మితభాషి ఉర్జిత్
దేశ ప్రజలపై ఉత్పాతంలా వచ్చిపడిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పూర్వాపరా లేమిటో, దాని పర్యవసానాలేమిటో తెలుసుకుందామని ఎంతో ఆశతో ఎదురు చూసినవారికి బుధవారం జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం అసంతృప్తి కలిగించి ఉంటుంది. నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు గురించి ప్రకటించడం... మరికొన్ని గంటల్లో అమల్లోకి రావడం, ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎంల ముందూ, బ్యాంకుల ముందూ పడిగాపులు పడటం మినహా సామాన్య పౌరులకు ఏం జరిగిందో, జరుగుతున్నదో అర్ధంకాలేదు. చాలా సందేహా లకు ఈనాటికీ జవాబులేదు. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సవాళ్లు విసురుకున్నారు. దేశ ప్రజలంతా ఈ నిర్ణయాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారని మోదీ మొదలుకొని కింది స్థాయి బీజేపీ నేతల వరకూ చెబితే... ఇది అనాలోచిత నిర్ణయమని విపక్షాలన్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనైనా ప్రభుత్వం దీనిపై సవివరమైన ప్రకటన చేస్తుందని, విపక్షాలు ఆ దిశగా ఒత్తిడి తెస్తాయని ఆశించినవారు ఆ సమావేశాల తంతు చూసి దిగ్భ్రమచెందారు. మొదలైన దగ్గర నుంచి ముగిసేవరకూ అవి వాయిదాల్లోనే గడిచిపోయాయి. ఇన్నాళ్లకు ఆర్ధిక శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ కమిటీ వంతు వచ్చింది. ఈ కమిటీ ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అసలు హాజరవుతారా లేదా అన్న సందేహాలు చాలామందికొచ్చాయి. అయితే ఆయన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కమిటీ సభ్యులడిగిన ప్రశ్నలకు జవాబులూ ఇచ్చారు. కానీ అవి సభ్యుల్ని సంతృప్తి పరచలేదని అంటున్నారు. సమయం సరిపోకపోవడంతో మరోసారి కూడా వారిని కమిటీ ముందుకు పిలుస్తారని చెబుతున్నారు. వాస్తవానికి ఇదే విషయంపై ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) కూడా ఈ నెల 20న సమావేశం కాబోతోంది. దానికి కూడా ఉర్జిత్ హాజరుకావలసి ఉంటుంది.
స్థాయీ సంఘాలకు విపక్ష సభ్యుల నేతృత్వం ఉన్నప్పుడు... ఆ సంఘాలు సమీక్షించే అంశాలు సంచలనాత్మకమైనవి అయినప్పుడు ప్రశ్నలెప్పుడూ విచ్చుకత్తు ల్లాగే ఉంటాయి. సూటి ప్రశ్నకు సూటి జవాబు రాని స్థితి సాధారణంగా రెండు సందర్భాల్లో ఉంటుంది. సంధించిన ప్రశ్నకు జవాబు లేకపోవడంవల్ల లేదా జవాబివ్వడానికి పరిమితులు అడ్డొచ్చినప్పుడు నోరు పెగలదు. ఇచ్చే సమాధానం మరిన్ని ప్రశ్నలకు దారితీసే ప్రమాదం ఉంటే ఇక చెప్పనవసరమే లేదు. ఏ అవస్థ వల్ల ఉర్జిత్ సవివరమైన జవాబివ్వలేకపోయారో లేదా అరకొరగా ఇచ్చి ఊరు కున్నారో ఆయనే స్వయంగా చెబితే తప్ప ప్రజలకు తెలిసే అవకాశం లేదు. నిజానికి ఆయన జవాబివ్వని ప్రశ్నలేవీ జటిలమైనవి కాదు.
ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి ఎంత నగదు తిరిగొచ్చిందన్న ప్రశ్నకు సాధారణ బ్యాంకు ఉద్యోగి జవాబు చెప్పలేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇన్ని నెలల తర్వాత కూడా ఉర్జిత్ పటేల్ చెప్పలేకపోవడం అయోమయాన్ని కలిగిస్తుంది. తిరిగొచ్చిన నోట్ల విలువను మరోసారి లెక్కేయమని కింది బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంక్ సూచిం చినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అందువల్లే జవాబు ఇవ్వలేకపోతే ఆ సంగతి కమిటీకి చెప్పడంవల్ల కలిగే నష్టమేమిటో అర్ధంకాదు. ఎప్పటికల్లా బ్యాంకింగ్ కార్య కలాపాలు సాధారణ స్థితికి చేరతాయన్న ప్రశ్న కూడా ఇటువంటిదే. ఈ రెండు అంశాలూ నిజానికి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నవి. వాటికి కనీసం స్థాయీ సంఘంలోనైనా జవాబులు రాకపోతే ఏమనుకోవాలి? ఉర్జిత్ ఆమాత్రం ఆలోచించ లేకపోయారా?
స్థాయీ సంఘం సమావేశంలో ఉర్జిత్ నుంచి విస్పష్టమైన జవాబులు వచ్చి ఉంటే ఆయన పతాక శీర్షికలకు ఎక్కేవారు. ఆయనిచ్చిన వివరణలపై చానెళ్ల చర్చలు హోరెత్తేవి. కానీ ఆయనకు అలాంటి ఆసక్తి ఉన్నట్టు లేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాత్రం అనుకోకుండా వార్తలకెక్కారు. మౌన మునిగా పేరుబడిన ఆయన కీలక సమయాల్లో చురుగ్గా ఉండగలనని, సమర్ధుడైన మధ్యవర్తిగా వ్యవ హరించి పరిస్థితిని చక్కదిద్దగలనని నిరూపించారు. సభ్యులు కటువుగా మాట్లాడు తుంటే రాజ్యాంగపరమైన సంస్థగా ఆర్‌బీఐని గౌరవించాల్సిన అవసరం ఉన్నదని హితవు పలకడమే కాక, ఒక ప్రశ్నకు ఇరకాటంలో పడిన ఉర్జిత్‌ను ఉద్దేశించి ‘దానికి మీరు జవాబు ఇవ్వనవసరం లేదు’ అని ఊరడించారట! ఉర్జిత్‌ను ఒకప్పుడు రిజర్వ్‌బ్యాంకుకు తీసుకొచ్చింది తానేనన్న ఆపేక్ష వల్లనో, ఆర్‌బీఐకి తాను సైతం గవర్నర్‌గా పనిచేసి ఉండటంవల్ల ఏర్పడిన సెంటిమెంటు వల్లనో మన్మోహన్‌లో కద లిక వచ్చి ఉంటుంది.
ఈ సందర్భంగా మన పార్లమెంటరీ కమిటీల పనితీరు గురించి మాట్లాడు కోవాలి. ప్రజాపద్దుల కమిటీ ఉండటమన్న సంప్రదాయం బ్రిటిష్‌వారి కాలంలోనే మొదలుకాగా, వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కమిటీలు 1993 నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చాయి. వీటిని అమెరికా ప్రతినిధుల సభ కమిటీలతో, బ్రిటన్ పార్లమెంటు కమిటీలతో పోల్చవచ్చు. అయితే ఆ రెండుచోట్లా కమిటీలు పారదర్శకంగా పనిచేస్తాయి. ఆ కమిటీ సమావేశాలకు పౌరులు హాజరుకావొచ్చు. వాటి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. భవిష్యత్తులో ఎవరైనా చూడటానికి వీలుగా ఆ రికార్డుల్ని భద్రపరుస్తారు.
ఆ రెండు దేశాల్లోని కమిటీల తరహాలోనే మన కమిటీలు కూడా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాల్లోని లొసుగులను వెలికి తీస్తాయి. అందుకోసం ఎవరినైనా పిలుస్తాయి. ఏ పత్రాన్నయినా తమ ముందుంచ మని కోరతాయి. కానీ ఈ కార్యకలాపాలన్నీ గోప్యంగా జరుగుతాయి. ఇది సబబేనా? అమెరికా, బ్రిటన్ తరహాలో కమిటీలు పనిచేస్తే ప్రభుత్వ నిర్ణయాల్లోని మంచిచెడ్డలు పౌరులకు తెలుస్తాయి. కమిటీల ముందు నీళ్లు నమిలేవారి ఆంత ర్యాలు బయటపడతాయి. ప్రజల నిఘా ఉంటే కమిటీల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని చెప్పుకుంటాం. కానీ వాటి అనుబంధ సంఘాలు ఆ సంస్కృతికి అనుగుణంగా లేకపోవడం వింత కాదా? పార దర్శకత ప్రజాస్వామ్యానికి బలమే తప్ప విఘాతం కాదని గుర్తించడం అవసరం. అందుకనుగుణంగా మార్పులు చేయడం తప్పనిసరి.