ప్రపంచకప్‌కు జట్ల ఎంపిక
13 నుంచి ఖోఖో మెగా ఈవెంట్
న్యూఢిల్లీ: గ్రామీణ క్రీడ ఖోఖోలో మొట్టమొదటి సారిగా జరగబోతున్న ప్రపంచకప్ మెగా ఈవెంట్‌కు భారత జట్లను ఎంపిక చేశారు. సందర్భంగా భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్‌ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్, మెగా ఈవెంట్ సీఈఓ మేజర్ జనరల్ విక్రమ్ దేవ్ డోగ్రా టీమ్ జెర్సీలను ఆవిష్కరించారు. ఇందులో ఇండియా టీమ్ అని కాకుండా ‘భారత్ కి టీమ్’ అని ఉండటం విశేషం.
జెర్సీపై భారత్ లోగోను ప్రముఖంగా హైలైట్ చేశారు. కేకేఎఫ్‌ఐ సెలక్టర్లు ఇరుజట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు ప్రతీక్ వాయ్‌కర్, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే సారథులుగా వ్యవహరిస్తారు. ప్రియాంక బృందానికి సుమిత్ భాటియా, ప్రతీక్ జట్టుకు అశ్వని కుమార్ హెడ్ కోచ్‌లుగా మార్గదర్శనం చేస్తారు.
ఆంధ్ర ప్లేయర్ శివా రెడ్డికి చోటు
ప్రపంచకప్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతిరెడ్డి శివా రెడ్డికి స్థానం లభించింది. ప్రకాశం జిల్లా ఈదర గ్రామానికి చెందిన 26 ఏళ్ల శివా రెడ్డి అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో ముంబై ఖిలాడీస్, గుజరాత్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
రెండు వేదికల్లో...
ఖోఖో ప్రపంచకప్ మ్యాచ్‌లను ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో, గ్రేటర్ నోయిడా స్టేడియంలో ఈ నెల 13 నుంచి 19 వరకు నిర్వహిస్తారు. తొలిరోజు 13న పురుషుల జట్టు నేపాల్‌తో తలపడుతుంది.
మరుసటి రోజు (14న) మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో కొరియాను ఢీకొంటుంది. 24 దేశాలకు చెందిన జట్లు ఈ తొలి ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాయి. 16వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, 19న జరిగే టైటిల్ పోటీలతో మెగా ఈవెంట్‌కు తెరపడుతుంది.
భారత ఖోఖో జట్ల వివరాలు
పురుషుల జట్టు: ప్రతీక్ (కెప్టెన్), పబని సబర్, మేహుల్, సచిన్ భార్గో, సుయశ్, రామ్‌జీ కశ్యప్, పోతిరెడ్డి శివా రెడ్డి, ఆదిత్య గాన్పులే, గౌతమ్, నిఖిల్, ఆకాశ్ కుమార్, సుబ్రమణి, సుమన్ బర్మన్, అనికేత్ పోటే, రాకేషన్ సింగ్.
మహిళల జట్టు: ప్రియాంక ఇంగ్లే (కెప్టెన్), అశ్విని, రేష్మ రాథోడ్, బిలార్ దేవ్‌జీభాయ్, నిర్మలా, నీతా దేవి, చైత్ర, శుభశ్రీ సింగ్, మాంగయ్ మజీ, అన్షు కుమారి, వైష్ణవి, నస్రీన్, మీనూ, మోనిక, నజియా.
Comments
Please login to add a commentAdd a comment