నమ్మకమైన కెరీర్‌కు.. మొబైల్ ఆప్స్ డెవలప్‌మెంట్ | Mobile app development for believable Career | Sakshi
Sakshi News home page

నమ్మకమైన కెరీర్‌కు.. మొబైల్ ఆప్స్ డెవలప్‌మెంట్

Published Fri, Sep 5 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

నమ్మకమైన కెరీర్‌కు.. మొబైల్ ఆప్స్ డెవలప్‌మెంట్

నమ్మకమైన కెరీర్‌కు.. మొబైల్ ఆప్స్ డెవలప్‌మెంట్

భారత్‌లో మొబైల్ విప్లవం కొనసాగుతోంది. బేసిక్ ఫోన్లు కనుమరుగై స్మార్ట్‌ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. మాటలకే పరిమితం కాకుండా పాటలు వినేందుకు, ఫోటోలు తీసుకునేందుకు, వీడియోలు చూసుకునేందుకు, వీడియో గేమ్స్‌కు, ఈ-మెయిల్స్ పంపుకోవడానికి.. ఇలా ఎన్నో అవసరాలను స్మార్ట్‌ఫోన్లు తీరుస్తున్నాయి. మొబైల్‌లో పనులను నిర్వర్తించాలంటే సంబంధిత అప్లికేషన్లు(ఆప్స్) అందులో ఉండాలి. వీటిని రూపొందించేవారే.. ఆప్స్ డెవలపర్లు.  ఈ నేపథ్యంలో ఆప్స్ అభివృద్ధిని కెరీర్‌గా ఎంచుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవడం ఖాయం.
 
 నిపుణులకు గిరాకీ
 స్మార్ట్‌ఫోన్లలో గేమింగ్, వీడియో కాల్స్, ఈ-మెయిల్స్, మ్యూజిక్ వంటి సేవలు విస్తృతమవుతుండడంతో మొబైల్ ఆప్ డెవలపర్లకు
  డిమాండ్ భారీగా పెరుగుతోంది. ప్రపంచంలో అతిపెద్ద మొబైల్  మార్కెట్‌లో భారత్ రెండోస్థానంలో నిలుస్తోంది. మొబైల్ అప్లికేషన్ల రాకతో డెవలపర్లకు, సర్వీస్ ప్రొవైడర్లకు వ్యాపార అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. నైపుణ్యం కలిగిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు విపరీతమైన గిరాకీ ఉంది. ఆప్ డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. సీ, సీ++, ఆబ్జెక్టివ్ సీ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పట్టు సాధించా లి. బేసిక్స్ పూర్తిగా నేర్చుకొని మొదట కొన్ని ప్రాజెక్ట్‌ల్లో పనిచేసి అవగాహన పెంచుకోవాలి. స్వయంగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను సృష్టించేందుకు ప్రయత్నిస్తే దీనిపై పరిజ్ఞానం మెరుగుపడుతుంది. తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా అప్లికేషన్లను రూపొందించొచ్చు.
 
 కావాల్సిన స్కిల్స్
 ఆప్ డెవలపర్లకు సృజనాత్మకత తప్పనిసరి. శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలి. సృష్టించిన అప్లికేషన్లను మార్కెట్
 చేసుకోవాలంటే వినియోగదారుల అవసరాలను గుర్తించగల నేర్పు అవసరం. అనుకున్న ఆప్‌ను రూపొందించేవరకు పట్టుదలతో
  పనిచేయగల సామర్థ్యం ఉండాలి. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి.  మొబైల్ రంగంలో మార్పులు వేగంగా
 జరుగుతుంటాయి కాబట్టి ఆ వేగాన్ని అందుకొనే నైపుణ్యం కావాలి.
 
 అర్హతలు: ఇంటర్మీడియెట్ తర్వాత ప్రవేశ పరీక్ష రాసి, కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్  పూర్తిచేయొచ్చు. ప్రైవేట్ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు కూడా ఆప్స్ డెవలప్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
 
 వేతనాలు: ఆప్స్ డెవలపర్లకు వారి అర్హతలు, అనుభవం, పనితీరును బట్టి వేతనాలు అందుతాయి. ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. పనితీరును మెరుగుపర్చుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే పొందొచ్చు. నిపుణులకు విదేశాల్లోనూ అవకాశాలు దక్కుతాయి.  
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ)
 వెబ్‌సైట్స్: www.iiita.ac.in, www.iiitdm.ac.in, www.iiitd.ac.in, www.iiitdmj.ac.in, www.iiitm.ac.in
  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీ, బాంబే
 వెబ్‌సైట్: www.iitd.ac.in, www.iitb.ac.in
  బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ
 వెబ్‌సైట్: www.bitspilani.ac.in
  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) - దుర్గాపూర్
 వెబ్‌సైట్: www.nitdgp.ac.in
 
 ‘ఆప్’ నిపుణులకు డిమాండ్!
 ‘‘స్మార్ట్ ఫోన్ల వినియోగం గణనీయంగా వృద్ధి చెందుతోన్న తరుణంలో మొబైల్ అప్లికేషన్స్‌ను రూపొందించే నిపుణులకు సైతం డిమాండ్ పెరుగుతోంది. వివిధ కేటగిరీల్లో ఇప్పటికే వేలాది మొబైల్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ రంగంలోనూ ఆప్స్ అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే బస్సు టికెట్ దగ్గర్నుంచి ఫ్లైట్ టికెట్ వరకు ఆప్స్ సాయంతో బుక్ చేసుకోవచ్చు.
 
  ఏ సంస్థకైనా గతంలో వెబ్‌సైట్ ఉంటే సరిపోయేది. కానీ ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఎక్కువైన నేపథ్యంలో సంస్థలకు మొబైల్ వెర్షన్‌తో కూడిన ఆప్ తప్పనిసరి అవుతోంది. కాబట్టి ఈ రంగంలో అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. సీ, సీ++, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పరిజ్ఞానం ఉన్నవారు ఆండ్రాయిడ్, లేదా ఐఓఎస్ మొబైల్ ఆప్ డెవలపర్‌గా శిక్షణ పొంది ఈ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ప్రభుత్వం కూడా స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సొంతంగా మొబైల్ ఆప్స్ రూపొందిస్తూ ఉపాధి పొందొచ్చు’’
 -సీహెచ్. అరుణ్‌కుమార్,
 డెరైక్టర్, స్విచ్ సాఫ్ట్ టెక్నాలజీస్
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 డీఎస్సీలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌పై ఏయే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు?     - యామిని, మియాపూర్
 డీఎస్సీలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. తీవ్ర పోటీ ఉన్న ఈ పరీక్షలో విజయం సాధించాలంటే స్టాక్ జీకేతో పాటు వర్తమాన వ్యవహారాలపై దృష్టి సారించాలి. జీకేకు సంబంధించి భారతదేశ జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రాష్ట్రాలు - రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, అవి నెలకొని ఉన్న ప్రదేశాలు, భారత భౌగోళిక అంశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలను ఔపోసన పట్టాలి. కరెంట్ అఫైర్స్‌లో ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటన నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. దీనికి నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేయాలి. రోజూ ఒకట్రెండు ప్రామాణిక వార్తా పత్రికలను చదివి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. మార్కెట్లో పేరున్న ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను కూడా చదవాలి. ఈ క్రమంలో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు, రాజకీయ సంఘటనలు, ఎన్నికలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, వాణిజ్య వ్యవహారాలు, శాస్త్ర, సాంకేతిక అంశాలు, పర్యావరణం, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, క్రీడలకు సంబంధించిన పోటీలు- విజేతలు, ఇతర ముఖ్యమైన సమాచారం, అంతర్జాతీయ సదస్సులు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, క్లిష్టతను పరిశీలించాలి. వాటికి అనుగుణంగా సిద్ధం కావాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను బిట్లను చదవడానికే పరిమితం చేయకూడదు. ఒక ముఖ్య ఘటన జరిగినప్పుడు దాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం గుర్తించగలరు.
 ఇన్‌పుట్స్: జంపాన సుధాకర్, సీనియర్ ఫ్యాకల్టీ
 
 జాబ్స్ అలర్‌‌ట్స
 ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా
 హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
  హెడ్ - మోటార్   అనలిస్ట్ - హెల్త్
  అనలిస్ట్ - ప్రాపర్టీ, ఇంజనీరింగ్, మెరైన్
 అర్హతలు: ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా; చివరి తేది: సెప్టెంబర్ 18
 వెబ్‌సైట్: https://www.iib.gov.in
 
 హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్
 నోయిడాలోని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
  డిప్యూటీ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్
  ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్
  ఎంఐఎస్ అనలిస్ట్(ఫైనాన్స్)
 అర్హతలు: సంబంధిత విభాగాల్లో పీజీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
 చివరి తేది: సెప్టెంబర్ 10
 వెబ్‌సైట్: www.lifecarehll.com
 
 సీఆర్‌పీఎఫ్
 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 36
  సబ్ ఇన్‌స్పెక్టర్ (రేడియో గ్రాఫర్): 6
  అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫిజియో థెరపిస్ట్): 1
  అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మాసిస్ట్): 73
  అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (లేబొరేటరీ టెక్నీషియన్): 6
  అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్): 1
  అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (డెంటల్ టెక్నీషియన్): 6
  హెడ్‌కానిస్టేబుల్ (జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్): 4
  కానిస్టేబుల్ (వార్డ్ బాయ్/గర్ల్): 24
 పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 చివరి తేది: అక్టోబర్ 7
 వెబ్‌సైట్: http://crpf.nic.in
 
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
 బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  లైబ్రరీ ఆఫీసర్ (గ్రేడ్-2): 5
 అర్హతలు: మూడేళ్ల పోస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్(పీపీక్యూఈ) ఉండాలి.
  అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్(గ్రేడ్-1): 1
 అర్హతలు: లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
 నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయోపరిమితి, అనుభవం ఉండాలి.
 చివరి తేది: సెప్టెంబర్ 30
 వెబ్‌సైట్: www.hal-india.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement