న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) పథకం కింద 14 శాతం చందాకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లభిస్తున్న పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని మరింత విస్తరింపజేయాలని కేంద్రానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్– పీఎఫ్‌ఆర్‌డీఏ విజ్ఞప్తి చేయనుంది. 2021–22 బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చైర్మన్ సుప్రీతిమ్ బందోపాధ్యాయ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్‌పీఎస్ పథకం కింద 14 శాతం యాజమాన్యాల చందాకు 2019 ఏప్రిల్ 1 నుండి పన్ను మినహాయింపును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలకు ఇస్తున్న ఈ మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వ, ఇతర కార్పొరేట్ సంస్థలకూ వర్తింపజేయాలని కోరుతున్నట్లు బందోపాధ్యాయ వెల్లడించారు.
చందాదారులందరికీ ఈ ప్రయోజనం అందాలన్నది తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే కేంద్ర సంస్థల యాజమాన్యాలకు అందుతున్న ప్రయోజనాలను తమకూ వర్తింపజేయాలని కోరుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ)కి లేఖలు రాసినట్లు ఆయన వివరించారు. యథాపూర్వం 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూలతలు, ఉద్దీపన చర్యలు, ఆదాయాలు–వ్యయాలకు మధ్య భారీగా పెరిగిపోనున్న ద్రవ్యలోటు, మౌలిక రంగంపై భారీ నిధుల కేటాయింపులకు భారీ అవరోధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు తాజా బడ్జెట్ కత్తిమీద సాములాగా కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్.
టైర్–2 ఎన్‌పీఎస్ అకౌంట్లను కూడా...
దీనితోపాటు చందాదారులందరి టైర్–2 ఎన్‌పీఎస్ అకౌంట్లను కూడా పన్ను మినహాయింపు పరిధిలోనికి తీసుకురావాలని కోరుతున్నట్లు బందోపాధ్యాయ తెలిపారు. ‘‘ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనాన్ని అందించడం జరిగింది. ట్యాక్స్ ఫ్రీ టైర్ 2 అకౌంట్లను మూడేళ్లు లాక్ ఇన్ పీరియడ్‌లో ఉంచడం జరుగుతుంది. పన్ను రహిత హోదానే దీనికి కారణం. ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు. ఎన్‌పీఎస్ కింద టైర్–2 అకౌంట్ తప్పనిసరి అకౌంట్ కాదు. దీనిని టైల్–1 అకౌంట్‌తో పాటు ఎంపికచేసుకోవచ్చు. తక్షణం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది.
ఎన్‌పీఎస్ అంటే... ఇది ఒక స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ఈ పథక రూపకల్పన జరిగింది. ఎన్‌పీఎస్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటి టైర్–1, రెండు టైర్–2. టైర్–1 శాశ్వత రిటైర్‌మెంట్ అకౌంట్. ఇందులో డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్లు క్రమంగా వృద్ధి చెందుతూ, చివరికి నిర్దిష్ట మొత్తంలో లేదా పెన్షన్ రూపంలో వడ్డీతో సహా చందాదారునికి అందుతుంది. ఇక టైర్–2 స్వచ్ఛంద విత్‌డ్రాయెల్ అకౌంట్. టైర్–1 అకౌంట్ ఉన్న వారే దీనిని నిర్వహించడానికి అర్హులు. అతల్ పెన్షన్ యోజన (ఏపీవై) పేరుతో మరో పెన్షన్ స్కీమ్‌ను పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహిస్తోంది. ఎన్‌పీఎస్ ప్రధానంగా వ్యవస్థాగత ఉద్యోగుల విభాగాన్ని ఉద్దేశించినదైతే, ఏపీవై అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి ఉపయోగపడుతుంది.
అందరికీ ‘ఎన్‌పీఎస్’ పన్ను ప్రయోజనం
Published Mon, Nov 16 2020 6:18 AM | Last Updated on Mon, Nov 16 2020 6:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment