న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్‌నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్‌ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment