
రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా మార్చి 14న జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతీ ఇంటిలోనూ సన్నాహాలు మొదలయ్యాయి. రంగులను కొనుగోలు చేసి, వాటితో ఆటలాండేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సహజసిద్ధమైన రంగులనే వాడాలంటూ పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ రంగుల కేళి హోలీని కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
హోలీ పండుగ అందరూ కలసి చేసుకునే వేడుక. ఇది ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుంది. మనుషుల మధ్య ఉండే శతృత్వాలను కూడా హోలీ తరిమికొడుతుందని చెబుతుంటారు. పలు దేశాలలో స్థిరపడిన భారతీయులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటారు.

నేపాల్
హోలీ పండుగను మన పొరుగుదేశమైన నేపాల్‌లోనూ అత్యంత వేడుకగా జరుపుకుంటారు. దీనిని నేపాల్‌లో ఫాల్గుణ పూర్ణిమ అని అంటారు. కాఠ్మాండు తదితర నగరాల్లో హోలీ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జనం ఈ వేడుకల్లో పాల్గొని ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని, ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగిస్తారు.

యునైటెడ్ కింగ్‌డమ్
హోలీ పండుగ బ్రిటన్‌లోని భారతీయులు అంత్యంత వేడుకగా చేసుకునే ఉత్సవం. హోలీ వేడుకలు లండన్‌తో పాటు బర్మింగ్‌హామ్‌లో అంత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడి భారతీయులు హోలీ వేళ బాలీవుడ్ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటారు.

అమెరికా
అగ్రరాజ్యం అమెరికాలో హోలీ వేడుకలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో రంగుల ఉత్సవం జరుగుతుంది. భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
మారిషస్
మారిషస్‌లో భారతీయ మూలాలు కలిగినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతుంటాయి. మారిషస్‌లో హోలీ వేళ ఒకరిపై మరొకరు రంగులు జల్లుకోవడమే కాకుండా, ఆలయాలలో పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే సాంప్రదాయ వంటకాలను చేసుకుని ఆరగిస్తుంటారు.
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లోని హిందువులు హోలీ వేడుకలను అంత్యంత వైభవంగా చేసుకుంటారు. ఆలయాలకు వెళ్లి, భక్తిప్రపత్తులతో పూజలు చేస్తారు. సాయంత్రం వేళ ఆలయాలలో భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఆనందిస్తారు.
ఇది కూడా చదవండి: Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!!
Comments
Please login to add a commentAdd a comment