
న్యూఢిల్లీ: సవరణ రిటర్నులు ఆదాయపన్ను శాఖకు అదనపు పన్ను ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లలో 56 లక్షల మేర సవరించిన ఐటీ రిటర్నులు దాఖలు కాగా, వీటి ద్వారా రూ.4,600 కోట్ల పన్ను ఆదాయం సమకూరినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్ నితిన్ గుప్తా ప్రకటించారు. తమ సేవలను మెరుగుపరుచుకుంటూ, వివాద రహిత వాతావరణం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ఒకసారి దాఖలు చేసిన ఐటీఆర్‌లకు సంబంధించి సవరణలు చేసుకునే అవకాశాన్ని 2022–23 బడ్జెట్‌లో ప్రకటించడం తెలిసిందే. అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత నుంచి రెండు సంవత్సరాల వరకు ఇలా సవరణలు దాఖలు చేసుకునే వెసులుబాటు వచి్చంది. రూ.కోటికి పైగా పన్నుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్‌ల పరిష్కారానికి వీలుగా కర్ణాటకలోని మైసూరులో డిమాండ్ మేనేజ్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు గుప్తా వెల్లడించారు.
2014–15 నాటికి రూ.25వేల వరకు పెండింగ్‌లో ఉన్న పన్ను డిమాండ్‌లను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. ఇలాంటి 1.1 కోట్ల పన్ను డిమాండ్‌ల ఉపసంహరణతో కేంద్రం రూ.2,500–3,600 కోట్లను కోల్పోనుంది. కానీ, ఈ వెసులుబాటు 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పస్తుందని నితిన్ గుప్తా తెలిపారు. ఏటా పన్నుల ఆదాయం రూ.19.5 లక్షల కోట్లతో పోలిస్తే ఇది స్వల్ప మొత్తమేనన్నారు.