PAN number
-
గంటా.. ఒక భార్య.. రెండు పాన్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలుకు మరో పాన్ అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్‌ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్‌ను కూడా దాఖలు చెయ్యలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్‌ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. -
ఆధార్‌తో 90 కోట్ల మొబైల్ నంబర్స్ అనుసంధానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆధార్‌తో ఒక కోటికిపైగా మొబైల్ నంబర్స్ అనుసంధానం అయ్యాయి. జనవరిలో ఈ సంఖ్య 56.7 లక్షలు నమోదైందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానించడం ఈ పెరుగుదలకు కారణం అని వివరించింది. ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్‌తో తమ మొబైల్ నంబర్‌ను అనుసంధానించినట్టు అంచనా. ఆధార్‌ను ప్రామాణికంగా చేసుకుని నమోదైన లావాదేవీలు జనవరిలో 199.62 కోట్లు, ఫిబ్రవరిలో 226.29 కోట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరి వరకు ఇటువంటి లావాదేవీలు 9,255 కోట్లు నమోదు కావడం గమనార్హం. ఈ–కేవైసీ లావాదేవీలు ఫిబ్రవరిలో 26.79 కోట్లు కాగా ఇప్పటి వరకు ఇవి మొత్తం 1,439 కోట్లుగా ఉన్నాయి. -
రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్/ఆధార్
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్‌ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు. -
మార్చి 31 వరకూ పాన్–ఆధార్ అనుసంధానం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌తో పాన్ అనుసంధాన గడువును మరోసారి పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. అధార్–పాన్ అనుసంధాన గడువు పొడిగించడం ఇది మూడోసారి. కాగా మూమూలుగా ఆధార్–పాన్ అనుసంధానానికి చివరి తేదీ జూలై 31. కేంద్రం ఈ తేదీని తర్వాత ఆగస్ట్ 31 వరకు, అటుపై మళ్లీ డిసెంబర్ 31 వరకు, ఇప్పుడు తాజాగా మార్చి 31 వరకు పొడిగించింది. కొందరు పన్ను చెల్లింపుదారులు వారి పాన్ నంబర్‌ను ఇప్పటికీ ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదనే అంశం తమ దృష్టికి వచ్చిందని, అందుకే తాజాగా గడువును పొడిగిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ నాటికి 33 కోట్ల పాన్ నంబర్లకు గానూ 13.28 కోట్లే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. -
బంగారం రూ.50,000 మించినా పాన్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల కొనుగోలుదారులు, విక్రేతలకు కేంద్రం తీపి కబురు అందించింది. రూ.50,000కు మించి విలువైన ఆభరణాలు కొనుగోలు చేసినా సరే పాన్ నంబర్ వివరాలు తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బంగారు, రత్నాభరణాల వర్తకులకు సంబంధించి లోగడ తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ను కేంద్రం తాజాగా రద్దు చేసింది. దీంతో అధిక కొనుగోలు దారుల వివరాలను వర్తకులు ఆర్థిక నిఘా విభాగానికి తెలియజేయాల్సిన అవసరం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనానికి ఆభరణాల పరిశ్రమ చోటు కల్పిస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఖరీదైన లోహాలు, విలువైన రాళ్ల వ్యాపారులు, ఇతర అధిక విలువ కలిగిన ఉత్పత్తుల్లో వ్యాపారం నిర్వహించేవారిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కిందకు తెస్తూ కేంద్రం గత ఆగస్ట్‌లో నోటిఫికేషన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పరిశ్రమ నుంచి వచ్చిన వినతుల మేరకు ఎన్నో అంశాలను పరిశీలించిన అనంతరం నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ రంగానికి చెందిన భాగస్వాములతో సంప్రదించిన తర్వాత వేరే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది. -
