అడ్డా కూలీలకూ ఐటీ తాఖీదులు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయ పన్ను శాఖ పెద్ద చేపల సంగతి పక్కనపెట్టి, చిన్నా చితక కోసం గాలం వేసే పనిలో ఉంది. పాన్‌నంబర్ లేకుండా జరిగిన లావాదేవీలపై దృష్టిపెట్టి వేధిస్తోంది. బ్యాంకుల నుంచి తెచ్చుకున్న సమాచారాన్నే ఆధారంగా చేసుకుని నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో మధ్యతరగతి వారిని, వ్యవసాయ రైతులను, కూలీలను ఆదాయం పన్ను లెక్కలేంటని ప్రశ్నిస్తోంది. ఎక్కడో ఉన్న పిల్లల చదువుల కోసం, దూర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి ఖాతాలకు డబ్బు పంపించిన వారికి ఈ మధ్య నోటీసులు జారీ చేసింది. పాన్ నెంబర్ లేకుండా ఏడాదిలో రూ.5 లక్షలకు మించి జరిగిన లావాదేవీలకు లెక్కలు చూపాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ విధమైన దాదాపు 6 వేలకుపైగా కేసులకు సంబంధించి ఆరా తీస్తున్నట్టు సమాచారం.
వీరిలో 1200 మంది వరకూ చిన్నా చితక ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారు, చిన్న రైతులు ఉండటం గమనార్హం. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు 14 మంది రోజు కూలీలకు సైతం నోటీసులు వెళ్ళాయి. వీరి పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నారు. కూలీ పని చేసుకునే వారికి లక్షల్లో డబ్బు ఎక్కడదని ఐటీ శాఖ అనుమానం. ఆయా వ్యక్తుల నుంచి వచ్చిన సమాధానం భిన్నంగా ఉంది. తాము రోజు కూలీ చేసుకుంటున్నా, సమీప బంధువులు తమ పిల్లల విద్య కోసం సహాయం చేస్తున్నారనేది వారి వాదన. కొంతమంది తమకు గ్రామాల్లో ఉన్న స్థిరాస్థిని అమ్ముకున్నట్టు చెబుతున్నారు. మరోవైపు బంధువులు అందించిన ఆర్థిక సహాయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఐటీ కోరుతోంది. దీనివల్ల సహాయం చేసిన వారికి సమస్యలు వస్తాయని సదరు వ్యక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులను తీర్చే క్రమంలో తాము బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపినట్టు ముగ్గురు రైతులు తమ సమాధానాల్లో పేర్కొన్నారు.