ఖోఖో ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం | Kho Kho World Cup: India Defeat Nepal In Opening Clash | Sakshi
Sakshi News home page

ఖోఖో ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం

Jan 14 2025 1:26 PM | Updated on Jan 14 2025 3:05 PM

Kho Kho World Cup: India Defeat Nepal In Opening Clash

న్యూఢిల్లీ: తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం గ్రూప్‌ ‘ఎ’లో జరిగిన మొదటి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 42–37 స్కోరుతో నేపాల్‌పై విజయం సాధించింది. మొదటి క్వార్టర్‌లో భారత్‌ అటాకింగ్‌కు దిగి 24 పాయింట్లు సాధించింది. ఇందులో నేపాల్‌ ఒక్క పాయింట్‌ కూడా డిఫెన్స్‌లో రాబట్టుకోలేకపోయింది. రెండో క్వార్టర్‌లో భారత్‌ కూడా డిఫెన్స్‌లో ఖాతా తెరువలేదు. అటాకింగ్‌లో నేపాల్‌ 20 పాయింట్లు చేసింది.

అయితే భారత్‌ 4 పాయింట్లతో పైచేయితో మూడో క్వార్టర్‌ ప్రారంభించింది. ఇందులో మరో 18 పాయింట్లు స్కోరు చేయగా, నేపాల్‌ డిఫెన్స్‌ ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఆఖరి క్వార్టర్‌లో అటాకింగ్‌కు దిగిన నేపాల్‌ 16 పాయింట్లే చేయడంతో భారత్‌ విజయం ఖాయమైంది. మంగళవారం జరిగే రెండో లీగ్‌ పోరులో భారత్‌... బ్రెజిల్‌తో తలపడనుండగా, మహిళల గ్రూప్‌ ‘ఎ’లో ఆతిథ్య జట్టు తమ తొలి మ్యాచ్‌లో కొరియాతో పోటీపడనుంది.

పురుషుల విభాగంలో 20 జట్లు బరిలో వుండగా... గ్రూపులో ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్‌ దశ పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళల ఈవెంట్‌లో 19 జట్లు బరిలోకి దిగాయి. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌ సహా ఇరాన్, మలేసియా, కొరియా నాలుగు జట్లుండగా, మిగతా బి, సి, డి గ్రూపుల్లో ఐదు జట్ల చొప్పున లీగ్‌ దశలో పోటీపడుతున్నాయి. కిక్కిరిసిన స్టేడియం మొదటిసారిగా జరుగుతున్న ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానులతో ఇండోర్‌ స్టేడియం కిక్కిరిసిపోయింది.

అంతకుముందు అట్టహాసంగా జరిగిన ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం భారతీయ సంస్కృతిని ప్రతిబించించేలా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. సైకత రూపంలోని పుడమి తల్లి (భూమి) కళ ఆకట్టుకుంది. అనంతరం భారత జాతీయ పతాకం రెపరెపలాడుతూ జట్టు స్టేడియంలోకి రాగా అన్ని జట్లు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్‌ఐ) చీఫ్‌ సుధాన్షు మిట్టల్, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా, రాజ్యసభ సభ్యులు, బీసీసీఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తదితరులు పాల్గొన్నారు.    


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement