న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల కొనుగోలుదారులు, విక్రేతలకు కేంద్రం తీపి కబురు అందించింది. రూ.50,000కు మించి విలువైన ఆభరణాలు కొనుగోలు చేసినా సరే పాన్ నంబర్ వివరాలు తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బంగారు, రత్నాభరణాల వర్తకులకు సంబంధించి లోగడ తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ను కేంద్రం తాజాగా రద్దు చేసింది.
దీంతో అధిక కొనుగోలు దారుల వివరాలను వర్తకులు ఆర్థిక నిఘా విభాగానికి తెలియజేయాల్సిన అవసరం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనానికి ఆభరణాల పరిశ్రమ చోటు కల్పిస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఖరీదైన లోహాలు, విలువైన రాళ్ల వ్యాపారులు, ఇతర అధిక విలువ కలిగిన ఉత్పత్తుల్లో వ్యాపారం నిర్వహించేవారిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కిందకు తెస్తూ కేంద్రం గత ఆగస్ట్‌లో నోటిఫికేషన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
పరిశ్రమ నుంచి వచ్చిన వినతుల మేరకు ఎన్నో అంశాలను పరిశీలించిన అనంతరం నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ రంగానికి చెందిన భాగస్వాములతో సంప్రదించిన తర్వాత వేరే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment