రూ.10 లక్షల కోట్లకు పింఛను నిధులు | Asset under management may cross Rs 10 trillion by September | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల కోట్లకు పింఛను నిధులు

Published Sat, Jun 17 2023 6:22 AM | Last Updated on Sat, Jun 17 2023 7:41 AM

Asset under management may cross Rs 10 trillion by September - Sakshi

న్యూఢిల్లీ: పింఛను పధకాల నిర్వహణ ఆస్తుల విలువ ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరికి రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోనున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దీపక్‌ మహంతి తెలిపారు. చందాదారుల నుంచి క్రమం తప్పకుండా వస్తున్న చందాల వల్లే ఈ వృద్ధి సాధ్యమని చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహణలోని నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌), అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై), ఎన్‌పీఎస్‌ లైట్‌ పథకాల పరిధిలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.9.58 లక్షల కోట్లకు చేరుకుంది.

‘‘రూ.9.5 లక్షల కోట్ల ఏయూఎంను చేరుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం మధ్య భాగానికి ఏయూఎం రూ.10 లక్షలు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్క ఎన్‌పీఎస్‌ నిర్వహణ నిధి రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని తెలిపారు. నిధులపై వచ్చే రాబడులు, మార్కెట్‌ పనితీరు ఏయూఎంను ప్రభావితం చేస్తాయన్నారు. ఈక్విటీ, కొన్ని రకాల డెట్‌ ఆస్తుల రాబడులు మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుండడం తెలిసిందే. పింఛను పథకాల మొత్తం ఏయూఎం రూ.9.58 లక్షల కోట్లలో ఒక్క ఎన్‌పీఎస్‌ నిర్వహణ ఆస్తుల విలువే రూ.9.29 లక్షల కోట్లకు చేరినట్టు మహంతి తెలిపారు. ఏపీవై నిధులు రూ.28,538 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు.   

విస్తరణకు చర్యలు
ఎన్‌పీఎస్‌ కింద ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తుల పింఛను నిధులు కూడా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛను చందాలు వాటంతట అవే వస్తుంటాయని చెబుతూ.. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇవి వృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఇందుకోసం పీఎఫ్‌ఆర్‌డీఏ ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఏజెంట్లను అనుమతించామని, కార్పొరేట్‌ ఉద్యోగులు ఎన్‌పీఎస్‌ను తీసుకునే విధంగా ప్రోత్సాహక చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌గా ఈ–ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరిచి, చందాలు చెల్లించే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదన్నారు. ఎన్‌పీఎస్‌ చందాదారుల సంఖ్య గతేడాదే 1.20 కోట్లకు చేరినట్టు తెలిపారు. ఈ ఏడాది చందాదారుల
సంఖ్యను 1.3 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఏపీవై చందాదారుల సంఖ్య 5.2 కోట్లుగా ఉందని, ఇది చాలా
గణనీయమైనదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement