దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న అనిశ్చితిని చూసి విసుగెత్తిన నేపాల్ ప్రజానీకం తొలిసారి జరిగిన పార్లమెంటు, ప్రొవిన్షియల్ ఎన్నికల్లో విస్పష్టమైన తీర్పునిచ్చి సుస్థిరతకు బాటలు పరిచారు. గత నెల 26, ఈ నెల 7న రెండు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఎన్–యుఎంఎల్, సీపీఎన్–మావోయిస్టు పార్టీల నేతృ త్వంలోని వామపక్ష కూటమి విజయ పథంలో దూసుకుపోతుండగా... నేపాలీ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజాతంత్ర కూటమికి ఊహించని షాక్ తగిలింది. నూతన రాజ్యాంగాన్ని అనుసరించి 275 స్థానాలున్న జాతీయ పార్లమెంటు– ప్రతినిధి సభలో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. మిగిలిన 110 స్థానా లకు దామాషా ప్రాతినిధ్య విధానంలో సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలతో పాటు 330 ప్రొవెన్షియల్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 165 స్థానాల్లో వామపక్ష కూటమి ఇప్పటికే 106 స్థానాలు గెల్చుకుంది. ప్రజాతంత్ర కూటమి 30 సీట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. మొత్తం ఏడు ప్రావిన్స్‌లలో ఆరు సీపీఎన్–యూఎంఎల్‌కు లభించాయి. ఈ ఎన్నికలతో నేపాల్ గణతంత్ర వ్యవస్థలోకి అడుగిడబోతోంది.
రెండు శతాబ్దాలపాటు నేపాల్‌లో కొనసాగిన రాచరిక వ్యవస్థ వల్ల అవినీతి, అసమానతలు, ఆకలి, అనారోగ్యం వంటి రుగ్మతలతో దేశం భ్రష్టుపట్టిపోయింది. చివరికది అంతర్యుద్ధానికి దారితీసింది. దశాబ్దంపాటు కొనసాగిన మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటంలో వేలాదిమంది మరణించారు. ఐక్యరాజ్యసమితి మధ్య వర్తిత్వం తర్వాత 2006లో ఆ పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది. సంపూర్ణ గణతంత్ర రిపబ్లిక్‌ను ఏర్పర్చడం కోసం 2008లో రాజ్యాంగ నిర్ణాయక సభను నెలకొల్పి దానికి ఎన్నికలు నిర్వహించగా మావోయిస్టులు 40 శాతం స్థానాలు కైవసం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ ప్రధాని అయ్యారు. రెండేళ్లలో రాజ్యాంగ రచన పూర్తి చేయాలని, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని... ఈలోగా రాజ్యాంగ నిర్ణాయక సభే పార్లమెంటుగా ఉండాలని నిర్ణయించారు. అయితే రెండేళ్లనుకున్న రాజ్యాంగ రచనకు ఏడేళ్ల సమయం పట్టింది. తొలి రాజ్యాంగ నిర్ణాయక సభ రద్దయి మరోసారి ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్టు 2015లో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశం కకావికలమైంది. ఆ నష్టం నుంచి అది ఈనాటికీ కోలుకోలేకపోయింది. మొత్తంమీద 2006 నుంచి ఇప్పటివరకూ నేపాల్ అస్థిరతతో అట్టుడుకుతోంది. అధికారంలో కొచ్చిన పార్టీల్లో ఏ ఒక్కటీ మెరుగైన పాలన అందించలేకపోయాయి.
ఆదినుంచీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపాలీ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పలేదు. సూత్రబద్ధ రాజకీయాలను నడపలేని ఆ పార్టీ నాయకుల అశక్తత దాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. పరస్పరం కత్తులు దూసుకునే రెండు కమ్యూనిస్టు పార్టీలూ కూటమి ఏర్పరిచాక నేపాలీ కాంగ్రెస్‌లో వణుకుపుట్టి అది మాధేసి పార్టీలతో జతకట్టింది. అంతవరకూ ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. ఆ పార్టీలు మైనారిటీ జాతులకు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. కానీ దేశంలో తిరిగి రాచరికాన్ని నెలకొల్పాలని కోరుతున్న రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ(ఆర్‌పీపీ)ని సైతం ఆ కూటమిలో చేర్చుకుంది. రాచరిక వ్యవస్థకు వ్యతి రేకంగా సాగిన పోరాటంలో తన పాత్ర కీలకమైనదని, ఆ తర్వాత రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం చురుగ్గా పాల్గొని ప్రజాతంత్ర వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడ్డానని చెప్పే నేపాలీ కాంగ్రెస్ అందుకు విరుద్ధమైన పార్టీని కూటమిలో ఎలా చేర్చుకుందో అనూహ్యం. ఇది చాలదన్నట్టు నేపాల్ పునరుజ్జీవానికి, అభివృద్ధికి తన ప్రణాళికలేమిటో అది ఓటర్లకు చెప్పలేకపోయింది. అటు రెండు కమ్యూనిస్టు పార్టీలూ చాకచక్యాన్ని ప్రదర్శించాయి. ఆమధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఘోర వైఫల్యాన్ని చవిచూసిన మావోయిస్టు పార్టీ తన బలం ఈ పదేళ్లలో గణనీయంగా క్షీణించిందని గ్రహించింది. అందుకే ఈ ఎన్నికల్లో అది సీపీఎన్–యూఎంఎల్‌తో కూటమి కట్టాలని నిర్ణయించుకుంది. కమ్యూనిస్టులు దీంతోనే సంతృప్తి పడలేదు. తమ మధ్య పెద్దగా వైరుధ్యాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పార్టీలుగా మనుగడ సాగించడం అనవసరమన్న నిర్ణయానికొచ్చారు. రానున్న రోజుల్లో ఈ రెండూ పార్టీలూ విలీనమవుతాయి.
నేపాల్ ఎన్నికల్లో వాస్తవానికి భారత్, చైనాలు పోరాడాయని... నేపాలీ కాంగ్రెస్ కూటమికి మన దేశం మద్దతిస్తే, వామపక్ష కూటమికి చైనా బాసటగా నిలిచిందని ప్రచారం సాగింది. కమ్యూనిస్టుల ప్రభుత్వం సహజంగానే చైనా వైపు మొగ్గుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని కాగలరని భావిస్తున్న కేపీ ఓలీ ఇంతక్రితం ప్రధానిగా ఉన్నప్పుడు ఇరు దేశాల సంబంధాలూ అంతంతమాత్రంగా ఉండటం నిజమే. అయితే భారత్–నేపాల్ సంబంధాలు ప్రత్యేకమైనవి. ఆ దేశ పౌరులు మన దేశానికి రాకపోకలు సాగిం చడం, ఇక్కడ వివిధ రంగాల్లో ఉపాధి పొందడంతోపాటు సైన్యంలో సైతం పనిచేస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. కారణాలు ఏమైనా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడుగానీ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలోగానీ తీసుకున్న కొన్ని చర్యల వల్ల మన దేశం పెద్దన్న పాత్ర వహిస్తున్నదన్న అభిప్రాయం ఆ దేశ ప్రజల్లో కలిగింది. ముఖ్యంగా రెండేళ్లక్రితం ఆ దేశం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నప్పుడు మన దేశం సూచించిన మార్పులకు ఆనాటి ప్రభుత్వం అంగీకరించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం నిత్యావసరాలు అందకుండా దిగ్బంధించామన్న భావన నేపాల్‌లో ఏర్పడింది. ఈ విషయంలో మన దౌత్యపరమైన లోపాలు కూడా ఉన్నాయి. మన ఇరుగుపొరుగుతో సన్నిహితం కావాలని చైనా ప్రయత్నిస్తున్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా మెలగాలి. ఆ దేశంతో మెరుగైన సంబంధాల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అటు నేపాల్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వం కూడా అంతిమంగా తన ప్రయోజనాలు ఎవ రితో ముడిపడి ఉన్నాయో లెక్కలేసుకుని ముందుకెళ్లక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment