Pension Fund Regulatory and Development Authority
-
అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎన్పీఎస్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్)ను అన్ని బ్యాంక్ శాఖలు, తపాలా కార్యాలయాల్లో (పోస్టాఫీసులు) అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. ప్రజలకు సులభంగా ఎన్పీఎస్ను అందుబాటులో ఉంచేందుకు, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఎన్పీఎస్ పథకం పంపిణీ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లతో పీఎఫ్ఆర్డీఏ జట్టు కడుతోంది. దీంతో పల్లెలు, చిన్న పట్టణాల్లోని ప్రజలు సైతం ఈ పథకం ప్రయోజనాలను సులభంగా పొందడానికి వీలుంటుంది’’అని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ తెలిపారు. ప్రైవేటు రంగం నుంచి కార్పొరేట్, వ్యక్తిగత స్థాయిలో 13 లక్షల మందిని ఎన్పీఎస్ చందాదారులుగా చేర్చుకునే లక్ష్యంతో ఉన్నట్టు మహంతి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మందిని చేర్చుకున్నట్టు పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023 సెపె్టంబర్ 16 నాటికి ఎన్పీఎస్ చందారులు 1.36 కోట్లుగా ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులు 5 కోట్లుగా ఉన్నారు. ఎన్పీఎస్ కింద స్థిర పింఛను ఎందుకు నిర్ణయించలేదన్న ప్రశ్నకు మహంతి బదులిచ్చారు. ‘‘దీర్ఘకాలానికి పింఛను నిర్ణయించడం సాధ్యపడదు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, జీడీపీతో సమానంగా లేదంటే అంతకుమించి పింఛను నిధి ఉన్నా కానీ, ఈ విషయంలో సమస్య నెలకొంది’’అని వివరించారు. అయితే, ఎన్పీఎస్ నుంచి రాబడులు మెరుగ్గా ఉంటాయని చెబుతూ.. దీర్ఘకాలంలో మంచి నిధిని ఆశించొచ్చన్నారు. ఎన్పీఎస్ విక్రయంపై వచ్చే కమీషన్ చాలా తక్కువని, అందుకే ఏజెంట్లు దీని పట్ల ఆసక్తి చూపించడం లేదన్నారు. కానీ, ఎన్పీఎస్ను తక్కువ వ్యయంతో కూడిన ఉత్పత్తిగానే కొనసాగించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన పథకం నిర్వహణ ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంటాయన్నారు. -
రూ.10 లక్షల కోట్లకు పింఛను నిధులు
న్యూఢిల్లీ: పింఛను పధకాల నిర్వహణ ఆస్తుల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోనున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. చందాదారుల నుంచి క్రమం తప్పకుండా వస్తున్న చందాల వల్లే ఈ వృద్ధి సాధ్యమని చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం పీఎఫ్ఆర్డీఏ నిర్వహణలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), ఎన్పీఎస్ లైట్ పథకాల పరిధిలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.9.58 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘రూ.9.5 లక్షల కోట్ల ఏయూఎంను చేరుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం మధ్య భాగానికి ఏయూఎం రూ.10 లక్షలు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్క ఎన్పీఎస్ నిర్వహణ నిధి రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని తెలిపారు. నిధులపై వచ్చే రాబడులు, మార్కెట్ పనితీరు ఏయూఎంను ప్రభావితం చేస్తాయన్నారు. ఈక్విటీ, కొన్ని రకాల డెట్ ఆస్తుల రాబడులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుండడం తెలిసిందే. పింఛను పథకాల మొత్తం ఏయూఎం రూ.9.58 లక్షల కోట్లలో ఒక్క ఎన్పీఎస్ నిర్వహణ ఆస్తుల విలువే రూ.9.29 లక్షల కోట్లకు చేరినట్టు మహంతి తెలిపారు. ఏపీవై నిధులు రూ.28,538 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. విస్తరణకు చర్యలు ఎన్పీఎస్ కింద ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తుల పింఛను నిధులు కూడా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛను చందాలు వాటంతట అవే వస్తుంటాయని చెబుతూ.. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇవి వృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఇందుకోసం పీఎఫ్ఆర్డీఏ ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఏజెంట్లను అనుమతించామని, కార్పొరేట్ ఉద్యోగులు ఎన్పీఎస్ను తీసుకునే విధంగా ప్రోత్సాహక చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌గా ఈ–ఎన్పీఎస్ ఖాతాను తెరిచి, చందాలు చెల్లించే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదన్నారు. ఎన్పీఎస్ చందాదారుల సంఖ్య గతేడాదే 1.20 కోట్లకు చేరినట్టు తెలిపారు. ఈ ఏడాది చందాదారుల సంఖ్యను 1.3 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఏపీవై చందాదారుల సంఖ్య 5.2 కోట్లుగా ఉందని, ఇది చాలా గణనీయమైనదన్నారు. -
పీఎఫ్ఆర్డీఏ చైర్మన్‌గా దీపక్ మొహంతీ
న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్‌గా దీపక్ మొహంతీను ప్రభుత్వం నియమించింది. జనవరిలో పదవీకాలం ముగిసిన సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుతం పీఎఫ్ఆర్డీఏ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. మొహంతీ ఆగస్టు 2020లో మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) గతంలో నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం కూడా ఆయనకు ఉంది. తాజా నియామకానికి సంబంధించి వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఇళ్లు, కారు సౌకర్యం లేకుండా మొహంతీ నెలకు రూ.4.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం పొందుతారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో ఆయన పనిచేస్తారు. మెంబర్‌గా...మమతా శంకర్ మొహంతీ తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్థానంలో పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) మమతా శంకర్ నియమితులయ్యారు. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (1993)లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖలో సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందుగా అయితే) ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రత్యేక నోటిఫికేషన్ పేర్కొంది. పెన్షన్ నిధులు ఇలా... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అలాగే అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 2023 మార్చి 4వ తేదీ నాటికి రూ. 8.81 లక్షల కోట్లు. దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. -
అటల్ పెన్షన్ యోజనకు విశేష ఆదరణ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకం– అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు విశేష ఆధరణ లభిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికి 5 కోట్ల మందికిపైగా ప్రజలు నమోదయినట్లు తెలిపింది. ఒక్క 2022 క్యాలెండర్ ఇయర్లో 1.25 కోట్ల మంది చందాదారులుగా చేరినట్లు వివరించింది. 2021లో ఈ సంఖ్య 92 లక్షలు కావడం గమనార్హం. 2021 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీవైని ప్రకటించారు. దీని విస్తృతికి పీఎఫ్ఆర్డీఏ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ పథకం కింద ఒక చందాదారుడు (చేరిన వయస్సు, చందాపై ఆధారపడి) 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటాడు. చందాదారుని మరణానంతరం అదే పెన్షన్ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లించడం జరుగుతుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినప్పుడు, చందాదారుడు 60 ఏళ్ల వరకు చెల్లించిన మొత్తం నామినీ పొందే వెసులుబాటు ఉంది. -
అందరికీ ‘ఎన్పీఎస్’ పన్ను ప్రయోజనం
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకం కింద 14 శాతం చందాకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లభిస్తున్న పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని మరింత విస్తరింపజేయాలని కేంద్రానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్– పీఎఫ్ఆర్డీఏ విజ్ఞప్తి చేయనుంది. 2021–22 బడ్జెట్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చైర్మన్ సుప్రీతిమ్ బందోపాధ్యాయ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్పీఎస్ పథకం కింద 14 శాతం యాజమాన్యాల చందాకు 2019 ఏప్రిల్ 1 నుండి పన్ను మినహాయింపును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలకు ఇస్తున్న ఈ మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వ, ఇతర కార్పొరేట్ సంస్థలకూ వర్తింపజేయాలని కోరుతున్నట్లు బందోపాధ్యాయ వెల్లడించారు. చందాదారులందరికీ ఈ ప్రయోజనం అందాలన్నది తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే కేంద్ర సంస్థల యాజమాన్యాలకు అందుతున్న ప్రయోజనాలను తమకూ వర్తింపజేయాలని కోరుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)కి లేఖలు రాసినట్లు ఆయన వివరించారు. యథాపూర్వం 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూలతలు, ఉద్దీపన చర్యలు, ఆదాయాలు–వ్యయాలకు మధ్య భారీగా పెరిగిపోనున్న ద్రవ్యలోటు, మౌలిక రంగంపై భారీ నిధుల కేటాయింపులకు భారీ అవరోధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు తాజా బడ్జెట్ కత్తిమీద సాములాగా కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్. టైర్–2 ఎన్పీఎస్ అకౌంట్లను కూడా... దీనితోపాటు చందాదారులందరి టైర్–2 ఎన్పీఎస్ అకౌంట్లను కూడా పన్ను మినహాయింపు పరిధిలోనికి తీసుకురావాలని కోరుతున్నట్లు బందోపాధ్యాయ తెలిపారు. ‘‘ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనాన్ని అందించడం జరిగింది. ట్యాక్స్ ఫ్రీ టైర్ 2 అకౌంట్లను మూడేళ్లు లాక్ ఇన్ పీరియడ్‌లో ఉంచడం జరుగుతుంది. పన్ను రహిత హోదానే దీనికి కారణం. ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు. ఎన్పీఎస్ కింద టైర్–2 అకౌంట్ తప్పనిసరి అకౌంట్ కాదు. దీనిని టైల్–1 అకౌంట్‌తో పాటు ఎంపికచేసుకోవచ్చు. తక్షణం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ఎన్పీఎస్ అంటే... ఇది ఒక స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ఈ పథక రూపకల్పన జరిగింది. ఎన్‌పీఎస్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటి టైర్–1, రెండు టైర్–2. టైర్–1 శాశ్వత రిటైర్మెంట్ అకౌంట్. ఇందులో డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు క్రమంగా వృద్ధి చెందుతూ, చివరికి నిర్దిష్ట మొత్తంలో లేదా పెన్షన్ రూపంలో వడ్డీతో సహా చందాదారునికి అందుతుంది. ఇక టైర్–2 స్వచ్ఛంద విత్‌డ్రాయెల్ అకౌంట్. టైర్–1 అకౌంట్ ఉన్న వారే దీనిని నిర్వహించడానికి అర్హులు. అతల్ పెన్షన్ యోజన (ఏపీవై) పేరుతో మరో పెన్షన్ స్కీమ్‌ను పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తోంది. ఎన్పీఎస్ ప్రధానంగా వ్యవస్థాగత ఉద్యోగుల విభాగాన్ని ఉద్దేశించినదైతే, ఏపీవై అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి ఉపయోగపడుతుంది. -
ఎన్పీఎస్ నుంచి ఉపసంహరణ
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) చందాదారులకు ‘పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ’(పీఎఫ్ఆర్డీఏ) వెసులుబాటు కల్పించింది. ఎన్పీఎస్ చందాదారులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకోవాల్సి వస్తే ఖర్చుల కోసం ఎన్పీఎస్ నిధి నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. కాగా, ఏపీవై చందాదారులకు ఇది వర్తించదు. ఈపీఎఫ్‌వో..ఉపసంహరణ రూ.280 కోట్లు కాగా, ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతించడంతో.. ఇప్పటి వరకు రూ.280 కోట్ల విలువకు సంబంధించి 1.37 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్‌వో శుక్రవారం ప్రకటించింది. ఈపీఎఫ్ నిధిలో చందాదారుని వాటా మొత్తం నుంచి 75 శాతం లేదా మూడు నెలల మూలవేతనం, కరువు భత్యం ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. -
స్టాక్ మార్కెట్లోకి మరిన్ని పెన్షన్ నిధులు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో పింఛన్ ఫండ్ల పెట్టుబడుల పరిమితిని మరింతగా పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోందని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ చెప్పారు. ఈ విషయమై త్వరలోనే నిర్ణయం వెలువడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) తన మూలనిధుల్లో 15 శాతం వరకూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పరిమితిని 50% వరకూ పెంచాలని కేంద్రం యోచిస్తోందని హేమంత్ వివరించారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) పెట్టుబడుల మార్గదర్శకాలను సమీక్షించేందుకు పీఎఫ్ఆర్డీఏ నియమించిన జి.ఎన్. బాజ్‌పాయ్ కమిటీ సూచనల్లో ఈ పరిమితి పెంపు కూడా ఒకటి.