నెలక్రితం నూతన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకుని లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా ఆవిర్భవించిన నేపాల్‌తో మన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయని అక్కడి పరిణామాలు సూచిస్తున్నాయి. రిపబ్లిక్ తొలి అధ్యక్షురాలిగా విద్యాదేవి భండారీ ఎన్నికైన బుధవారంనాడే చైనాతో నేపాల్ కుదుర్చుకున్న ఇంధన సరఫరా ఒప్పందం దీన్ని ధ్రువీకరిస్తోంది. దశాబ్దాలుగా నేపాల్ మన దేశంనుంచే ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. అందులో మనదే గుత్తాధిపత్యం.
చైనా-నేపాల్ మధ్య కుదిరిన తాజా ఒప్పందంతో అది కాస్తా బద్దలయింది. అందుకు నేపాల్‌ను నిందించి లాభంలేదు. ఆ దేశంతో సంబంధాలు ఎలా ఉండాలన్న అంశంపై మనలో స్పష్టత లోపించడంవల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఎన్నో ఆటుపోట్లనూ, అస్థిర పరిస్థితులనూ ఎదుర్కొన్న నేపాల్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఇంతలోనే మొన్న ఆగస్టులో రాజ్యాంగం ముసాయిదా వెల్లడయ్యాక మళ్లీ ఆ దేశానికి సమస్యలు తలెత్తాయి. రాజ్యాంగ రచనలో తమకు అన్యాయం జరిగిందని తెరై ప్రాంతంలోని తారూ, మాధేసి వంటి మైనారిటీ జాతులు ఆగ్రహించాయి. రహదార్లను దిగ్బంధించాయి. పర్యవసానంగా భారత్‌నుంచి వెళ్లాల్సిన నిత్యావసర సరుకులు, ఇంధన సరఫరా నిలిచిపోయి నేపాల్ విలవిల్లాడింది. అసంతృప్త వర్గాలు తమ గొంతు వినిపించడం, న్యాయం చేయాలని కోరడంలో వింతేమీ లేదు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని, అవసరమైన సవరణలు చేస్తామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు సంబంధించి వివిధ గ్రూపులతో ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఇదంతా నేపాల్ ఆంతరంగిక వ్యవహారం.
తారూ, మాధేసి జాతులు ఆందోళన చేస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగం ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయాలని, అందుకోసం అవసరమైతే దాని ఆమోదాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని మన దేశం నేపాల్‌కు సూచించింది. అయితే అదేమీ జరగలేదు. నేపాల్ తాను అనుకున్నట్టే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది మన దేశానికి కోపం తెప్పించింది. రాజ్యాంగాన్ని ఆమోదించాక ఇతర దేశాలన్నీ దాన్ని హర్షిస్తూ ప్రకటనలు విడుదల చేస్తే మన దేశం మాత్రం 'కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తించామం'టూ స్పందించింది. మన దేశ సరిహద్దుల్లో ఉన్న తెరై ప్రాంతంలోని జనాభాలో 70 శాతం తారూ, మాధేసిలే.
అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొంటే దాని ప్రభావం సహజంగా భారత్‌పై కూడా ఉంటుంది. కనుకనే వారి సమస్యలు తీరేలా మార్పులు చేయాలని సూచించామని మన ప్రభుత్వం చెప్పింది. అంతవరకూ బాగానే ఉందనుకున్నా ఆ విషయంలో ప్రతిష్టకు పోయి అలగడం ఎందుకో అర్ధంకాదు. తెరై ప్రాంతంలో జరిగే ఆందోళనలవల్ల మన దేశంనుంచి ఆ దేశానికి వెళ్లే సరుకు రవాణా స్తంభించిపోయింది. సరిహద్దుల్లో వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. ఇంధన ట్యాంకర్లు కూడా వాటిల్లో ఉన్నాయి. మీరు సమస్యను పరిష్కరించుకుంటే తప్ప మేం చేయగలిగేదేమీ లేదని మన దేశం చేతులెత్తేసింది. అయితే, నేపాల్ ప్రభుత్వమూ, ప్రజలూ దాన్ని వేరే రకంగా అర్ధం చేసుకున్నారు. రాజ్యాంగం విషయంలో తాము చెప్పినట్టు నడుచుకోలేదన్న ఆగ్రహంతో భారత్ కావాలనే ఇంధన సరఫరా రాకుండా అడ్డుకుంటున్నదని వారు భావించారు. ఇందుకు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్ ఢాకాల్ సెప్టెంబర్‌లో చేసిన ప్రకటనే సాక్ష్యం. ‘మా కొత్త రాజ్యాంగంతో భారత్ సంతోషంగా లేదు గనుకే ఈ వాణిజ్య దిగ్బంధానికి పూనుకున్నద’ని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా పదిరోజుల క్రితం భారత్ వచ్చారు.
ఆందోళనల ప్రభావం అంతగాలేని ప్రాంతాల వైపునుంచి ట్రక్కుల్ని పంపే ఏర్పాటు చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కి విన్నవించారు. అందుకు సంబంధించి భారత్‌నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని కూడా థాపా ప్రకటించారు. కానీ పరిస్థితి మారలేదు. భారత్‌నుంచి దిగుమతులు స్తంభించిపోవడంవల్ల నేపాల్ ఆర్థిక వ్యవస్థ లక్ష కోట్లు నష్టపోయిందని ఈ మధ్యే అక్కడి వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య ప్రకటించింది.
సరిగ్గా ఇలాంటి పరిస్థితుల కోసమే చైనా కాచుక్కూర్చుంది. భారత్‌పై నేపాల్‌లో అసంతృప్తి ఏర్పడితే సొమ్ము చేసుకోవాలని అది చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. నేపాల్‌లో రాచరిక వ్యవస్థ రద్దయి మావోయిస్టుల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ దేశం చైనాకు దగ్గరైంది. ఆ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగించాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా అడుగేయాల్సిన మన దేశం సక్రమంగా వ్యవహరించలేదు. యూపీఏ సర్కారు హయాంలో రెండేళ్లక్రితం భూటాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. కిరోసిన్, వంటగ్యాస్ ఎగుమతుల్లో ఇచ్చే సబ్సిడీలను హఠాత్తుగా నిలిపేయడంతో అక్కడ పెను సంక్షోభం ఏర్పడింది.
ఆ సమయంలో భూటాన్‌ను ఆదుకోవడానికి చైనా ముందుకొచ్చింది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక అలాంటి సమస్యలను చక్కదిద్దే పని చేపట్టారు. భూటాన్‌ను తన తొలి విదేశీ పర్యటనకు ఎంచుకోవడమేకాక నేపాల్‌ను రెండుసార్లు సందర్శించారు. అయినా మన దౌత్య వ్యవహారాలు గాడిన పడలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. చైనాతో 'దీర్ఘకాల వాణిజ్య బంధాని'కి అవసరమైన చర్చలు జరిపామని నేపాల్ చెబుతోంది. ఈ సహకారం త్వరలోనే ఇతర రంగాలకు కూడా విస్తరిస్తుందనడంలో సందేహం లేదు. అప్పుడు మన దేశంపై ఆధారపడే స్థితి దానికి తప్పుతుంది. నేపాల్ విషయంలో సరైన అంచనాలకు రావడంలో మనం విఫలమయ్యామని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అక్కడ రాచరికం పోయి చాన్నాళ్లయిందని మన దౌత్య వ్యవహర్తలు గుర్తించడం మంచిది.