Kho Kho World Cup
-
ఖోఖో ప్రపంచకప్: సెమీస్‌లో భారత జట్లు
న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. దేశీయ క్రీడలో దుమ్మురేపుతున్న మన జట్లు క్వార్టర్స్‌లో అదే ఆధిపత్యం కనబర్చాయి. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో భారత్ 109–16 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. వరుసగా ఐదో మ్యాచ్‌లో 100 పాయింట్లకు పైగా స్కోరు చేసిన మన అమ్మాయిలు... ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కెప్టెన్ ప్రియాంక ఇంగ్లె, నస్రిన్ షేక్, ప్రియాంక, రేష్మ రాథోడ్ సత్తా చాటారు. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఉగాండా 71–26 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌పై, దక్షిణాఫ్రికా 51–46 పాయింట్ల తేడాతో కెన్యాపై, నేపాల్ 103–8 పాయింట్ల తేడాతో ఇరాన్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాయి. శనివారం జరగనున్న సెమీఫైనల్స్‌లో ఉగాండాతో నేపాల్, దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతాయి. పురుషుల క్వార్టర్ ఫైనల్లో భారత్ 100–40 పాయింట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. రామ్‌జీ కశ్యప్, ప్రతీక్, ఆదిత్య విజృంభించడంతో తొలి రౌండ్లోనే 58 పాయింట్లు సాధించిన భారత్... చివరి వరకు అదే జోరు కొనసాగించింది. రెండో రౌండ్లో తీవ్రంగా పోరాడిన శ్రీలంక ఓటమి అంతరాన్ని తగ్గించగలిగింది. ఇతర మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 58–38తో ఇంగ్లండ్‌పై, నేపాల్ 67–18తో బంగ్లాదేశ్‌పై, ఇరాన్ 86–18తో కెన్యాపై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. నేడు జరగనున్న సెమీఫైనల్స్‌లో ఇరాన్‌తో నేపాల్, దక్షిణాఫ్రికాతో భారత్ తలపడతాయి. -
ఖోఖో ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
న్యూఢిల్లీ: తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్‌లో భారత్ 42–37 స్కోరుతో నేపాల్‌పై విజయం సాధించింది. మొదటి క్వార్టర్లో భారత్ అటాకింగ్‌కు దిగి 24 పాయింట్లు సాధించింది. ఇందులో నేపాల్ ఒక్క పాయింట్ కూడా డిఫెన్స్‌లో రాబట్టుకోలేకపోయింది. రెండో క్వార్టర్లో భారత్ కూడా డిఫెన్స్‌లో ఖాతా తెరువలేదు. అటాకింగ్‌లో నేపాల్ 20 పాయింట్లు చేసింది.అయితే భారత్ 4 పాయింట్లతో పైచేయితో మూడో క్వార్టర్ ప్రారంభించింది. ఇందులో మరో 18 పాయింట్లు స్కోరు చేయగా, నేపాల్ డిఫెన్స్ ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఆఖరి క్వార్టర్లో అటాకింగ్‌కు దిగిన నేపాల్ 16 పాయింట్లే చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. మంగళవారం జరిగే రెండో లీగ్ పోరులో భారత్... బ్రెజిల్‌తో తలపడనుండగా, మహిళల గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య జట్టు తమ తొలి మ్యాచ్‌లో కొరియాతో పోటీపడనుంది.పురుషుల విభాగంలో 20 జట్లు బరిలో వుండగా... గ్రూపులో ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ దశ పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళల ఈవెంట్లో 19 జట్లు బరిలోకి దిగాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్ సహా ఇరాన్, మలేసియా, కొరియా నాలుగు జట్లుండగా, మిగతా బి, సి, డి గ్రూపుల్లో ఐదు జట్ల చొప్పున లీగ్ దశలో పోటీపడుతున్నాయి. కిక్కిరిసిన స్టేడియం మొదటిసారిగా జరుగుతున్న ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానులతో ఇండోర్ స్టేడియం కిక్కిరిసిపోయింది.అంతకుముందు అట్టహాసంగా జరిగిన ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం భారతీయ సంస్కృతిని ప్రతిబించించేలా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. సైకత రూపంలోని పుడమి తల్లి (భూమి) కళ ఆకట్టుకుంది. అనంతరం భారత జాతీయ పతాకం రెపరెపలాడుతూ జట్టు స్టేడియంలోకి రాగా అన్ని జట్లు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నాయి.ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) చీఫ్ సుధాన్షు మిట్టల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, రాజ్యసభ సభ్యులు, బీసీసీఐ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. -
భారత ఖోఖో సారథులు ప్రతీక్, ప్రియాంక
న్యూఢిల్లీ: గ్రామీణ క్రీడ ఖోఖోలో మొట్టమొదటి సారిగా జరగబోతున్న ప్రపంచకప్ మెగా ఈవెంట్‌కు భారత జట్లను ఎంపిక చేశారు. సందర్భంగా భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్, మెగా ఈవెంట్ సీఈఓ మేజర్ జనరల్ విక్రమ్ దేవ్ డోగ్రా టీమ్ జెర్సీలను ఆవిష్కరించారు. ఇందులో ఇండియా టీమ్ అని కాకుండా ‘భారత్ కి టీమ్’ అని ఉండటం విశేషం. జెర్సీపై భారత్ లోగోను ప్రముఖంగా హైలైట్ చేశారు. కేకేఎఫ్ఐ సెలక్టర్లు ఇరుజట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు ప్రతీక్ వాయ్‌కర్, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే సారథులుగా వ్యవహరిస్తారు. ప్రియాంక బృందానికి సుమిత్ భాటియా, ప్రతీక్ జట్టుకు అశ్వని కుమార్ హెడ్ కోచ్‌లుగా మార్గదర్శనం చేస్తారు. ఆంధ్ర ప్లేయర్ శివా రెడ్డికి చోటు ప్రపంచకప్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతిరెడ్డి శివా రెడ్డికి స్థానం లభించింది. ప్రకాశం జిల్లా ఈదర గ్రామానికి చెందిన 26 ఏళ్ల శివా రెడ్డి అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో ముంబై ఖిలాడీస్, గుజరాత్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు వేదికల్లో... ఖోఖో ప్రపంచకప్ మ్యాచ్‌లను ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో, గ్రేటర్ నోయిడా స్టేడియంలో ఈ నెల 13 నుంచి 19 వరకు నిర్వహిస్తారు. తొలిరోజు 13న పురుషుల జట్టు నేపాల్‌తో తలపడుతుంది. మరుసటి రోజు (14న) మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో కొరియాను ఢీకొంటుంది. 24 దేశాలకు చెందిన జట్లు ఈ తొలి ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాయి. 16వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, 19న జరిగే టైటిల్ పోటీలతో మెగా ఈవెంట్‌కు తెరపడుతుంది. భారత ఖోఖో జట్ల వివరాలు పురుషుల జట్టు: ప్రతీక్ (కెప్టెన్), పబని సబర్, మేహుల్, సచిన్ భార్గో, సుయశ్, రామ్‌జీ కశ్యప్, పోతిరెడ్డి శివా రెడ్డి, ఆదిత్య గాన్పులే, గౌతమ్, నిఖిల్, ఆకాశ్ కుమార్, సుబ్రమణి, సుమన్ బర్మన్, అనికేత్ పోటే, రాకేషన్ సింగ్. మహిళల జట్టు: ప్రియాంక ఇంగ్లే (కెప్టెన్), అశ్విని, రేష్మ రాథోడ్, బిలార్ దేవ్జీభాయ్, నిర్మలా, నీతా దేవి, చైత్ర, శుభశ్రీ సింగ్, మాంగయ్ మజీ, అన్షు కుమారి, వైష్ణవి, నస్రీన్, మీనూ, మోనిక, నజియా. -
నేపాల్‌తో భారత్ తొలి పోరు
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న తొలి ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 13 నుంచి 19 వరకు న్యూఢిల్లీ వేదికగా జరగునున్న వరల్డ్‌కప్ తొలి పోరులో సోమవారం నేపాల్‌తో భారత్ తలపడుతుంది. ఈ మేరకు అఖిల భారత ఖోఖో సమాఖ్య మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రపంచకప్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 39 జట్లు టోర్నీలో పాల్గొననున్నాయి.పురుషుల విభాగంలో 20 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. తొలి నాలుగు రోజులు లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా... ఈ నెల 17 నుంచి ప్లే ఆఫ్స్ దశ ప్రారంభం కానుంది. 19న తుదిపోరు నిర్వహించనున్నారు. గ్రూప్ ‘ఎ’లో నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్‌తో కలిసి భారత్ పోటీ పడుతోంది. మహిళల విభాగంలో 19 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. ఇరాన్, మలేసియా, దక్షిణ కొరియాతో కలిసి భారత మహిళల జట్టు గ్రూప్ ‘ఎ’ బరిలోకి దిగనుంది. మహిళల విభాగంలో ఈ నెల 14న దక్షిణ కొరియాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో ఒక్కో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లతో పాటు నాలుగు గ్రూప్‌ల్లో కలిపి మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. అందులో గెలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి. -
Kho Kho: ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన.. ఏడాదికి రూ. 5 కోట్లు
ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత హాకీ(Indian Hockey) జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర సర్కారు... ఇప్పుడు మరో దేశీయ క్రీడను కూడా ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది. వచ్చే మూడేళ్ల పాటు భారత జాతీయ ఖోఖో(Kho Kho) జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సోమవారం ప్రకటించారు. 2025 జనవరి నుంచి 2027 డిసెంబర్ మధ్య ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు వెల్లడించారు.మన సంస్కృతిని గుర్తుచేసుకోవడంతో పాటుఈ నెల 13 నుంచి 19 వరకు తొలి ఖోఖో వరల్డ్‌కప్‌నకు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ‘దేశీయ క్రీడలకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఖోఖోను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. ఇది మన సంస్కృతిని గుర్తుచేసుకోవడంతో పాటు అథ్లెట్లకు కొత్త అవకాశాలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది’ అని మోహన్ చరణ్ మాఝీఅన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ స్వాగతించారు.‘ఇటీవలి కాలంలో హాకీ క్రీడలో ఎలాంటి మార్పులు వచ్చాయో అందరం చూశాం. ఇప్పుడు ఖోఖో కూడా అలాగే దినదిన అభివృద్ధి సాధించడం ఖాయం. ఒడిశా ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. ఈ ప్రోత్సాహంతో భారత ఖోఖో లో నవశకం ఆరంభమైందనిపిస్తోంది. దీని వల్ల మెరుగైన మౌలిక వసతుల కల్పనతో పాటు... ఆటకు మరింత ఆదరణ దక్కేలా కృషి చేయవచ్చు’ అని మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘షూటౌట్’లో సూర్మా హాకీ క్లబ్ గెలుపు రూర్కెలా: హాకీ ఇండియా లీగ్ పురుషుల టోర్నమెంట్లో సూర్మా హాకీ క్లబ్ మరో విజయం అందుకుంది. ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ‘షూటౌట్’లో సూర్మా క్లబ్ 3–1తో గెలిచింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో సూర్మా జట్టు మూడు గోల్స్ చేయగా... ఢిల్లీ జట్టు ఒక్క గోల్ మాత్రమే సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌లో వేదాంత కళింగ లాన్సర్స్ జట్టుతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు తలపడుతుంది. సుమిత్ నగాల్‌కు నిరాశఆక్లాండ్ (న్యూజిలాండ్): కొత్త సీజన్లో భారత టెన్నిస్ సింగిల్స్ నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు టోర్నమెంట్లలో అతను మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. గతవారం కాన్బెర్రా ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో మొదటి రౌండ్లోనే నిష్క్రమించిన నగాల్... సోమవారం మొదలైన ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలోనూ తొలి రౌండ్లో ఓటమి చవిచూశాడు.ప్రపంచ 41వ ర్యాంకర్ అలెక్స్ మికిల్సన్ (అమెరికా)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 96వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 7–6 (10/8), 4–6, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లో ఓడిన నగాల్‌కు 7,295 డాలర్ల (రూ. 6 లక్షల 25 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. సుమిత్ నగాల్ తదుపరి ఈనెల 12 నుంచి మెల్బోర్న్లో మొదలయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగుతాడు. -
ఖోఖో ప్రపంచకప్ ట్రోఫీల ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచే పురుషులు, మహిళా జట్లకు అందజేసే ట్రోఫీలను శుక్రవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఫురుషుల విభాగంలో నీలి రంగు ట్రోఫీని బహూకరించనుండగా, మహిళలకు ఆకుపచ్చ రంగు ట్రోఫీని ప్రదానం చేస్తారు. ఈ మెగా ఈవెంట్లో కనువిందు చేసే మస్కట్లకు తార, తేజస్ అని పేర్లు పెట్టారు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ ట్రోఫీలను ఆవిష్కరించి, మస్కట్లను మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ నుంచి రెండేసి జట్ల చొప్పున బరిలోకి దిగుతాయన్నారు. భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ నాలుగు జట్లను ఈ నెల 8న ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఇరు విభాగాల్లో 60 మంది ప్లేయర్ల చొప్పున జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ తొలి ఖోఖో ప్రపంచకప్‌లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయని, ఇండోనేసియా కేవలం మహిళల జట్టునే పంపిస్తుండగా మిగతా 23 దేశాలు ఇరు జట్లను పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని సుధాన్షు వివరించారు. మొత్తం 615 మంది క్రీడాకారులు, 125 మంది సహాయ సిబ్బంది కోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థ జీఎంఆర్ బస, తదితర ఏర్పాట్లకు స్పాన్సర్íÙప్ చేస్తోందని చెప్పారు. అయితే పాకిస్తాన్ జట్లకు ఇంకా వీసాలు మంజూరు కాలేదని, త్వరలోనే ఇది కొలిక్కి వస్తుందని... పాక్ జట్లు కూడా షెడ్యూల్ ప్రకారం టోర్నీలో పాల్గొంటాయని మిట్టల్ వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు పోటీపడతాయి. 17 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. ఆ రోజు క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, 19న జరిగే ఇరు విభాగాల ఫైనల్స్‌తో ప్రపంచకప్ టోర్నీ ముగుస్తుంది. -
ఖో ఖో ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్
మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్ టోర్నీకి భారత్ వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ప్రచారం కల్పించే క్రమంలో ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) కీలక ముందడుగు వేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించినట్లు బుధవారం వెల్లడించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న క్రీడాకారుల జాతీయ శిక్షణ శిబిరంలో మీడియా సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేసింది. కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాంషు మిట్టల్, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ త్యాగితో పాటు భారత పురుషుల, మహిళా క్రీడాకారులు, కోచ్‌లు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఖో ఖో ప్రపంచ కప్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఆటతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. దేశ రాజధానిలో ప్రపంచ కప్ నిర్వహించడం ప్రశంసనీయమన్నాడు. ఖో ఖో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటం చూసి ఎంతో థ్రిల్ అవుతున్నానని చెప్పాడు.ఏదో ఒక దశలో ఖో ఖో ఆడిన వాళ్లమే"తొలి ఖో ఖో ప్రపంచ కప్– 2025తో భాగం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది భారత నేల, ఆత్మ, బలానికి ఇచ్చే నివాళి. నాతో పాటు మనమంతా జీవితంలో ఏదో ఒక దశలో ఖో ఖో ఆడిన వాళ్లమే’ అని సల్మాన్ ఖాన్ తన సందేశంలో పేర్కొన్నారు. ‘నాన్‌స్టాప్ యాక్షన్‌తో ఉత్కంఠభరితమైన క్రీడ అయిన ఖో ఖో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వేదికపై ఖో ఖో స్ఫూర్తిని చాటేందుకు ఏకం అవుదాం’ అని పిలుపునిచ్చారు.మన మట్టిలో పుట్టిన ఆట కోసంఇక కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ ఉనికి ప్రపంచ కప్ వీక్షకుల సంఖ్యను పెంచుతుందని నమ్ముతున్నారు. "సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన బిజీ షెడ్యూల్లో కూడా మన మట్టిలో పుట్టిన ఆట కోసం సమయం ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.క్రీడ పట్ల ఆయన అభిరుచి నిజంగా స్ఫూర్తిదాయకం. రాబోయే ప్రపంచ కప్‌నకు సల్మాన్ యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తాడని మేము విశ్వసిస్తున్నాము. ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌ను విజయవంతం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాము’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో జనవరి 13–19 మధ్య ఖో ఖో ప్రపంచకప్ జరుగనుంది. వారం రోజుల పాటు జరిగే ఖో ఖో ప్రపంచ కప్‌లో టోర్నమెంట్లో 21 పురుషుల, 20 మహిళల జట్లు పోటీపడతాయి. మొత్తం 24 దేశాల జట్లు టోర్నమెంట్ కోసం భారత్‌కు వస్తున్నాయి.కాగా, జాతీయ శిక్షణ శిబిరంలో ప్రతీక్ వైకర్, ఆదిత్య గన్‌పూలే, రామ్‌జీ కశ్యప్, దిలీప్ ఖాండ్వీ, సుయాష్ గార్గేట్, గౌతమ్ ఎంకే సచిన్ భార్ఘవ, విశాల్, అరుణ్ గుంకీ, ప్రియాంక ఇంగ్లే, మాగై మజ్హి, మీన్ ముస్కనన్, . చేత్రా బి, నస్రీన్, రేష్మా రాథోడ్, నిర్మలా పాండే వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన పురుషుల, మహిళల జట్లకు డెమో మ్యాచ్‌ను నిర్వహించారు.భారత ఒలింపిక్ సంఘం మద్దతుప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖో ఖో అభిమానులకు ఈ ఆటలోని థ్రిల్లింగ్ అనుభవాన్ని ఈ టోర్నమెంట్ అందించనుంది. కేకేఎఫ్ఐ కూడా ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలను అందించడంపై దృష్టి సారిస్తోంది. అందుకే, పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన వేదికను ఏర్పాటు చేసింది. మరోవైపు.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఖో ఖో ప్రపంచ కప్‌నకు మద్దతు ఇస్తోంది. ఇందుకోసం ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.