మస్కట్లుగా తార, తేజస్
13 నుంచి తొలి ఖోఖో మెగా ఈవెంట్
19న టైటిల్ పోరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచే పురుషులు, మహిళా జట్లకు అందజేసే ట్రోఫీలను శుక్రవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఫురుషుల విభాగంలో నీలి రంగు ట్రోఫీని బహూకరించనుండగా, మహిళలకు ఆకుపచ్చ రంగు ట్రోఫీని ప్రదానం చేస్తారు. ఈ మెగా ఈవెంట్‌లో కనువిందు చేసే మస్కట్లకు తార, తేజస్ అని పేర్లు పెట్టారు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్‌ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ ట్రోఫీలను ఆవిష్కరించి, మస్కట్‌లను మీడియాకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ నుంచి రెండేసి జట్ల చొప్పున బరిలోకి దిగుతాయన్నారు. భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ నాలుగు జట్లను ఈ నెల 8న ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఇరు విభాగాల్లో 60 మంది ప్లేయర్ల చొప్పున జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ తొలి ఖోఖో ప్రపంచకప్‌లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయని, ఇండోనేసియా కేవలం మహిళల జట్టునే పంపిస్తుండగా మిగతా 23 దేశాలు ఇరు జట్లను పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని సుధాన్షు వివరించారు.
మొత్తం 615 మంది క్రీడాకారులు, 125 మంది సహాయ సిబ్బంది కోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థ జీఎంఆర్ బస, తదితర ఏర్పాట్లకు స్పాన్సర్íÙప్ చేస్తోందని చెప్పారు. అయితే పాకిస్తాన్ జట్లకు ఇంకా వీసాలు మంజూరు కాలేదని, త్వరలోనే ఇది కొలిక్కి వస్తుందని... పాక్ జట్లు కూడా షెడ్యూల్ ప్రకారం టోర్నీలో పాల్గొంటాయని మిట్టల్ వెల్లడించారు.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు పోటీపడతాయి. 17 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. ఆ రోజు క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, 19న జరిగే ఇరు విభాగాల ఫైనల్స్‌తో ప్రపంచకప్ టోర్నీ ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment