వృద్ధాప్యంలో పన్ను నిబంధనలు చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పలు చర్యలను ప్రకటించారు. 75 ఏళ్లు నిండిన వారు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. కాకపొతే ఈ విషయంలో కొన్ని పరిమితులను కూడా నిర్దేశించారు.
ఇందుకు సంబంధించి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ పత్రాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలు విషయంలోనే కాకుండా పలు ఇతర వెసులుబాట్లు కూడా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ వరకు పొడిగించిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే..
75 ఏళ్లు నిండిన వారికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇకమీదట తప్పనిసరి కాదు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే 2022–23 అసెట్‌మెంట్ సంవత్సరం నుంచి అమలవుతుంది. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. పెన్షన్ ఆదాయం, డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం ఉన్నవారికి ఈ వెసులుబాటు. పెన్షన్ ఖాతాలోనే డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం వస్తున్నవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉండి, మరో బ్యాంకులో డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం అందుకునే వారికి రిటర్నుల దాఖలు మినహాయింపు లభించదని అర్థం చేసుకోవాలి. ఒకే బ్యాంకులో పెన్షన్, వడ్డీ ఆదాయం కలిగి ఉన్న వారు డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు సంబంధిత వ్యక్తి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని బ్యాంకు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంది.
ఇలా పన్నును గుణించేటప్పుడు చాప్టర్ 6ఏ కింద మినహాయింపులను బ్యాంకు అమలు చేస్తుంది. ప్రతీ ఏడాది 12బీబీఏ అనే పత్రాన్ని (డిక్లరేషన్) 75 ఏళ్లు నిండిన వారు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. తమకు సంబంధిత బ్యాంకు శాఖలోనే పెన్షన్, వడ్డీ ఆదాయం తప్పించి మరే ఇతర ఆదాయం లేదన్న ధ్రువీకరణే ఇది. పేరు, చిరునామా, పాన్, పుట్టిన తేదీ, సంవత్సరం (75ఏళ్లు నిండినట్టు తెలియజేయడం) వివరాలను ఫామ్ 12బీబీఏలో ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే, పెన్షన్ ఖాతా బ్యాంకు వివరాలు, పెన్షన్ ఎవరి నుంచి అందుకుంటున్నారనే వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు, 75ఏళ్లలోపు వారు ఎప్పటి మాదిరే ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇతర రూపాల్లో ఆదాయం ఉన్న వారికి కూడా ఈ మినహాయింపు వర్తించదు. ఆయా అంశాలపై సమగ్రంగా నిపుణుల సూచనలు తీసుకోవాలి.
అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు..
వ్యక్తులు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తే.. ముందస్తుగానే (అడ్వాన్స్ ట్యాక్స్) ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020–21లో రూ.15,000 పన్ను చెల్లించాల్సి వస్తే.. ఆర్థిక సంవత్సరం గడిచిపోయి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు ఆగకూడదు. నిబంధనల ప్రకారం పన్ను మొత్తాన్ని అంచనా వేసుకుని నాలుగు వాయిదాల రూపంలో జమ చేయాల్సి ఉంటుంది.
రిటర్నులు దాఖలు చేసిన తర్వాత అదనంగా చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించడం.. ఒకవేళ ముందుగానే ఎక్కువ జమ చేసి ఉంటే ఆ మేరకు రిఫండ్ కోరడం చేయవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే.. సెక్షన్ 234బీ, 234సీ కింద వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ప్రతీ నెలా (ఆలస్యమైన అన్ని నెలలకు) ఒక శాతం చొప్పున (ప్రతీ సెక్షన్‌కు కూడా) ఉంటుంది. అయితే 60ఏళ్లు నిండిన వారు వ్యాపారం లేదా వృత్తి రూపంలో లాభాలు, ఆదాయం లేనట్టయితే అడ్వాన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు.
ఇతర మినహాయింపులు..
పన్ను చెల్లింపుదారులు.. తనకు, తన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు.. ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. అయితే 60ఏళ్లు పైబడిన వారికి ఈ మొత్తం రూ.50,000 పరిమితిగా ఉంది. దీనికితోడు సెక్షన్ 80డీడీబీ కింద తనకు, తనపై ఆధారపడిన వారికి సంబంధించి కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్సా వ్యయాలు రూ.40,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు (60ఏళ్లలోపువారికి) లభిస్తుంది. 11డీడీలో ఈ వ్యాధుల వివరాలు లభిస్తాయి. ప్రాణాంతక కేన్సర్లు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, పార్కిన్‌సన్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా ఈ జాబితాలోనివే.
60ఏళ్లు నిండిన వారు ఈ వ్యాధుల కోసం చేసే చికిత్సా వ్యయాలు ఒక రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై (సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపైనా వృద్ధులకు పన్ను లేదు. కోపరేటివ్ బ్యాంకులు, పోస్టల్ డిపాజిట్లకూ సెక్షన్ 80టీటీబీ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. 60ఏళ్లలోపు వారికి అయితే ఈ పరిమితి రూ.10,000గానే (సెక్షన్80టీటీఏ) ఉంది.
బ్యాంకులు, కోపరేటివ్‌లు, పోస్టాఫీసుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.40,000 మించితే 10 శాతం టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత)ను మినహాయిస్తారు. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. తమ ఆదాయం పన్ను చెల్లించాల్సినంత లేనప్పుడు బ్యాంకులకు ఫామ్ 15హెచ్ సమరి్పంచినట్టయితే టీడీఎస్‌ను మినహాయించకుండా చూసుకోవచ్చు. ఇక 75 ఏళ్లు నిండి, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారికి కూడా టీడీఎస్ నిబంధనలు వర్తించవు.
వేర్వేరు పన్ను శ్లాబులు
60ఏళ్లు పైబడినవారు ఒక ఆర్థిక సంవత్స రంలో రూ.3లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3–5 లక్షల ఆదాయంపై 5%, రూ.5–10 లక్షల ఆదాయంపై 20 %, రూ.10లక్షలు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమలవుతుంది. అదే 80ఏళ్లు నిండిన వారు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల మధ్య ఆదాయంపై 20%, అంతకుమించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సెస్సు, సర్‌చార్జ్ అన్నవి పన్ను చెల్లింపుదారులు అందరికీ వర్తిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ఐచ్చికంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. నూతన విధానాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈ తరహా వయసు ఆధారంగా పన్ను రేట్లలో మార్పులనేవి ఉండవు. అందరికీ ఒకవిధమైన పన్ను రేట్లు అమలవుతాయి. పైగా పాత విధానంలో ఎన్నో రకాల పన్ను మినహాయింపులన్నవి నూతన విధానంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. కనుక నూతన విధానానికి మారే ముందు పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అయితే నూతన పన్ను విధానంలోనూ రూ.5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రూ.12,500 పన్ను రాయితీని పొందొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment