నగదు వాడకంపై ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు?
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు, నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షల అనంతరం నగదు లావాదేవీలపై మరిన్ని చెక్పాయింట్లు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వచ్చే బడ్జెట్లో నగదు వాడకంపై మరిన్ని ఆంక్షలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాన్ కార్డు అవసరమయ్యే నగదు లావాదేవీల మొత్తాన్ని ప్రభుత్వం మరింత తగ్గించేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇన్నిరోజులు రూ.50వేల నగదు కొనుగోళ్లపై వినియోగదారులు పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.30వేలకు తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది.
దీంతో రూ.30 వేలకు సరిపడ ఏమైనా కొనుగోళ్లు చేపడితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇటు పాన్ కార్డు వివరాలు అవసరమయ్యే వ్యాపారి లావాదేవీలను ప్రభుత్వం తగ్గించేస్తుందట. వీటితో పాటు నిర్దేశించిన పరిమితికి మించి నగదు చెల్లింపులు జరిగితే, వాటికీ చార్జీలు వేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. లక్షకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఈ చార్జీలను వేయనుందని టాక్. ఈ చర్యలతో తక్కువ నగదు వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాక బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు విత్డ్రాయల్స్ను ప్రభుత్వం తగ్గించనుంది. నగదు రహిత ఎకానమీకి ఈ చర్యలు ఎంతో సహకరించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..