సాక్షి, అమరావతి: అక్షయ తృతీయ సందర్భంగా రాష్ట్రంలోని పలు బంగారు నగల దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర రూ.62,000 దాటినప్పటికీ వినియోగదారులు వెనుకాడలేదు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా అంతంతమాత్రంగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది బాగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అయిదురెట్లకు పైగా ఎక్కువ వ్యాపారం జరిగినట్లు చెప్పారు.
అక్షయ తృతీయ పర్వదినం పేరుతో అమ్మకాలు పెంచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు 15 రోజుల నుంచి భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల శనివారం ఉదయం ఏడు గంటల నుంచే అమ్మకాలు మొదలయ్యాయి. అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారమూ ప్రత్యేక అమ్మకాలు కొనసాగనున్నాయి.
సాధారణంగా తిరుపతి పట్టణంలో సగటున రోజుకు రూ.10 కోట్ల వరకు బంగారు ఆభరణాల విక్రయాలు జరుగుతుంటాయని, కానీ శనివారం దానికంటే అయిదు రెట్లుకుపైగా ఎక్కువగా అమ్మకాలు జరిగాయని తిరుపతి జ్యువెలరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్ తెలిపారు. బంగారం ధర రికార్డు స్థాయిలో ఉండటంతో కొనుగోళ్లు తక్కువగా ఉంటాయని అంచనా వేశామని, కానీ దానికి భిన్నంగా కొనుగోలుదారులు భారీగా బంగారాన్ని కొన్నారని విజయవాడలోని ఓ కార్పొరేట్ షాపు ప్రతినిధి ఒకరు తెలిపారు.
గతేడాది అక్షయ తృతీయ రోజుకు పదిగ్రాముల బంగారం ధర రూ.53,000 ఉంటేనే కొనుగోళ్లకు అంతగా ముందుకు రాలేదని, సెంటిమెంట్ కోసం చాలా మంది నాణేలతో సరిపెట్టారని తెలిపారు. కానీ ఈ ఏడాది ధర ఎక్కువైనా కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. అక్షయ తృతీయ రోజునే పవిత్ర రంజాన్ పర్వదినం రావడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణంగా వ్యాపారులు వివరించారు.
నగరాలకే పరిమితం
అక్షయ తృతీయ అమ్మకాలు కేవలం పట్టణాలు అందులోనూ కార్పొరేట్ జ్యూవెలరీ సంస్థలకే ఎక్కువగా పరిమితమయ్యాయి. విశాఖ, తిరుపతి, విజయవాడ, నెల్లూరు వంటి నగరాల్లోనే అక్షయ తృతీయ సందడి అధికంగా కనిపించింది. కేవలం కార్పొరేట్ సంస్థల్లో తప్ప చిన్న షాపుల్లో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగినట్లు విశాఖ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోజ్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50,000కుపైగా నగల దుకాణాలు ఉన్నప్పటికీ ఈ పండుగ అమ్మకాలు రెండొందల షాపులకే పరిమితమైనట్లు జ్యూవెలరీ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment