ఖోఖో ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత పురుషుల, మహిళల జట్లు
నేపాల్ జట్లతో అమీతుమీ నేడు
న్యూఢిల్లీ: మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌లో భారత జట్ల హవా కొనసాగుతోంది. గ్రామీణ క్రీడలో మన పురుషుల, మహిళల జట్ల గర్జన ఫైనల్స్‌కు చేర్చింది. శనివారం ఇక్కడి ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఆతిథ్య జట్ల జోరుకు దక్షిణాఫ్రికా జట్లు తోక ముడిచాయి.
భారత మహిళల బృందం 66–16 స్కోరు తేడాతో సఫారీ జట్టుపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. నిర్మలా భాటి, వైష్ణవి అదరగొట్టారు. తొలి క్వార్టర్‌లో చైత్ర 5 పాయింట్లతో చక్కని ఆరంభమిచ్చింది. నజియా బీబీ, నిర్మల అవుటైనప్పటికీ ఆమె జట్టుకు కీలక పాయింట్లు తెచ్చిపెట్టింది.
రెండో క్వార్టర్‌లో రేష్మ జోరుతో భారత్ స్కోరు శాసించే స్థితికి చేరింది. దీంతో 33–10తో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. మూడో క్వార్టర్‌లో వైష్ణవి పొవార్, నస్రీన్ షేక్, బిలార్‌దేవిల సమన్వయంతో పాయింట్లు కూడగట్టగా, ఆఖరి క్వార్టర్‌లో నస్రీన్ షేక్, రేష్మ రాథోడ్‌లు రాణించడంతో భారత్ భారీతేడాతో జయకేతనం ఎగరవేసింది. మరో సెమీస్‌లో నేపాల్ జట్టు 89–18తో ఉగాండాపై ఏకపక్ష విజయం నమోదు చేసింది.
అమ్మాయిల విభాగంలో చేతులెత్తేసిన సఫారీ జట్టు పురుషుల ఈవెంట్‌లో పోరాడింది. దీంతో భారత్ గెలిచేందుకు చెమటోడ్చింది. చివరకు భారత పురుషుల జట్టు 62–42 స్కోరు తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి ఫైనల్ చేరింది. ఆతిథ్య జట్టులో ప్రతీక్ వాయ్‌కర్, ఆదిత్య, నిఖిల్, గౌతమ్, రామ్‌జీ కశ్యప్, పబని సబర్, సుయశ్ రాణించారు. రెండో సెమీఫైనల్లో నేపాల్ 72–29తో ఇరాన్‌ను ఓడించి ఆతిథ్య జట్టుతో టైటిల్ సమరానికి సై అంటోంది. ఆదివారం జరిగే ఫైనల్స్‌తో ఈ ప్రపంచకప్‌కు తెరపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment