
బడ్జెట్‌లో ఆదాయపన్ను తగ్గింపుపై ఆశలు
పరిశ్రమ వర్గాలు, నిపుణుల సానుకూల సూచనలు
న్యూఢిల్లీ: బడ్జెట్ 2025పై మధ్య తరగతి, వేతన వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయపన్ను ఉపశమనం లభిస్తుందన్న అంచనాలతో ఉన్నాయి. పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలు సైతం పన్ను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఆదాయం మిగిలించొచ్చని, ఇది మందగించిన వినియోగానికి ప్రేరణనిస్తుందని ఆర్థిక మంత్రికి సూచించడం గమనార్హం.
దీంతో వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా కొంత ఉపశమనం కల్పించొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇదే కనుక నిజమైతే అది వినియోగానికి ఊతమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచొచ్చని, పన్ను శ్లాబుల్లో సర్దుబాట్లు చేయొచ్చని, స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వీటికితోడు పన్ను నిబంధనల్లో మార్పుల ద్వారా పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించొచ్చని భావిస్తున్నారు.
అంచనాలు ఇలా..
→ నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు ఆదాయ పరిమితి రూ.3లక్షలు. రూ.3–7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. రానున్న బడ్జెట్‌లో ఈ బేసిక్ మినహాయింపును రూ.5లక్షలకు పెంచొచ్చని తెలుస్తోంది. అప్పుడు రూ.3–7 లక్షల శ్లాబు కాస్తా రూ.5–7 లక్షలుగా మారుతుంది. దీంతో మొత్తం మీద రూ.10,000 మేర పన్ను ఆదా అవుతుంది.
→ 7–10 లక్షల ఆదాయంపై 10% పన్ను ప్రస్తుతం అమల్లో ఉంది. అలాగే, రూ.10–12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను అమలవుతోంది. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
→ రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను ప్రస్తుతం అమలవుతోంది. బడ్జెట్‌లో దీన్ని రూ.12–18 లక్షలకు సవరించొచ్చని భావిస్తున్నారు. 30 శాతం పన్నును రూ.18లక్షలకుపైన ఆదాయం ఉన్న వారికి వర్తింపచేసే అవకాశం ఉంది. ఇది ఆచరణలోకి వస్తే రూ. 18లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రూ.3లక్షల ఆదాయంపై 30 శాతం రూపంలో సుమారు రూ.90వేల వరకు ఆదా అవుతుంది.
రూ.18 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఊరట ఉండకపోవచ్చు.
→ నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000గా ఉంది. దీన్ని రూ.1,00,000కు పెంచొచ్చని తెలుస్తోంది. నిజానికి రూ.50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను గత బడ్జెట్‌లో రూ.75,000కు పెంచారు. మొత్తం ఆదాయంలో దీన్ని నేరుగా మినహాయించుకోవచ్చు. పాత విధానంలో ఇది కేవలం రూ.50,000గానే కొనసాగుతోంది. 72 శాతం మంది కొత్త విధానంలోనే పన్ను రిటర్నులు సమర్పించారు. పెద్దగా పన్ను మినహాయింపుల్లేని, సరళతర నూతన పన్ను విధానంలోకి క్రమేణా అందరినీ తీసుకురావడం కేంద్రం లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కనుక మరిన్ని పన్ను ప్రయోజనాలు కొత్త విధానంలో కల్పించడానికే ఆర్థిక మంత్రి పరిమితం కావచ్చు.
→ రూ.2.5 లక్షలు మించిన పీఎఫ్ వడ్డీపై టీడీఎస్‌ను, ఉపసంహరణ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇ–సాప్‌లను విక్రయించినప్పుడే పన్ను చెల్లించేలా అనుమతించాలని, ఎన్‌ఆర్‌ఐల ఇల్లు విక్రయంపై టీడీఎస్ నుంచి మినహాయింపులు కల్పించాలన్న డిమాండ్లు సైతం ఉన్నాయి.
ఆకర్షణీయంగా కొత్త పన్ను విధానం!
మరింత మందిని ఇందులోకి తీసుకురావడంపై దృష్టి
5 % పన్ను శ్లాబులో మార్పు: రూ.10,000 వరకు ఆదా
30 శాతం పన్ను శ్లాబులోనూ మార్పు: రూ.90,000 వరకు ఆదా
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment