బంగారం దుకాణదారులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు 500, 1000ను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం, మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలు వచ్చేలా చేసింది. బ్లాక్మనీని బంగారం వైపు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం దుకాణదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. కొనుగోలు దారులు పాన్ నెంబర్ సమర్పించకపోతే అసలు బంగారం విక్రయాలు చేపట్టవద్దని ఆభరణ దుకాణదారులకు తెలిపింది. ఒకవేళ కొనుగోలుదారుల నుంచి పాన్ నెంబర్ తీసుకోని పక్షంలో ఆభరణ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పాన్ నెంబర్ తీసుకోవడంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆభరణ దుకాణదారులకు రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సూచించారు. బంగారం కొనుగోలు చేస్తున్నవారందరి వివరాలను భద్రపరచాలని వ్యాపారులకు తెలిపారు. పాన్ నెంబర్ ను తనిఖీ చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే 200 శాతం జరిమానా ఉంటుందని స్పష్టంచేసింది. శుభకార్యాల కోసం నగదు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ప్రజలు కూడా భారీగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. ప్రజల కొనుగోలు డిమాండ్ను క్యాష్ చేసుకున్న దుకాణదారులూ బంగారం ధరలను భగ్గుమనేలా పెంచారు. దీంతో బంగారం ధరలు కొన్ని ఆభరణ దుకాణాల్లో రూ.50వేల వరకు పలుకుతున్నాయి. ప్రధాని నిర్ణయాన్ని క్యాష్ చేసుకుని, బ్లాక్ మనీకి సహకరించే బంగార దుకాణదారులపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయింది.