పాన్ అనుసంధానానికి గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి పాన్ నంబరు లేదా ఫారం–60ని తీసుకోవడానికి గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు వాస్తవానికి ఫిబ్రవరి 28తోనే ముగిసినప్పటికీ.. తాజాగా దీన్ని జూన్ 30 దాకా పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ. 15 లక్షల కోట్లు వచ్చి చేరిన దరిమిలా..
ఆదాయ పన్ను శాఖ డిపాజిట్ల సరళిని విశ్లేషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పన్ను ఎగవేతదారులతో కఠినంగా వ్యవహరించే దిశగా.. ఖాతాదారులందరి దగ్గర్నుంచి పర్మనెంట్ అకౌంటు నంబర్ (పాన్) లేదా ఫారం 60ని తీసుకోవాల్సిందిగా బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసులకు జనవరిలో సూచించింది. అలాగే లావాదేవీల రికార్డులు కూడా భద్రపర్చాలని పేర్కొంది. పాన్ నంబరు లేని వారు ఫారం 60ని సమర్పించాల్సి ఉంటుంది.