ఖో ఖో ప్రపంచకప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సల్మాన్‌ ఖాన్‌ | Kho Kho World Cup 2025 Salman Named Khan Brand Ambassador | Sakshi
Sakshi News home page

ఖో ఖో ప్రపంచకప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సల్మాన్‌ ఖాన్‌

Published Wed, Dec 18 2024 7:10 PM | Last Updated on Wed, Dec 18 2024 7:30 PM

Kho Kho World Cup 2025 Salman Named Khan Brand Ambassador

మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ప్రచారం కల్పించే క్రమంలో ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) కీలక ముందడుగు వేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించినట్లు బుధవారం వెల్లడించింది. 

జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న క్రీడాకారుల జాతీయ శిక్షణ శిబిరంలో మీడియా సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేసింది. కేకేఎఫ్‌ఐ అధ్యక్షుడు సుధాంషు మిట్టల్, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ త్యాగితో పాటు భారత పురుషుల, మహిళా క్రీడాకారులు, కోచ్‌లు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖో ఖో ప్రపంచ కప్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సల్మాన్‌ ఖాన్‌ తెలిపాడు. ఆటతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. దేశ రాజధానిలో  ప్రపంచ కప్‌ నిర్వహించడం ప్రశంసనీయమన్నాడు. ఖో ఖో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటం చూసి ఎంతో థ్రిల్ అవుతున్నానని చెప్పాడు.

ఏదో ఒక దశలో  ఖో ఖో ఆడిన వాళ్లమే
"తొలి  ఖో ఖో ప్రపంచ కప్– 2025తో భాగం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది భారత నేల, ఆత్మ, బలానికి ఇచ్చే నివాళి. నాతో పాటు మనమంతా జీవితంలో ఏదో ఒక దశలో  ఖో ఖో ఆడిన వాళ్లమే’ అని సల్మాన్‌ ఖాన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. 

‘నాన్‌స్టాప్ యాక్షన్‌తో ఉత్కంఠభరితమైన క్రీడ అయిన ఖో ఖో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వేదికపై ఖో ఖో స్ఫూర్తిని చాటేందుకు ఏకం అవుదాం’ అని పిలుపునిచ్చారు.

మన మట్టిలో పుట్టిన ఆట కోసం
ఇక కేకేఎఫ్‌ఐ అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ సల్మాన్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్‌  ఉనికి ప్రపంచ కప్ వీక్షకుల సంఖ్యను పెంచుతుందని నమ్ముతున్నారు. "సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన బిజీ షెడ్యూల్‌లో కూడా  మన మట్టిలో పుట్టిన ఆట కోసం సమయం ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

క్రీడ పట్ల ఆయన  అభిరుచి నిజంగా స్ఫూర్తిదాయకం.  రాబోయే ప్రపంచ కప్‌నకు సల్మాన్ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తాడని మేము విశ్వసిస్తున్నాము.  ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌ను విజయవంతం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాము’’ అని పేర్కొన్నారు.  

కాగా ఢిల్లీలో జనవరి 13–19 మధ్య ఖో ఖో ప్రపంచకప్‌ జరుగనుంది. వారం రోజుల పాటు జరిగే  ఖో ఖో ప్రపంచ కప్‌లో టోర్నమెంట్‌లో 21 పురుషుల, 20 మహిళల జట్లు పోటీపడతాయి.  మొత్తం 24 దేశాల జట్లు టోర్నమెంట్ కోసం భారత్‌కు వస్తున్నాయి.

కాగా, జాతీయ శిక్షణ శిబిరంలో  ప్రతీక్ వైకర్, ఆదిత్య గన్‌పూలే, రామ్‌జీ కశ్యప్, దిలీప్ ఖాండ్వీ, సుయాష్ గార్గేట్, గౌతమ్ ఎంకే సచిన్ భార్ఘవ, విశాల్, అరుణ్ గుంకీ, ప్రియాంక ఇంగ్లే, మాగై మజ్హి, మీన్ ముస్కనన్, . చేత్రా బి, నస్రీన్, రేష్మా రాథోడ్, నిర్మలా పాండే వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన పురుషుల, మహిళల జట్లకు డెమో మ్యాచ్‌ను నిర్వహించారు.

భారత ఒలింపిక్ సంఘం మద్దతు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ఖో ఖో అభిమానులకు ఈ ఆటలోని థ్రిల్లింగ్ అనుభవాన్ని ఈ టోర్నమెంట్ అందించనుంది.  కేకేఎఫ్‌ఐ కూడా ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలను అందించడంపై దృష్టి సారిస్తోంది. అందుకే, పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన వేదికను ఏర్పాటు చేసింది. 

మరోవైపు.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)  ఖో ఖో ప్రపంచ కప్‌నకు మద్దతు ఇస్తోంది. ఇందుకోసం ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement