పన్ను ఆదా కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? | Employees are investing to save tax Explanation of special story | Sakshi
Sakshi News home page

పన్ను ఆదా కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నారా?

Published Mon, Jan 13 2025 5:38 AM | Last Updated on Mon, Jan 13 2025 5:38 AM

Employees are investing to save tax Explanation of special story

పెట్టుబడుల డిక్లరేషన్‌కు సమయం వచ్చేసింది 

యాజమాన్యాలకు 12బీబీ ఫారమ్‌ సమర్పించాలి 

దీని ఆధారంగానే ఉద్యోగుల నుంచి టీడీఎస్‌

టీడీఎస్‌ అందుబాటులో బోలెడు పెట్టుబడి సాధనాలు 

ఉద్యోగులు తమ పెట్టుబడుల వివరాలను యాజమాన్యాలకు సమర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని ప్రైవేటు సంస్థలూ జనవరి, ఫిబ్రవరిలో ఉద్యోగుల నుంచి పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను సమీకరిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ సాధనాల్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, వాటికి సంబంధించి వివరాలతో 12బీబీ ఫారమ్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఆధారాలను కూడా జత చేయాలి. 

ఈ వివరాల ఆధారంగా ఉద్యోగి వార్షిక వేతన ప్రయోజనాలపై ఎంత పన్ను పడుతుందో అంచనాకు వచ్చి, ఆ మేరకు చివరి మూడు నెలల్లో వేతనాల నుంచి మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. వీటి విషయంలో ఉద్యోగులు అవగాహనతో వ్యవహరించడం వల్ల అనవసర పెట్టుబడులను నివారించొచ్చు. పన్ను ఆదా కోసం ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్‌ చేయకుండా, తమ లక్ష్యాలకు అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. దీనిపై అవగాహన కల్పించే కథనమిది... 
 

కొత్త పన్ను విధానం 
ఉద్యోగులు నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకుంటే, పెట్టుబడుల ఆధారాలు సమర్పించనక్కర్లేదు. నూతన పన్ను విధానంలో పెద్దగా మినహాయింపుల్లేవు. సెక్షన్‌ 87ఏ కింద రూ.7 లక్షల వరకు ఆదాయంపై రాయితీ లభిస్తుంది. రూ.75,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రయోజనం నేరుగా లభిస్తుంది. వీటితో కలిపితే రూ.7,75,000 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆదాయం ఇంతకు మించితే నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 

సెక్షన్‌ 80సీసీడీ(2) కింద తమ మూలవేతనం, డీఏలో 14 శాతాన్ని పనిచేసే సంస్థ ద్వారా ఎన్‌పీఎస్‌ ఖాతాలో జమ చేయించుకుంటే, అంత మేరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. కన్వేయన్స్, ట్రావెల్‌ అలవెన్స్‌ ప్రయోజనాలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు ఆఫీస్‌ పనిపై వేరే ప్రాంతానికి వెళ్లి చేసే ఖర్చును తిరిగి పొందడం ద్వారా ఆ మొత్తంపైనా పన్ను చెల్లించక్కర్లేదు. ఆఫీస్‌కు వచ్చి పోయేందుకు చేసే చెల్లింపులపై ప్రతి నెలా రూ.1,600 మొత్తంపైనా పన్ను లేదు.

పాత పన్ను విధానం 
పాత విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్‌ 87ఏ కింద రాయితీ ఉంది. రూ.50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రయోజనం కూడా ఉంది. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలు, 80డీ కింద రూ.25,000–75,000, 80సీసీడీ(1బి) కింద రూ.50,000, హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌పై మినహాయింపు పొందొచ్చు. కొత్త విధానంలో మాదిరే కన్వేయన్స్, ట్రావెల్స్‌ ఎక్స్‌పెన్స్‌పై మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. గృహ రుణం ఈఎంఐలు చెల్లిస్తున్నట్టు అయితే. ఈఎంఐలో అసలు భాగాన్ని సెక్షన్‌ 80సీ కింద, వడ్డీ భాగాన్ని సెక్షన్‌ 24 కింద చూపించుకోవచ్చు. ఇంటిని సొంతానికి వినియోగిస్తుంటే గృహ రుణంపై ఎంత వడ్డీ చెల్లించినా.. గరిష్టంగా రూ.2 లక్షలపైనే పన్ను చెల్లించక్కర్లేదు. అదే ఇంటిని అద్దెకు ఇస్తే.. ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణం కోసం చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపై (పరిమితి లేకుండా) పన్ను లేకుండా చూసుకోవచ్చు. కేవలం 80సీ పరిధిలోని పన్ను ప్రయోజనాలకే పరిమితమైతే రూ.7 లక్షల ఆదాయంపై పన్ను పడదు. హెచ్‌ఆర్‌ఏ, హెల్త్‌ ఇన్సూరెన్స్, ఎన్‌పీఎస్, గృహ రుణంపై ప్రయోజనాలను వినియోగించుకుంటే రూ.10.25 లక్షల ఆదాయం వరకు పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు.

ఎంపికలో జాగ్రత్త? 
వేతన జీవులు (వేతనం రూపంలోనే ఆదాయం ఉన్న వారు) ఏటా పాత, కొత్త విధానంలో ఎందులో అయినా రిటర్నులు సమర్పించొచ్చు. ఒకవేళ పనిచేసే సంస్థకు తన పన్ను విధానం గురించి వెల్లడించని సందర్భంలో.. కొత్త పన్ను విధానంలోనే యాజమాన్యం టీడీఎస్‌ను మినహాయిస్తుంది. పెట్టుబడుల డిక్లరేషన్‌ సమయంలో యాజమాన్యాలు పన్ను విధానం మార్చుకునేందుకు అనుమతించకపోవచ్చు. అయినప్పటికీ రిటర్నులు సమ ర్పించే తరుణంలో తమకు అనుకూలమైన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. యాజమాన్యం ఉద్యో గి నుంచి పన్ను కోత విధించినప్పటికీ, రిటర్నులు సమర్పించిన అనంతరం రిఫండ్‌ కోరొచ్చు.  

ముందస్తు ప్రణాళిక 
ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను ఆదాకు సంబంధించి పెట్టుబడుల ప్రణాళిక వేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. అయినా, ఇప్పటికీ చాలా మంది ఆర్థిక సంవత్సరం చివర్లోనే వీటి గురించి పట్టించుకుంటూ ఉంటారు. ‘‘పన్ను మినహాయింపులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే ముందుగానే ఈ దిశగా ప్రణాళిక వేసుకోవాలి. కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ, పాత పన్ను విధానం పొదుపును, లక్ష్యం ఆధారిత పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది’’ అని ట్యాక్స్‌స్పానర్‌ డాట్‌ కామ్‌ కో ఫౌండర్‌ సుదీర్‌ కౌశిక్‌ తెలిపారు. సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనం కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోవడం మెరుగైన నిర్ణయం కాబోదు. వీటికి బదులు సెక్షన్‌ 80సీ పరిధిలో ఇతర సాధనాలను పరిశీలించాలి.

సెక్షన్‌ 80సీ అర్హత సాధనాలు 
→ ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌పై దీర్ఘకాలంలో (పదేళ్లకు మించి) 12–15% మధ్య రాబడులు ఉంటా యని అంచనా. గత చరిత్రను గమనిస్తే ఇవి దీర్ఘకాలంలో 25% వరకు వార్షిక రాబడిని ఇచ్చాయి.  
→ సుకన్య పథకం మెచ్యూరిటీ బాలిక వయసు 21 ఏళ్లు నిండిన వెంటనే ముగుస్తుంది. లేదా బాలిక వయసు 18 ఏళ్లు నిండి, 21 ఏళ్లలోపే వివాహం నిశ్చయమైన సందర్భంలోనూ క్లోజ్‌ చేసుకోవచ్చు.  
→ ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పెట్టుబడులపై మూడేళ్లలో వార్షిక సగటు రాబడి వివిధ ఫండ్‌ మేనేజర్ల మధ్య వేర్వేరుగా ఉంది. 15.80 శాతం నుంచి 17.55 శాతం మధ్య ఉంది. → ఐదేళ్లలో 19 శాతం నుంచి 21.17 శాతం మధ్య ఉంది. ఏడేళ్లలో 14.69 శాతం నుంచి 16.01 శాతం మధ్య ఉంది. ఈక్విటీ, డెట్‌తో కూడిన ఎంపికపై రాబడులు దీర్ఘకాలంలో 9–12 శాతం మధ్య ఉంటాయని అంచనా.    

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) 
ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ మూల వేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వీరు 80సీసీడీ(1) కింద పాత విధానంలో పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 80సీ రూ.1.5 లక్షల పరిధిలోనే 80సీడీసీ(1) భాగంగా ఉంటుంది. దీనికి అదనంగా 80సీసీడీ(1బి) కింద మరో రూ.50,000 ఇన్వెస్ట్‌ చేసి, ఆ మొత్తంపైనా పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్‌ 80సీసీడీ(2) కింద కార్పొరేట్‌ ఎన్‌పీఎస్‌ ప్రయోజనం కూడా ఉంది. పనిచేసే సంస్థ అనుమతిస్తే పాత, కొత్త విధానాల్లో ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోవచ్చని కౌశిక్‌ తెలిపారు. పాత పన్ను విధానంలో మూలవేతనం, డీఏలో 10 శాతం, కొత్త విధానంలో 14 శాతం చొప్పున యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చని చెప్పారు.  

వైద్య వ్యయాలపై మినహాయింపులు 
ఆరోగ్యం కోసం చేసే వ్యయాలకు సెక్షన్‌ 80డీ కింద పన్ను ప్రయోజనాలున్నాయి. పన్ను చెల్లింపుదారు, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుని ప్రీమియం చెల్లిస్తుంటే.. గరిష్టంగా రూ.25,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ అదే వ్యక్తి తన జీవిత భాగస్వామి, పిల్లలతోపాటు 60 ఏళ్ల వయసు లోపు తన తల్లిదండ్రుల కోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు రూ.50,000 మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక పన్ను చెల్లింపుదారు తన కుటుంబంతోపాటు 60 ఏళ్లు నిండిన తల్లిదండ్రుల కోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు గరిష్టంగా రూ.75 వేల వరకు (తన కుటుంబానికి రూ.25 వేలు, తల్లిదండ్రులకు రూ.50 వేలు) పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారు, జీవిత భాగస్వామి, పిల్లలతో కూడిన కుటుంబంలో ఒకరి వయసు 60 ఏళ్లు నిండి, వీరితోపాటు 60 ఏళ్లు నిండిన తల్లిదండ్రులకు సైతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు చెరో రూ.50 వేలు చొప్పున మొత్తం రూ.1,00,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం ఈ సెక్షన్‌ కింద ఉంది. వేతన జీవుల వయసు 60 ఏళ్లలోపే ఉంటుంది కనుక, వీరు తమ కుటుంబం, తమ తల్లిదండ్రుల పేరిట మొత్తంగా రూ.75,000పై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. హెల్త్‌ చెకప్‌ల కోసం చేసే వ్యయం రూ.5,000 వరకు ఈ సెక్షన్‌ కింద గరిష్ట పరిమితి లోపు చూపించుకోవచ్చు.  

పిల్లల ట్యూషన్‌ ఫీజులు 
పిల్లల ట్యూషన్‌ ఫీజుల భారాన్ని సెక్షన్‌ 80సీ కింద చూపించుకోవడం ద్వారా పన్ను భారాన్ని దింపుకోవచ్చు. ముఖ్యంగా దంపతులు ఇద్దరూ ఉద్యోగులు అయితే, ఇరువురూ ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇద్దరు పిల్లల కోసం ట్యూషన్‌ ఫీజు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారనుకుందాం. అప్పుడు ఒకరు రూ.1.5 లక్షల, మరొకరు రూ.1 లక్ష వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. సెక్షన్‌ 80సీ రూ.1.5 లక్షల్లో ఇతర పెట్టుబడులు పోగా, మిగిలిన మొత్తానికి దంపతులు ఇద్దరూ ట్యూషన్‌ ఫీజులో తమకు కావాల్సినంత చూపించుకుని, అంత వరకే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. స్కూల్‌ డొనేషన్, బస్సు చార్జీలు, స్పోర్ట్స్‌ తదితర వాటి కోసం చేసే చెల్లింపులపై పన్ను మినహాయింపుల్లేవు.

    – సాక్షి, బిజినెస్‌డెస్క్‌    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement