న్యూఢిల్లీ: భారత ఖోఖో మహిళల జట్టు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన కాసేపటికే.. భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన తుదిపోరులోభారత్ 54-36 తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత పురుషుల జట్టు.. అదే జోరును ఇక్కడ కూడా కొనసాగించింది. ప్రత్యర్థి నేపాల్ ను కట్టిపడేసిన భారత్.. విశ్వవిజేతగా అవతరించింది. మొట్టమొదటి ఖోఖో వరల్డ్‌కప్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు చాంపియన్స్‌గా నిలవడంవిశేషం.
ముందుగా జరిగిన మహిళల ఖోఖో వరల్డ్‌కప్ ఫైనల్లో ఖోఖో ప్రపంచకప్(Kho Kho World Cup 2025) విజేతగా భారత్ మహిళల జట్టు అవతరించింది.ఈ ప్రపంచకప్‌లో ఆద్యంతం చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఈరోజు(ఆదివారం) జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్(Nepal) జట్టును ఓడించింది. ఫలితంగా తొలి ఖోఖో ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది.
ఈ ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్.. ముందుగా భారత్ ను అటాక్ రమ్మని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్‌కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్‌కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత జట్టు. నేపాల్‌ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా నేపాల్‌కు అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది. కడవరకూ ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్‌ను మట్టికరిపించి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఇరు జట్లకు వైఎస్ జగన్ అభినందనలు
ఖోఖో వరల్డ్‌కప్-2025లో విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళల, పురుషుల జట్లకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని టోర్నీల్లో రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment