ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలా? వద్దా?
ఢిల్లీ: 'అక్షయ తృతీయ' అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే 'తృతీయ' తిథి అని పెద్దలు చెపుతారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం సంప్రదాయం. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు అప్పు చేసైనా సరే బంగారం కొనడం భారతీయుల్లో ఆనవాయితీ. అయితే ఈ నెల (మే) 9 న వస్తున్న అక్షయ తృతీయరోజు బంగారం కొనాలా? వద్దా.... అనే దానిపై విశ్లేషకులు ఏమంటున్నారు.
స్వదేశీ బంగారం ధరలు గత రెండు సంవత్సరాలుగా 10 గ్రాములు 30,000 ల మార్కు దగ్గరే అటూ ఇటూ కదలాడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం కఠినతరం కావడం, పెళ్లిళ్ల సీజన్,డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం ధరలు పుంజుకున్నాయి. ప్రధాన కరెన్సీల్లో నమోదవుతున్న బలహీనత కూడా బంగారం ధరల్లో జోరు పెంచింది. దీంతో గత వారం రోజులు 30 వేల దగ్గర స్థిరంగా ట్రేడవుతోంది పసిడి. ఈ నేపథ్యంలో బంగారం కొనడం సరైన నిర్ణయమా కాదా అనే అనుమానం రాక తప్పదు. అయితే ధరలు తగ్గినపుడు బంగారాన్ని కొనడమే సబబు అని విశ్లేషకులు సూచిస్తున్నారు.
కాగా పసిడి జోరు ఇకముందు కూడా కొనసాగుతుందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న ర్యాలీ ముందు కూడా కొనసాగనుందని , ప్రపంచ ఆర్థిక వ్యవస్తలో నెలకొన్న అనిశ్చితి వాతావరణంలో ప్రజలు బంగారంపై పెట్టుబడులు సురక్షితంగా, స్వర్గంగా భావిస్తారని సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా తెలిపారు. అమెరికా ఫెడ్ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని, ఇది బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుందన్నారు.
ఈ క్రమంలో ప్రస్తుత స్తాయినుంచి ధరల్లో ఎలాంటి క్షీణత కనిపించినా ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొనుగోళ్లు జరపాలని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులు తమ క్రమబద్ధమైన పెట్టుబడుల్లో బంగారాన్ని తప్పకుండా జోడించడాలని రైట్ హారిజాన్స్ సీఈఓ అనిల్ రేగో సూచించారు. మౌలిక, నిర్మాణాత్మక పెట్టుబడులకు గోల్డ్ ఎపుడూ స్వీట్ స్పాట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల కోసం బంగారం ఒక మంచి అవకాశమని చెపుతున్నారు
అటు భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్ నెలలో భారీగా తగ్గాయి. 66.33 శాతం క్షీణతతో 19.6 టన్నులుగా నమోదయ్యాయి. బంగారు, వజ్రాలు లాంటి ఇతర విలువైన ఆభరణాలపై ఎన్డీయే సర్కార్ ప్రతిపాదించిన ఒకశాతం ఎక్సైజ్ పన్ను విధింపు, ఆభరణాల వర్తకుల సమ్మె దిగుమతులపై ప్రభావం చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఏటా భారత్ దిగుమతి చేసుకునే వేల టన్నుల బంగారంలో దాదాపు 80 శాతం ఆభరణాల తయారీకే పోతుందని ఎక్స్ పర్ట్స్ అంచనా. మరోవైపు పసిడి కొనుగోళ్లు పెరిగినా, దిగుమతులు తగ్గుముఖం పట్టడం విశేషం.