పన్ను చెల్లింపులు ఇక ‘స్మార్ట్’
• నిమిషాల్లో పాన్ నంబర్
• త్వరలో ఐటీ శాఖ మొబైల్ యాప్...
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లోనే పాన్ నంబర్ అందించే విధంగా ఆదాయ పన్ను శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ తయారీపై కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్లో సత్వరం పన్ను చెల్లింపులు, రిటర్నుల ట్రాకింగ్ మొదలైన సదుపాయాలు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ ప్రాథమిక స్థాయిలోనే ఉందని, ఆర్థిక శాఖ అనుమతులు పొందిన తర్వాత పైలట్ ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరింత మందిని పన్నుల పరిధిలోకి తెచ్చే దిశగా ఆధార్ ఆధారంగా నిమిషాల్లో పాన్ నంబర్ జారీ చేయాలని యోచిస్తున్నట్లు వివరించాయి.
ఇప్పటిదాకా 111 కోట్ల మేర ఆధార్ నంబర్లు జారీ అయినట్లు అంచనా. ఆధార్ నంబర్ ప్రస్తుతం కొత్త సిమ్ కార్డులు తీసుకునేందుకు, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, సబ్సిడీల బదలాయింపు మొదలైన వాటి కోసం ఉపయోగపడుతోంది. గణాంకాల ప్రకారం ఏటా 2.5 కోట్ల మంది ప్రజలు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పైగా పాన్ కార్డుహోల్డర్లు ఉన్నారు. రూ. 50,000కు మించిన నగదు విత్‌డ్రాయల్‌కు, రూ.2 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల లావాదేవీలకు ప్రభుత్వం పాన్ నంబర్ తప్పనిసరి చేసింది. మరిన్ని భద్రతా ఫీచర్స్ గల కొత్త పాన్ కార్డులను ఈ ఏడాది జనవరి 1 నుంచే ఐటీ శాఖ జారీ చేయడం ప్రారంభించింది.
ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు..
అసెసీల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ–నివారణ్ సదుపాయాన్ని ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా 60 ఆయకర్ సంపర్క్ కేంద్రాల్లో (ఆస్క్) ప్రారంభించింది. త్వరలో మరో 100 ఆస్క్‌లలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారి తెలిపారు. ఇందుకోసం చాలా సులభతరమైన ఒక్క పేజీ ఫారం నింపాల్సి ఉంటుంది. ఫిర్యాదును ట్రాక్ చేసేందుకు అధికారులు ప్రత్యేక నంబరు కేటాయిస్తారు.