ఐడీకి ఒక ఈ మెయిల్ వస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎన్పీఎస్-ఈపీఎఫ్ ఏది మంచిది?
విభిన్నమైన ప్రయోజనాలు అందించే నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను (ఎన్పీఎస్) ప్రభుత్వం సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చి ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీంతో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) విత్‌డ్రాయల్స్‌లో కొంత మొత్తంపై పన్నులు విధించే ప్రతిపాదన ద్వారా ఎన్‌పీఎస్‌తో దీన్ని సమం చేసేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను అటువైపు కూడా మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈపీఎఫ్‌కు, ఎన్పీఎస్ లక్షణాలేంటి? వీటి మధ్య ఉన్న తేడాలేంటి? చూద్దాం... * ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా చూడొద్దు * రెండింటితోనూ వేర్వేరు ప్రయోజనాలు పెట్టుబడుల విధానం.. * ఈపీఎఫ్‌కు క్రమం తప్పకుండా బేసిక్ వేతనం నుంచి కొంత మొత్తాన్ని జమచేయాలి. కంపెనీయే ఉద్యోగి జీతం నుంచి ఈ మొత్తాన్ని కట్ చేసి తన ఈపీఎఫ్ ఖాతాకు జమచేస్తుంది. అంతే మొత్తాన్ని కంపెనీ కూడా జోడిస్తుంది. * ఎన్పీఎస్ మాత్రం పూర్తిగా స్వచ్ఛందం. ఇన్వెస్టర్లు ఏకమొత్తంగానైనా లేదా ఇతరత్రా వాయిదాల పద్ధతిలోనైనా తమ ఇష్టప్రకారం కట్టుకోవచ్చు. కనిష్ట, గరిష్ట పెట్టుబడి.. * ఈపీఎఫ్‌కు ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో కొంత మొత్తం చెల్లించాలి. కంపెనీ కూడా అంతే చెల్లిస్తుంది. ఉద్యోగి స్వచ్ఛందంగా ఎక్కువ కూడా కట్టుకోవచ్చు. * ఎన్‌పీఎస్‌కి సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.6,000 కట్టాలి. గరిష్ట పరిమితులేమీ లేవు. అసెట్ కేటాయింపులు.. * ఇప్పటి దాకా ఈపీఎఫ్ 100 శాతం పెట్టుబడుల్ని రుణ సాధనాల్లోనే పెట్టేది. ఈ మధ్యే పీఎఫ్ నిధిలో 5 శాతం మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఈపీఎఫ్‌వో ఇన్వెస్ట్ చేస్తోంది. గరిష్టంగా 15 శాతం దాకా పరిమితి ఉంది. * ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్టరే తన పెట్టుబడి మొత్తాన్ని ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏ రకంగా పెట్టుబడి పెట్టాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా డిఫాల్ట్ ఆప్షన్ కింద సదరు ఇన్వెస్టరు రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరవుతున్న కొద్దీ.. ఏటా కొంత కొంతగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతుంటాయి. మరో ఆప్షన్లో ఈక్విటీలకు గరిష్టంగా యాభై శాతమే కేటాయింపులు జరిపే వీలుంది. దీన్ని ఆరు పెన్షన్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తుం టాయి కనుక మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఆశించతగ్గ రాబడులు.. * ఈపీఎఫ్‌లో చందాదారులందరికీ వడ్డీ ఒకే రకంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.7 శాతం. దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇది కాస్త తగ్గొచ్చు లేదా అదే స్థాయిలోనూ కొనసాగవచ్చు. * ఈక్విటీల్లోనూ పెట్టుబడులు ఉంటా యి కనుక.. ఎన్పీఎస్ చందాదారులకు కొంత అధిక రాబడులొచ్చే అవకాశాలున్నాయి. పదేళ్లు ఆపైన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడి తే ఈపీఎఫ్ కన్నా ఎన్పీఎస్ స్కీము ద్వారా 2-3 శాతం మేర ఎక్కువ రాబడులు రావొచ్చు. అర్హత * ఈపీఎఫ్ అనేది ప్రైవేట్ సంస్థల్లోని వేతన జీవులకు మాత్రమే పరిమితం. 20 మంది పైగా ఉద్యోగులున్న సంస్థలకు ఇది తప్పనిసరి. * ఎన్పీఎఫ్ విషయానికొస్తే.. ఏప్రిల్ 2004 తర్వాత విధుల్లో చేరిన ప్రభుత్వోద్యోగులందరికీ ఇది తప్పనిసరి. వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందే వారు, గృహిణులు, సంఘటిత.. అసంఘటిత రంగాల్లో పనిచేసే సాధారణ ప్రజలు కూడా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి తన రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఇటు ఈపీఎఫ్ అటు ఎన్పీఎస్ను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ, వ్యాపారవేత్తలు లేదా స్వయం ఉపాధి పొందే వారికి ఈపీఎఫ్ ఉండదు. వారు ఎన్పీఎస్ లేదా పరిమిత స్థాయిలో పీపీఎఫ్ మాత్రమే వినియోగించుకోగలరు. పన్ను ప్రయోజనాలు.. * ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈపీఎఫ్ దీని పరిధిలోకే వస్తుంది. అయితే, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, బీమా పథకాలు, ట్యూషన్ ఫీజులు, 5 ఏళ్ల కాలపరిమితి బ్యాంకు డిపాజిట్లు అన్నీ సెక్షన్ 80సీ కిందికే వస్తాయి. * ఎన్పీఎస్ మాత్రం సెక్షన్ 80సీ పరిధిలోకి రాదు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కిందికి వస్తుంది. ఏడాదికి గరిష్టంగా రూ.50,000 దాకా మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80సీకి అదనమని గుర్తుంచుకోవాలి. * రిటైరైనప్పుడు మెచ్యూరిటీ సమయంలో మొత్తం ఈపీఎఫ్‌ను పన్ను ప్రసక్తి లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. * ఎన్పీఎస్ నుంచి మొత్తం నిధిని విత్‌డ్రా చేసుకోవటం కుదరదు. నిధిలో 40 శాతాన్ని పన్నుల్లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 60 శాతాన్ని కచ్చితంగా పెన్షన్ ప్లాన్ వంటి యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కావాలనుకుంటే పూర్తి మొత్తాన్ని కూడా యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. * స్థూలంగా చూస్తే ఎన్పీఎస్, ఈపీఎఫ్లనేవి ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదు. ఒకదానికి మరొకటి తోడుగా పరిగణించాలి. రెండూ ఉంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటి యాపిల్ అయితే మరొకటి నారింజలాంటిది. రెండిటినీ పోల్చలేం. కానీ ఈ రెండూ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. -
ఎన్పీఎస్ కోసం 75 వేలమందికి శిక్షణ
శిక్షణ సంస్థల ఎంపికలో పీఎఫ్ఆర్డీఏ న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) కోసం పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ, పీఎఫ్ఆర్డీఏ 75 వేలమందికి శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఇంత మందికి శిక్షణ ఇవ్వడం కోసం శిక్షణ సంస్థల ఎంపిక ప్రక్రియను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ(పీఎఫ్ఆర్డీఏ) చేపట్టింది. దేశవ్యాప్తంగా 600 జిల్లా కేంద్రాల్లో ఒక్కో సెషన్‌కు 45 మందికి చొప్పున 1,670 సెషన్లలో శిక్షణ ఇవ్వాలని తన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)లో పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. దాదాపు 75 వేలమందికి శిక్షణ ఇవ్వడానికి శిక్షణ సంస్థల సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి ఎన్పీఎస్కు 1.14 కోట్ల మంది చందాదారులున్నారు. ఎన్పీఎస్ మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉంది. ఎన్పీఎస్ అనేది స్వచ్ఛంద రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్, ఎవరైనా వ్యక్తి ఉద్యోగం/స్వయం ఉపాధి పొందుతున్న కాలంలో తమ భవిష్యత్ రిటైర్మెంట్ అవసరాల కోసం సిస్టమాటిక్ సేవింగ్స్ ద్వారా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. -
యాన్యుటీతో ఉపయోగాలేంటి?
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్), ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)ల్లో యాన్యుటీని కొనుగోలు చేయాలని చెబుతుంటారు కదా ? అసలు ఈ యాన్యుటీ అంటే ఏమిటి ? దీనివల్ల మనకు ఏం ఉపయోగాలున్నాయి? - సుకృతి, హైదరాబాద్ యాన్యుటీ వల్ల మీకు క్రమం తప్పకుండా కొంత ఆదాయం వస్తుంది. ఏదైనా ఒక జీవిత బీమా కంపెనీకి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపి ఈ యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ యాన్యుటీ కొనుగోలు వల్ల మీ రిటైర్డ్ జీవితానికి క్రమం తప్పకుండా కొంత ఆదాయం లభిస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో మీరు పొదుపు చేసిన మొత్తంలో కనీసం 40 శాతానికి యాన్యుటీని ఏదైనా జీవిత బీమా సంస్థ నుంచి కొనుగోలు చేయాలి. పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) ఆమోదం పొందిన జీవిత బీమా సంస్థ నుంచి మాత్రమే ఈ యాన్యుటీని కొనుగోలు చేయాలి. జీవిత కాలానికి ఆదాయం, జీవించి ఉన్నంతకాలం, ఆ తర్వాత జీవిత భాగస్వామికి ఆదాయం, తదితర ఆప్షన్లతో యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ యాన్యుటీ వల్ల పాలసీదారుడికి రిటైరైన తర్వాత క్రమం తప్పకుండా కొంత ఆదాయం వస్తుంది. నేను రెండు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ(యూలిప్)లను తీసుకున్నాను. 2011లో హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ క్రెస్ట్ పాలసీని తీసుకున్నాను. ఈ పాలసీ వార్షిక ప్రీమియం రూ.50,000. ఐదు ప్రీమియమ్‌లు చెల్లించాను. 2012లో హెచ్డీఎఫ్సీ పెన్షన్ సూపర్ ప్లస్ ప్లాన్‌ను కూడా తీసుకున్నాను. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం రూ.1.2 లక్షలు. ఇప్పటివరకూ మూడు వార్షిక ప్రీమియమ్‌లు చెల్లించాను. ఈ పాలసీలను సరెండర్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఈ పాలసీలను కొనసాగించమంటారా ? లేక ఈ పాలసీల నుంచివైదొలగమంటారా ? తగిన సలహా ఇవ్వండి? - నిర్మల్ కుమార్, వరంగల్ హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ క్రెస్ట్... ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). హెచ్డీఎఫ్సీ పెన్షన్ సూపర్ ప్లస్ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్. యూలిప్/యూఎల్‌పీపీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన మదుపు వ్యూహం కాదని చెబుతుంటాం. ఇవి ఖరీదైనవి. తగినంత బీమా కవర్‌ను ఇవ్వలేవు. అంతేకాకుండా తగిన రాబడులను కూడా అందించలేవు. హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ క్రెస్ట్ తీసుకొని ఐదేళ్లు అయిన ందున దీనిని మీరు సరెండర్ చేయవచ్చు. సరెండర్ చేసేటప్పుడు ఫండ్ విలువ ఎంత ఉంటుందో అంతే సరెండర్ విలువ మీకు వస్తుంది. ఇక హెచ్డీఎఫ్సీ పెన్షన్ సూపర్ ప్లస్ పాలసీ తీసుకొని ఐదేళ్లు కానందున దీనిని సరెండర్ చేస్తే డిస్కంటూన్యూడ్ చార్జీలు పోను సరెండర్ విలువ వస్తుంది. ఇది కూడా ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాతనే వస్తుంది. మీరు సరెండర్ చేసేటప్పుడు ఉన్న ఫండ్ ఎన్‌ఏవీపై ఆధారపడి సరెండర్ వేల్యూ ఉంటుంది. ఈ పాలసీలను సరెండర్ చేయడం వల్ల మీకు నష్టాలు వచ్చినప్పటికీ, వీటిల్లో కొనసాగక సరెండర్ చేయడమే మంచిదని నా అభిప్రాయం. ఎప్పుడూ బీమాను, ఇన్వెస్ట్‌మెంట్‌ను కలగలపవద్దు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం హైబ్రిడ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకోవద్దు. బీమా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఉత్తమం. వీటికి ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. తగిన రాబడులు వస్తాయి. మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. నేను ఎంబీఏ చదివాను. ఒక ఇన్ఫ్రా కంపెనీలో ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్నాను. రూ. కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక్కోటి రూ.50 లక్షల చొప్పున రెండు వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్లు తీసుకోవడం మంచిదా ? లేకుంటే ఒకే కంపెనీ నుంచి రూ. కోటికి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచిదా? ఆన్లైన్లో లభించే కొన్ని మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు సూచించండి? - శ్రీనివాస్, సూర్యాపేట భారీ మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే, ఒకే కంపెనీ నుంచి కాకుండా రెండు కంపెనీల నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం మంచిది. ప్రీమియం, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఏగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్, భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఈప్రొటెక్ట్.. ఈ సంస్థల టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. మీ వయస్సును బట్టి మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్‌ను, మీ ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని వీటిల్లోంచి పాలసీలను ఎంచుకోండి. మీకు, మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించి పాలసీలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. -
గతవారం బిజినెస్
ఎన్ఆర్ఐలు ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో చందాదారులుగా చేరేందుకు ప్రవాస భారతీయులను (ఎన్ఆర్ఐ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. తద్వారా వారికీ వృద్ధాప్య ఆదాయ భద్రతా పథకంలో చేరేందుకు వీలుకలగనుంది. సాధారణ బ్యాంకింగ్ మార్గాల ద్వారా లేదా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చందాదారులుగా ఉండవచ్చు. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కుదింపు? పెట్టుబడుల ఉపసంహరణలకు (డిజిన్వెస్ట్‌మెంట్) సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) లక్ష్యాన్ని కుదించే అంశాన్ని కేంద్రం యోచిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల బడ్జెట్ లక్ష్యం రూ.69,500 కోట్లు. ఈ మొత్తం లక్ష్యాన్ని సగానికికన్నా ఎక్కువగా రూ.30,000 కోట్లకు తగ్గించాలని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ భావిస్తున్నటు సమాచారం. 731 మిలియన్ డాలర్లకు క్లౌడ్ సర్వీసెస్ దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల రంగ ఆదాయాలు ఈ ఏడాది అఖరు నాటికి 731 మిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 31 శాతం వృద్ధి సాధించగలదని పేర్కొంది. భారత్‌లో క్లౌడ్ సేవలపై భారీగా వ్యయాలు పెరుగుతాయని, 2019 నాటికి ఇవి 19 బిలియన్ డాలర్లకు చేరొచ్చని వివరించింది. ఐదే ళ్లలో లక్ష కోట్లకు ఈటీఎఫ్ ఆస్తులు! దేశంలో ఈక్విటీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ (ఈటీఎఫ్) ఫండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, త్వరలోనే వీటి ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందని ఎన్ఏఎస్ఈ అంచనా వేస్తోంది. గత 12 ఏళ్లలో ఈటీఎఫ్ ఆస్తుల విలువ 12 రెట్లు పెరిగాయని, వచ్చే ఐదేళ్లలో ఈటీఎఫ్‌లు నిర్వహిస్తున్న ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ అన్నారు. చైనా సంపన్నుల్లో వాంగ్ టాప్ ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన చైనా సంపన్నుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం వాండా గ్రూప్ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్లిన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన సంపద 13.2 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 30 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా గతేడాది నాలుగో స్థానంలో ఉన్న ఆయన ఈసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దీంతో ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 21.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బంగారు భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 642 టన్నుల పసిడి వినియోగంతో చైనాను అధిగమించి మరోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిల్చింది. 579 టన్నుల బంగారం వినియోగంతో చైనా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ? ఐడీబీఐ బ్యాంకులో వాటాలు తగ్గించుకుని, ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా అది కూడా యాక్సిస్ బ్యాంకులాగా రూపాంతరం చెందేలా చూడాలని భావిస్తోంది. ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారి సతమతమవుతున్న ఐడీబీఐ బ్యాంకు పనితీరును మెరుగుపర్చుకునే వీలు కల్పించాలని యోచిస్తోంది. పేటీఎం ద్వారా బీమా ప్రీమియం చెల్లింపు ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం ప్రధాన బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. పాలసీదారులు ఆన్లైన్ ద్వారా ప్రీమియం చెల్లింపులు జరిపే సౌలభ్యం కల్పించేందుకు బీమా సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరకు రూ.1,000 కోట్ల ప్రీమియం చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, రెలిగేర్ హెల్త్, రిలయన్స్ లైఫ్, రిలయన్స్ జనరల్ సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది. క్యూ3లో మందగించిన అమెరికా వృద్ధి ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించింది. రెండో త్రైమాసికంలో 3.9 శాతంగా నమోదైన వృద్ధి.. క్యూ3లో 1.5 శాతానికి పరిమితమైంది. నిల్వలు పేరుకుపోవడం వల్ల వ్యాపార సంస్థలు కొత్తగా మరిన్ని కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడం దీనికి కారణమని విశ్లేషకులు తెలిపారు. వచ్చే నెల 6న ఐడీఎఫ్సీ బ్యాంక్ లిస్టింగ్! కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్లు వచ్చే నెల 6న స్టాక్మార్కెట్లో లిస్టవుతాయని అంచనా. ఈ నెల 5 వరకూ ఐడీఎఫ్సీ షేర్లున్న వాటాదారులకి ఒక్కో ఐడీఎఫ్సీ షేర్‌కు ఒక్కో ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్ కేటాయిస్తామని కంపెనీ పేర్కొంది. ఐడీఎఫ్సీ పుస్తక విలువ రూ.60గా ఉంది. ఈ లెక్కన ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్ విలువ రూ.39.11గా ఉండొచ్చని అంచనా. 5 నుంచి గోల్డ్ బాండ్ల స్కీమ్ పసిడి బాండ్ల పథకాన్ని నవంబర్ 5వ తేదీన ప్రభుత్వం ప్రారంభిస్తోంది. పెట్టుబడి తొలి విలువ ప్రాతిపదికన బాండ్లపై 2.75 శాతం వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు ...బ్యాంకులు, నోటిఫై చేసిన నిర్దిష్ట పోస్టాఫీసుల ద్వారా నవంబర్ 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. 2 గ్రాముల నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకూ బాండ్ల కొనుగోలు అవకాశం ఉంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు. ఐదేళ్ల నుంచీ ‘ఎగ్జిట్’ ఆఫర్ ఉంటుంది. విమానయానం మరింత భారం! ఒకవైపు విమాన చార్జీలపై పరిమితులు విధించాలన్న డిమాండ్ ఉండగా.. మరోవైపు టికెట్లపై 2 శాతం లెవీ విధించేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఈ విధంగా వచ్చిన నిధులను ప్రాంతీయంగా ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు వినియోగించాలని భావిస్తోంది. వ్యాపారంలో బెస్ట్.. భారత్‌కు 130వ స్థానం కొత్త కంపెనీల చట్టం, విద్యుత్ సరఫరా మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో వ్యాపారాల నిర్వహణకు అనుకూల దేశాల జాబితాలో భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. గతేడాది భారత ర్యాంకింగ్ 142. ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట ప్రపంచ బ్యాంకు 189 దేశాలతో రూపొందించిన జాబితాలో పది అంశాల ప్రాతిపదికన భారత్‌కు తాజాగా 130వ ర్యాంకు దక్కింది. ఈ లిస్టులో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా (84), పాకిస్తాన్ (138) ర్యాంకుల్లో ఉన్నాయి. డీల్స్.. * సూపర్ వాస్మోల్ 33 తదితర కేశ సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ హైజీనిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ రూ. 216 కోట్లు పెట్టుబడులు పెట్టింది. * రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ మరో 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 2,500 కోట్లు వెచ్చించనుంది. ఈ డీల్ పూర్తయితే రిలయన్స్ లైఫ్‌లో నిప్పన్ లైఫ్ వాటాలు 49 శాతానికి పెరుగుతాయి. * బయోమ్యాబ్ హోల్డింగ్‌లో తనకున్న 25 శాతం వాటాలను విక్రయిస్తున్నట్లు ఔషధ దిగ్గజం సిప్లా వెల్లడించింది. కంపెనీలో 75 శాతం పైగా వాటాలున్న బయోమ్యాబ్ బ్రిలియంట్ సంస్థ వీటిని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ డీల్ విలువ సుమారు 26 మిలియన్ డాలర్లుగా ఉండనుంది. -
నేషనల్ పెన్షన్ స్కీమ్ పేరుతో ఘరానా మోసం
-
ఎన్ఆర్ఐల ఆకర్షణకు బ్యాంకుల సాయం కోరాం: పీఎఫ్ఆర్డీఏ
న్యూఢిల్లీ: తన నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఎన్ఆర్ఐ కస్టమర్లను ఆకర్షించడానికి పీఎఫ్ఆర్డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) బ్యాంకుల సహాయం కోరుతోంది. ఇప్పటికే ఈ విషయంపై ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియా బ్యాంక్ వంటి పలు సంస్థలతో చర్చించినట్లు అథారిటీ చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ విలేకరులకు తెలిపారు. ఎన్ఆర్ఐ నిధుల ఆకర్షణ లక్ష్యంగా... ఎన్పీఎస్ విధానాల్లో పలు మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
ఎన్పీఎస్ నుంచి ఎలా వైదొలగాలి?
నేను విదేశాల్లో పనిచేస్తున్నాను. వచ్చే ఏడాది రిటైరవుతున్నాను. నేను ఇప్పటివరకూ రూ. 10 లక్షల వరకూ పొదుపు చేయగలిగాను. రిటైరైన తర్వాత భారత్‌కు వచ్చి ఈ సొమ్ములను ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నెలకు రూ.15,000 ఆశిస్తున్నాను. నేను ఏ ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి? - మహ్మద్ రియాజ్, బెంగళూరు మీరు రూ.10 లక్షల ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నెలకు రూ.15,000 రాబడి ఆశిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అసమంజసమైన రాబడి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు నెలకు రూ.15,000 రావాలంటే సంవత్సరానికి రూ.1.8 లక్షలు ఆర్జించాలన్నమాట. అంటే మీకు స్థిరమైన వార్షిక రాబడి 18 శాతంగా ఉండాలి. కానీ సాధారణంగా స్థిరమైన వార్షికాదాయ రాబడి దీంట్లో సగం మాత్రమే (9 శాతం) ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్)లో 9 శాతం వార్షిక రాబడులు వస్తాయి. అయితే వడ్డీ మూడు నెలలకొకసారి చెల్లిస్తారు. మీ ఇన్వెస్ట్మెంట్ విలువను కాపాడుకోవాలన్నా, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలన్నా మీకు 18 శాతం వార్షిక రాబడి కావాలంటే కొంచెం రిస్క్ చేయాల్సిందే. మీరు ఈ రూ.10 లక్షల మొత్తాన్ని ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయండి. మూడు నెలలకొకసారి వచ్చే వడ్డీ మొత్తంలో కొంత మొత్తాన్ని మీ ఖర్చులకు ఉపయోగించుకోండి. మిగిలిన దానిని బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్న కొద్దీ, మీకు వీటి నుంచి కూడా ఆదాయం వస్తుంది. ఈ ఏడాది నేను నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ స్కీమ్‌లో కొనసాగాలనుకోవడం లేదు. ఈ స్కీమ్ నుంచి ఎలా వైదొలగాలో చెపుతారా? - శ్రీలేఖ, విశాఖపట్టణం నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) అనేది స్వచ్ఛంద పెన్షన్ పథకం. ఈ స్కీమ్ టైర్ వన్, టైర్ టూ అని రెండు భాగాలుగా ఉంటుంది. టైర్ 1 అకౌంట్ అనేది తప్పనిసరి. దీని నుంచి వైదొలగడానికి లేదు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి రిటైరైన తర్వాత/ ఉద్యోగం నుంచి రాజీనామా చేసిన తర్వాత / లేదా మరణిస్తేనే ఈ అకౌంట్ నుంచి వైదొలగవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి తన పింఛన్ విలువ మొత్తంలో కనీసం 80 శాతాన్ని లైఫ్ యాన్యూటీ కొనుగోలు కోసం 60 ఏళ్లకు ముందే ఇన్వెస్ట్ చేయాలి. ఐఆర్డీఏ నియంత్రణలోని ఏ జీవిత బీమా సంస్థ నుంచైనా ఈ లైఫ్ యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఇక మిగిలిన 20 శాతం మొత్తాన్ని ఒకేసారి ఏకమొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక 60 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి తన పింఛన్ విలువ మొత్తంలో కనీసం 40 శాతాన్ని లైఫ్ యాన్యుటీ కొనుగోలు కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఐఆర్డీఏ నియంత్రణలోని ఏ జీవిత బీమా సంస్థ నుంచైనా ఈ లైఫ్ యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఇక టైర్ 2 అకౌంట్ అనేది స్వచ్ఛంద విత్‌డ్రాయల్ సేవింగ్స్ అకౌంట్. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఎప్పుడైనా సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ విషయానికొస్తే, మీ టైర్ 1 అకౌంట్ నుంచి 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఏక మొత్తంలో ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక టైర్ 2 అకౌంట్ నుంచి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వాటి పనితీరు ఆశించిన విధంగా లేదు. ఈ ఫండ్స్ నుంచి నా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని ఉపసంహరించుకొని, మరో కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఇలాగే ఉంచి, తాజాగా వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? - హిమాంశు జైన్, హైదరాబాద్ మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకనుగుణంగా మీ ఫండ్స్ పనితీరు ఉన్నాయా, లేదా అన్నది మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దీంట్లో భాగంగా మీరు ఆశించిన విధంగా లేని ఫండ్స్ నుంచి మీరు వైదొలగడమే సరైన పని. ఇలా పనితీరు బాగాలేని ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని ఉపసంహరించుకొని, వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ దగ్గర మిగులు నిధులు ఉంటే వాటిని కూడా ఈ కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్