Tax relaxation
-
వేతన జీవులను కనికరించేనా?
న్యూఢిల్లీ: బడ్జెట్ 2025పై మధ్య తరగతి, వేతన వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయపన్ను ఉపశమనం లభిస్తుందన్న అంచనాలతో ఉన్నాయి. పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలు సైతం పన్ను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఆదాయం మిగిలించొచ్చని, ఇది మందగించిన వినియోగానికి ప్రేరణనిస్తుందని ఆర్థిక మంత్రికి సూచించడం గమనార్హం. దీంతో వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా కొంత ఉపశమనం కల్పించొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇదే కనుక నిజమైతే అది వినియోగానికి ఊతమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచొచ్చని, పన్ను శ్లాబుల్లో సర్దుబాట్లు చేయొచ్చని, స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వీటికితోడు పన్ను నిబంధనల్లో మార్పుల ద్వారా పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించొచ్చని భావిస్తున్నారు. అంచనాలు ఇలా..→ నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు ఆదాయ పరిమితి రూ.3లక్షలు. రూ.3–7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. రానున్న బడ్జెట్లో ఈ బేసిక్ మినహాయింపును రూ.5లక్షలకు పెంచొచ్చని తెలుస్తోంది. అప్పుడు రూ.3–7 లక్షల శ్లాబు కాస్తా రూ.5–7 లక్షలుగా మారుతుంది. దీంతో మొత్తం మీద రూ.10,000 మేర పన్ను ఆదా అవుతుంది. → 7–10 లక్షల ఆదాయంపై 10% పన్ను ప్రస్తుతం అమల్లో ఉంది. అలాగే, రూ.10–12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను అమలవుతోంది. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. → రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను ప్రస్తుతం అమలవుతోంది. బడ్జెట్లో దీన్ని రూ.12–18 లక్షలకు సవరించొచ్చని భావిస్తున్నారు. 30 శాతం పన్నును రూ.18లక్షలకుపైన ఆదాయం ఉన్న వారికి వర్తింపచేసే అవకాశం ఉంది. ఇది ఆచరణలోకి వస్తే రూ. 18లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రూ.3లక్షల ఆదాయంపై 30 శాతం రూపంలో సుమారు రూ.90వేల వరకు ఆదా అవుతుంది. రూ.18 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఊరట ఉండకపోవచ్చు. → నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000గా ఉంది. దీన్ని రూ.1,00,000కు పెంచొచ్చని తెలుస్తోంది. నిజానికి రూ.50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను గత బడ్జెట్లో రూ.75,000కు పెంచారు. మొత్తం ఆదాయంలో దీన్ని నేరుగా మినహాయించుకోవచ్చు. పాత విధానంలో ఇది కేవలం రూ.50,000గానే కొనసాగుతోంది. 72 శాతం మంది కొత్త విధానంలోనే పన్ను రిటర్నులు సమర్పించారు. పెద్దగా పన్ను మినహాయింపుల్లేని, సరళతర నూతన పన్ను విధానంలోకి క్రమేణా అందరినీ తీసుకురావడం కేంద్రం లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కనుక మరిన్ని పన్ను ప్రయోజనాలు కొత్త విధానంలో కల్పించడానికే ఆర్థిక మంత్రి పరిమితం కావచ్చు. → రూ.2.5 లక్షలు మించిన పీఎఫ్ వడ్డీపై టీడీఎస్‌ను, ఉపసంహరణ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇ–సాప్లను విక్రయించినప్పుడే పన్ను చెల్లించేలా అనుమతించాలని, ఎన్ఆర్ఐల ఇల్లు విక్రయంపై టీడీఎస్ నుంచి మినహాయింపులు కల్పించాలన్న డిమాండ్లు సైతం ఉన్నాయి. ఆకర్షణీయంగా కొత్త పన్ను విధానం! మరింత మందిని ఇందులోకి తీసుకురావడంపై దృష్టి 5 % పన్ను శ్లాబులో మార్పు: రూ.10,000 వరకు ఆదా 30 శాతం పన్ను శ్లాబులోనూ మార్పు: రూ.90,000 వరకు ఆదా – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సవాల్ మీద సవాల్.. ఆ వర్గాలకు వరాలు ఏ స్థాయిలో..?
ఊరటలు, ఊరడింపులు, ఉపశమనాల కోసం ఉద్యోగులు మొదలుకుని ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాల దాకా అందరూ ఏటా ఎదురు చూసే తరుణం మరోసారి రానే వచ్చింది. కరోనా కల్లోలం నుంచి బయటపడాం అనుకునేలోపే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో మరో పిడుగు నెత్తినపడింది. ఆ వెంటే ఉద్యోగాల కోత.. తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు ప్రపంచం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు భారత్ బడ్జెట్‌కు సిద్ధమైంది. సాధారణంగా బడ్జెట్ అనగానే ప్రతి రంగం కొన్ని ప్రయోజనాలను ఆశించటం సహజం. కానీ, ఈసారి పేద, మధ్యతరగతి ఆశలపైనే ప్రధాన దృష్టి నెలకొంది. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతిపైనా పడింది. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ వర్గాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందుకు మరో కారణం లేకపోలేదు.. తరుముకొస్తున్న ఎన్నికలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్ర సర్కార్‌కు సార్వత్రిక ఎన్నికలు 2024 కంటే ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇది. సాధారణంగా పేద,మధ్య తరగతి వర్గాలే ఓటు బ్యాంక్‌లో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఈ తరుణంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మొగ్గితే.. ప్రజాకర్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్ విషయంలో కేంద్రం జాగ్రత్తగా కసరత్తులు చేసినట్లు స్పష్టమవుతోంది. పెరుగుతున్న ధరలతో కుటుంబాల పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. ఏటా ఈ పన్నుల విషయంలో నిరాశే మిగులుతోంది. ఈసారైనా స్వల్ప ఊరటైనా దక్కుతుందా? అనేది చూడాలి. అయితే.. ఎన్నికల వేళ పేద, మధ్య తరగతి వర్గాలకు పలు తాయిలాలూ ఉంటాయంటున్నారు. ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించకపోయినా ఉద్యోగులకు ఎంతో కొంత ఊరటనిచ్చేలా 80సి పన్ను మినహాయింపుల పెంపు వంటి చర్యలుండవచ్చని చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివాటిపై పలు వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ద్రవ్యోల్బణ ప్రభావం ఆదాయ పన్ను ఊరటపై ఎప్పట్లాగే వేతన జీవులు మరోసారి ఆశలు పెట్టుకోగా, భయపెడుతున్న ద్రవ్యల్బోణం కట్టడికి తీసుకోబోయే చర్యలపై ఆర్థిక నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో.. రూ.5-10 లక్షల మధ్య వార్షికాదాయ ఉన్న వర్గంపై ద్రవ్యోల్బణ భారం భారీగా ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం.. ఈసారి కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకుంది. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాల్లో కోతలు.. తదితరాల నుంచి తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా చేస్తుందేమోనని వీరంతా ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది కీలకమైన లోక్‌సభ ఎన్నికలున్నందున ప్రజలపై మరీ భారం మోపలేని పరిస్థితి. పైపెచ్చు ఎన్నో కొన్ని తాయిలాలు ప్రకటించాల్సిన అనివార్యత. వీటన్నింటినీ సంతృప్తి పరుస్తూనే.. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడమనే ప్రధానాంశంతో ఆర్థిక పద్దుకు రూపమివ్వడంలో నిర్మలా సీతారామన్ ఏ మేరకు నెగ్గుకొచ్చారో చూడాలి. -
ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఎగుమతుల పెంపు లక్ష్యంగా రాబోయే 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యుత్ సుంకం మాఫీ, సులభతర రుణ లభ్యత వంటి సహాయక చర్యలను ప్రకటించాలని ఎగుమతిదారులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన (ఆర్ఓడీటీఈపీ) పథకం రీయింబర్స్మెంట్ కోసం మాత్రమే కాకుండా, ఎగుమతుల పెంపు లక్ష్యంగా ఇతర కార్యక్రమాల కోసం కూడా తగిన నిధులను వాణిజ్య మంత్రిత్వశాఖకు ఆర్థికశాఖ అందజేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. ఆర్ఓడీటీఈపీ కింద వివిధ కేంద్ర– రాష్ట్ర సుంకాలు, ఇన్పుట్ ఉత్పత్తులపై వసూలు చేసిన పన్నులు, లెవీలను తిరిగి ఆయా ఎగుమతిదారులకు చెల్లించడం జరుగుతుంది. ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి కస్టమ్స్ సుంకాలలో కొన్ని మార్పులు, తగిన వడ్డీరేటులో రుణ లభ్యత అవసరమని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. భారత్ గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు. 2022–23లో 450 బిలియన్ డాలర్ల లక్ష్యం. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ లక్ష్య సాధనపై సందేహాలు నెలకొన్నాయి. ఎకానమీలో కీలకపాత్ర... దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఎగుమతులు కీలకమైన చోదకమని, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించాలని ముంబైకి చెందిన ఎగుమతిదారు, ది బాంబే టెక్స్టైల్ రీసెర్చ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ కె సరాఫ్ పేర్కొన్నారు. ‘‘తమ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేస్తున్న యూనిట్లకు విద్యుత్ సుంకాన్ని మినహాయించే విధానాన్ని బడ్జెట్ అందించాలి. ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేసే తయారీదారు ఎగుమతిదారులకు 2 శాతానికి సమానమైన పరిహారాన్ని మంజూరు చేయాలి. ఎగుమతిదారులు ఆర్థిక ఇబ్బందుల భర్తీకి ఇది దోహదపడుతుంది. ఈ పరిహారాన్ని ప్రోత్సాహకంగా పరిగణించకూడదు’’ అని సరాఫ్ సూచించారు. ఎగుమతుల రంగం అధిక నాణ్యతతో కూడిన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. సాంకేతికత, నాణ్యత స్పృహ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ రంగం ప్రోత్సహిస్తోందని కూడా ఆయన అన్నారు. ‘భారత్ వస్తు, సేవల ఎగుమతులు 2021–22 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 21.5 శాతంగా ఉన్నాయి. ఆసియాలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నమోదవుతున్న 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఎగుమతుల సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బ్యాంకింగ్, షిప్పింగ్, బీమా, టూరిజం వంటి అనేక రంగాల నుంచి సేవల పరమైన ఎగుమతులకు ప్రోత్సాహకాలు అవసరం’’ అని కూడా ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు. కాగా, లూథియానాకు చెందిన హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్సి రాల్హాన్ మాట్లాడుతూ, ఆధునిక మౌలిక సదుపాయాలతో సెక్టార్–నిర్దిష్ట క్లస్టర్లు లేదా పార్కులను ఏర్పాటు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తగినన్ని నిధులను అందించాలని కోరారు. ఇది తయారీదారుల పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని అన్నారు. ఆఫ్రికా వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారీ ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎగ్జిబిషన్లు, ఫెయిర్లను నిర్వహించడానికి కూడా నిధులు మంజూరు చేయాలనీ ఆయన కోరారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పిస్తారని భావిస్తున్న సంగతి తెలిసిందే. -
పెద్దవారికి పన్ను ఉపశమనం..
వృద్ధాప్యంలో పన్ను నిబంధనలు చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించారు. 75 ఏళ్లు నిండిన వారు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. కాకపొతే ఈ విషయంలో కొన్ని పరిమితులను కూడా నిర్దేశించారు. ఇందుకు సంబంధించి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ పత్రాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలు విషయంలోనే కాకుండా పలు ఇతర వెసులుబాట్లు కూడా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ వరకు పొడిగించిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే.. 75 ఏళ్లు నిండిన వారికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇకమీదట తప్పనిసరి కాదు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే 2022–23 అసెట్‌మెంట్ సంవత్సరం నుంచి అమలవుతుంది. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. పెన్షన్ ఆదాయం, డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం ఉన్నవారికి ఈ వెసులుబాటు. పెన్షన్ ఖాతాలోనే డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం వస్తున్నవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉండి, మరో బ్యాంకులో డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం అందుకునే వారికి రిటర్నుల దాఖలు మినహాయింపు లభించదని అర్థం చేసుకోవాలి. ఒకే బ్యాంకులో పెన్షన్, వడ్డీ ఆదాయం కలిగి ఉన్న వారు డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు సంబంధిత వ్యక్తి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని బ్యాంకు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంది. ఇలా పన్నును గుణించేటప్పుడు చాప్టర్ 6ఏ కింద మినహాయింపులను బ్యాంకు అమలు చేస్తుంది. ప్రతీ ఏడాది 12బీబీఏ అనే పత్రాన్ని (డిక్లరేషన్) 75 ఏళ్లు నిండిన వారు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. తమకు సంబంధిత బ్యాంకు శాఖలోనే పెన్షన్, వడ్డీ ఆదాయం తప్పించి మరే ఇతర ఆదాయం లేదన్న ధ్రువీకరణే ఇది. పేరు, చిరునామా, పాన్, పుట్టిన తేదీ, సంవత్సరం (75ఏళ్లు నిండినట్టు తెలియజేయడం) వివరాలను ఫామ్ 12బీబీఏలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెన్షన్ ఖాతా బ్యాంకు వివరాలు, పెన్షన్ ఎవరి నుంచి అందుకుంటున్నారనే వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు, 75ఏళ్లలోపు వారు ఎప్పటి మాదిరే ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇతర రూపాల్లో ఆదాయం ఉన్న వారికి కూడా ఈ మినహాయింపు వర్తించదు. ఆయా అంశాలపై సమగ్రంగా నిపుణుల సూచనలు తీసుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు.. వ్యక్తులు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తే.. ముందస్తుగానే (అడ్వాన్స్ ట్యాక్స్) ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020–21లో రూ.15,000 పన్ను చెల్లించాల్సి వస్తే.. ఆర్థిక సంవత్సరం గడిచిపోయి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు ఆగకూడదు. నిబంధనల ప్రకారం పన్ను మొత్తాన్ని అంచనా వేసుకుని నాలుగు వాయిదాల రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత అదనంగా చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించడం.. ఒకవేళ ముందుగానే ఎక్కువ జమ చేసి ఉంటే ఆ మేరకు రిఫండ్ కోరడం చేయవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే.. సెక్షన్ 234బీ, 234సీ కింద వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ప్రతీ నెలా (ఆలస్యమైన అన్ని నెలలకు) ఒక శాతం చొప్పున (ప్రతీ సెక్షన్‌కు కూడా) ఉంటుంది. అయితే 60ఏళ్లు నిండిన వారు వ్యాపారం లేదా వృత్తి రూపంలో లాభాలు, ఆదాయం లేనట్టయితే అడ్వాన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇతర మినహాయింపులు.. పన్ను చెల్లింపుదారులు.. తనకు, తన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు.. ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. అయితే 60ఏళ్లు పైబడిన వారికి ఈ మొత్తం రూ.50,000 పరిమితిగా ఉంది. దీనికితోడు సెక్షన్ 80డీడీబీ కింద తనకు, తనపై ఆధారపడిన వారికి సంబంధించి కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్సా వ్యయాలు రూ.40,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు (60ఏళ్లలోపువారికి) లభిస్తుంది. 11డీడీలో ఈ వ్యాధుల వివరాలు లభిస్తాయి. ప్రాణాంతక కేన్సర్లు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, పార్కిన్సన్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా ఈ జాబితాలోనివే. 60ఏళ్లు నిండిన వారు ఈ వ్యాధుల కోసం చేసే చికిత్సా వ్యయాలు ఒక రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై (సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపైనా వృద్ధులకు పన్ను లేదు. కోపరేటివ్ బ్యాంకులు, పోస్టల్ డిపాజిట్లకూ సెక్షన్ 80టీటీబీ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. 60ఏళ్లలోపు వారికి అయితే ఈ పరిమితి రూ.10,000గానే (సెక్షన్80టీటీఏ) ఉంది. బ్యాంకులు, కోపరేటివ్‌లు, పోస్టాఫీసుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.40,000 మించితే 10 శాతం టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత)ను మినహాయిస్తారు. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. తమ ఆదాయం పన్ను చెల్లించాల్సినంత లేనప్పుడు బ్యాంకులకు ఫామ్ 15హెచ్ సమరి్పంచినట్టయితే టీడీఎస్‌ను మినహాయించకుండా చూసుకోవచ్చు. ఇక 75 ఏళ్లు నిండి, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారికి కూడా టీడీఎస్ నిబంధనలు వర్తించవు. వేర్వేరు పన్ను శ్లాబులు 60ఏళ్లు పైబడినవారు ఒక ఆర్థిక సంవత్స రంలో రూ.3లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3–5 లక్షల ఆదాయంపై 5%, రూ.5–10 లక్షల ఆదాయంపై 20 %, రూ.10లక్షలు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమలవుతుంది. అదే 80ఏళ్లు నిండిన వారు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల మధ్య ఆదాయంపై 20%, అంతకుమించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సెస్సు, సర్‌చార్జ్ అన్నవి పన్ను చెల్లింపుదారులు అందరికీ వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ఐచ్చికంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. నూతన విధానాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈ తరహా వయసు ఆధారంగా పన్ను రేట్లలో మార్పులనేవి ఉండవు. అందరికీ ఒకవిధమైన పన్ను రేట్లు అమలవుతాయి. పైగా పాత విధానంలో ఎన్నో రకాల పన్ను మినహాయింపులన్నవి నూతన విధానంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. కనుక నూతన విధానానికి మారే ముందు పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అయితే నూతన పన్ను విధానంలోనూ రూ.5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రూ.12,500 పన్ను రాయితీని పొందొచ్చు. -
మేరీకోమ్ చిత్రానికి పన్ను మినహాయింపు!
ముంబై: బాలీవుడ్ లో రూపొందిన మేరీకోమ్ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు లభించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించారు. భారతీయ మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా నటించారు. మేరీకోమ్ చిత్రం చూసి అందరూ స్పూర్తి పొందాలనే ఉద్దేశంతోనే పన్ను మినహాయింపు ఇచ్చినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.