పాన్ అనుసంధానానికి గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి పాన్ నంబరు లేదా ఫారం–60ని తీసుకోవడానికి గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు వాస్తవానికి ఫిబ్రవరి 28తోనే ముగిసినప్పటికీ.. తాజాగా దీన్ని జూన్ 30 దాకా పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ. 15 లక్షల కోట్లు వచ్చి చేరిన దరిమిలా.. ఆదాయ పన్ను శాఖ డిపాజిట్ల సరళిని విశ్లేషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పన్ను ఎగవేతదారులతో కఠినంగా వ్యవహరించే దిశగా.. ఖాతాదారులందరి దగ్గర్నుంచి పర్మనెంట్ అకౌంటు నంబర్ (పాన్) లేదా ఫారం 60ని తీసుకోవాల్సిందిగా బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసులకు జనవరిలో సూచించింది. అలాగే లావాదేవీల రికార్డులు కూడా భద్రపర్చాలని పేర్కొంది. పాన్ నంబరు లేని వారు ఫారం 60ని సమర్పించాల్సి ఉంటుంది. -
పన్ను చెల్లింపులు ఇక ‘స్మార్ట్’
• నిమిషాల్లో పాన్ నంబర్ • త్వరలో ఐటీ శాఖ మొబైల్ యాప్... న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లోనే పాన్ నంబర్ అందించే విధంగా ఆదాయ పన్ను శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ తయారీపై కసరత్తు చేస్తోంది. ఆన్లైన్లో సత్వరం పన్ను చెల్లింపులు, రిటర్నుల ట్రాకింగ్ మొదలైన సదుపాయాలు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ ప్రాథమిక స్థాయిలోనే ఉందని, ఆర్థిక శాఖ అనుమతులు పొందిన తర్వాత పైలట్ ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరింత మందిని పన్నుల పరిధిలోకి తెచ్చే దిశగా ఆధార్ ఆధారంగా నిమిషాల్లో పాన్ నంబర్ జారీ చేయాలని యోచిస్తున్నట్లు వివరించాయి. ఇప్పటిదాకా 111 కోట్ల మేర ఆధార్ నంబర్లు జారీ అయినట్లు అంచనా. ఆధార్ నంబర్ ప్రస్తుతం కొత్త సిమ్ కార్డులు తీసుకునేందుకు, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, సబ్సిడీల బదలాయింపు మొదలైన వాటి కోసం ఉపయోగపడుతోంది. గణాంకాల ప్రకారం ఏటా 2.5 కోట్ల మంది ప్రజలు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పైగా పాన్ కార్డుహోల్డర్లు ఉన్నారు. రూ. 50,000కు మించిన నగదు విత్‌డ్రాయల్‌కు, రూ.2 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల లావాదేవీలకు ప్రభుత్వం పాన్ నంబర్ తప్పనిసరి చేసింది. మరిన్ని భద్రతా ఫీచర్స్ గల కొత్త పాన్ కార్డులను ఈ ఏడాది జనవరి 1 నుంచే ఐటీ శాఖ జారీ చేయడం ప్రారంభించింది. ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు.. అసెసీల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ–నివారణ్ సదుపాయాన్ని ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా 60 ఆయకర్ సంపర్క్ కేంద్రాల్లో (ఆస్క్) ప్రారంభించింది. త్వరలో మరో 100 ఆస్క్లలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారి తెలిపారు. ఇందుకోసం చాలా సులభతరమైన ఒక్క పేజీ ఫారం నింపాల్సి ఉంటుంది. ఫిర్యాదును ట్రాక్ చేసేందుకు అధికారులు ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. -
నగదు వాడకంపై ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు?
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు, నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షల అనంతరం నగదు లావాదేవీలపై మరిన్ని చెక్పాయింట్లు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వచ్చే బడ్జెట్లో నగదు వాడకంపై మరిన్ని ఆంక్షలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాన్ కార్డు అవసరమయ్యే నగదు లావాదేవీల మొత్తాన్ని ప్రభుత్వం మరింత తగ్గించేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇన్నిరోజులు రూ.50వేల నగదు కొనుగోళ్లపై వినియోగదారులు పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.30వేలకు తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో రూ.30 వేలకు సరిపడ ఏమైనా కొనుగోళ్లు చేపడితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇటు పాన్ కార్డు వివరాలు అవసరమయ్యే వ్యాపారి లావాదేవీలను ప్రభుత్వం తగ్గించేస్తుందట. వీటితో పాటు నిర్దేశించిన పరిమితికి మించి నగదు చెల్లింపులు జరిగితే, వాటికీ చార్జీలు వేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. లక్షకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఈ చార్జీలను వేయనుందని టాక్. ఈ చర్యలతో తక్కువ నగదు వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాక బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు విత్‌డ్రాయల్స్‌ను ప్రభుత్వం తగ్గించనుంది. నగదు రహిత ఎకానమీకి ఈ చర్యలు ఎంతో సహకరించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. -
50 రోజుల్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేసినా పాన్ ఇవ్వాలి
ఆదాయపన్ను శాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేలకు మించి చేసే నగదు జమలకు పాన్ నంబర్ ఇవ్వాలనే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉండగా... ఈ నెల 9 నుంచి డిసెంబర్ 30వ తేదీ మధ్య కాలంలో రూ.2.5 లక్షలు, అంతకు మించి చేసే డిపాజిట్లకు కూడా ఇది తప్పనిసరి అని ఆదాయపన్ను శాఖ తాజాగా స్పష్టం చేసింది. అంటే పాన్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఒక రోజులో రూ.50 వేలకు మించకుండా, రోజుకు కొంత చొప్పున డిపాజిట్ చేసుకుందామనుకుంటే ఇకపై వీలు పడదు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు 50 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఈ కాలంలో నల్లధనాన్ని మార్చుకునే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు ఆదాయపన్ను శాఖ ఈ ఆదేశాలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 25 కోట్ల పాన్లను జారీ చేసినట్టు పేర్కొంది. ఆదాయపన్ను శాఖ నోటిఫికేషన్ ప్రకారం... బ్యాంకులు, పోస్టాఫీసులు ఒక రోజులో రూ.50 వేలకు మించి చేసే డిపాజిట్ దారుల వివరాలు, ఈ నెల 9 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.50 లక్షల వరకు డిపాజిట్ చేసే వారి వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ 50 రోజుల గడువులోపు సేవింగ్స ఖాతాల్లో రూ.2.50 లక్షలకు మించి, కరెంట్ ఖాతాల్లో రూ.12.50 లక్షలకు చేసే డిపాజిట్ల వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలని బ్యాంకులు, పోస్టాఫీసులను కోరిన విషయం తెలిసిందే. -
బంగార దుకాణదారులకు కేంద్రం హెచ్చరిక
-
బంగారం దుకాణదారులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు 500, 1000ను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం, మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలు వచ్చేలా చేసింది. బ్లాక్‌మనీని బంగారం వైపు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం దుకాణదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. కొనుగోలు దారులు పాన్ నెంబర్ సమర్పించకపోతే అసలు బంగారం విక్రయాలు చేపట్టవద్దని ఆభరణ దుకాణదారులకు తెలిపింది. ఒకవేళ కొనుగోలుదారుల నుంచి పాన్ నెంబర్ తీసుకోని పక్షంలో ఆభరణ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పాన్ నెంబర్ తీసుకోవడంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆభరణ దుకాణదారులకు రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సూచించారు. బంగారం కొనుగోలు చేస్తున్నవారందరి వివరాలను భద్రపరచాలని వ్యాపారులకు తెలిపారు. పాన్ నెంబర్ ను తనిఖీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే 200 శాతం జరిమానా ఉంటుందని స్పష్టంచేసింది. శుభకార్యాల కోసం నగదు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ప్రజలు కూడా భారీగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. ప్రజల కొనుగోలు డిమాండ్‌ను క్యాష్ చేసుకున్న దుకాణదారులూ బంగారం ధరలను భగ్గుమనేలా పెంచారు. దీంతో బంగారం ధరలు కొన్ని ఆభరణ దుకాణాల్లో రూ.50వేల వరకు పలుకుతున్నాయి. ప్రధాని నిర్ణయాన్ని క్యాష్ చేసుకుని, బ్లాక్ మనీకి సహకరించే బంగార దుకాణదారులపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయింది. -
కంపెనీలకు ప్రత్యేక గుర్తింపుగా పాన్!
న్యూఢిల్లీ: త్వరలో పాన్ నెంబర్ కంపెనీలకు ప్రత్యేక గుర్తింపుగా మారనుంది. దేశంలో వ్యాపారానుకూల పరిస్థితుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. పాన్ నెంబర్‌ను కంపెనీలకు కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యగా మార్చాలని కసరత్తు చేస్తోంది. ఎలాంటి వ్యాపారం నిర్వహించే కంపెనీకైనా పాన్‌ను ప్రత్యేక గుర్తింపుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని క్యాబినెట్ కార్యదర్శి పి.కె.సిన్హా తెలిపారు. ఆయన ఇక్కడ సీఐఐ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లోని పరిస్థితుల కారణంగా వ్యాపారానుకూల పరిస్థితుల జాబితాలో మన ర్యాంకు 142 నుంచి 130 స్థానానికి మెరుగుపడిందని చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అవరోధాలను ఒకదాని తర్వాత మరొకదాన్ని పరిష్కరించుకుంటూ వెళ్తామని తెలిపారు. ఇన్ఫ్రా, రవాణా తదితర రంగాల్లో పలు సంస్కరణలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. -
అడ్డా కూలీలకూ ఐటీ తాఖీదులు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయ పన్ను శాఖ పెద్ద చేపల సంగతి పక్కనపెట్టి, చిన్నా చితక కోసం గాలం వేసే పనిలో ఉంది. పాన్‌నంబర్ లేకుండా జరిగిన లావాదేవీలపై దృష్టిపెట్టి వేధిస్తోంది. బ్యాంకుల నుంచి తెచ్చుకున్న సమాచారాన్నే ఆధారంగా చేసుకుని నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో మధ్యతరగతి వారిని, వ్యవసాయ రైతులను, కూలీలను ఆదాయం పన్ను లెక్కలేంటని ప్రశ్నిస్తోంది. ఎక్కడో ఉన్న పిల్లల చదువుల కోసం, దూర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి ఖాతాలకు డబ్బు పంపించిన వారికి ఈ మధ్య నోటీసులు జారీ చేసింది. పాన్ నెంబర్ లేకుండా ఏడాదిలో రూ.5 లక్షలకు మించి జరిగిన లావాదేవీలకు లెక్కలు చూపాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ విధమైన దాదాపు 6 వేలకుపైగా కేసులకు సంబంధించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. వీరిలో 1200 మంది వరకూ చిన్నా చితక ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారు, చిన్న రైతులు ఉండటం గమనార్హం. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు 14 మంది రోజు కూలీలకు సైతం నోటీసులు వెళ్ళాయి. వీరి పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నారు. కూలీ పని చేసుకునే వారికి లక్షల్లో డబ్బు ఎక్కడదని ఐటీ శాఖ అనుమానం. ఆయా వ్యక్తుల నుంచి వచ్చిన సమాధానం భిన్నంగా ఉంది. తాము రోజు కూలీ చేసుకుంటున్నా, సమీప బంధువులు తమ పిల్లల విద్య కోసం సహాయం చేస్తున్నారనేది వారి వాదన. కొంతమంది తమకు గ్రామాల్లో ఉన్న స్థిరాస్థిని అమ్ముకున్నట్టు చెబుతున్నారు. మరోవైపు బంధువులు అందించిన ఆర్థిక సహాయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఐటీ కోరుతోంది. దీనివల్ల సహాయం చేసిన వారికి సమస్యలు వస్తాయని సదరు వ్యక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులను తీర్చే క్రమంలో తాము బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపినట్టు ముగ్గురు రైతులు తమ సమాధానాల్లో పేర్కొన్నారు.