ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత హాకీ(Indian Hockey) జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర సర్కారు... ఇప్పుడు మరో దేశీయ క్రీడను కూడా ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది.
వచ్చే మూడేళ్ల పాటు భారత జాతీయ ఖోఖో(Kho Kho) జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సోమవారం ప్రకటించారు. 2025 జనవరి నుంచి 2027 డిసెంబర్ మధ్య ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు వెల్లడించారు.
మన సంస్కృతిని గుర్తుచేసుకోవడంతో పాటు
ఈ నెల 13 నుంచి 19 వరకు తొలి ఖోఖో వరల్డ్‌కప్‌నకు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ‘దేశీయ క్రీడలకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఖోఖోను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. ఇది మన సంస్కృతిని గుర్తుచేసుకోవడంతో పాటు అథ్లెట్లకు కొత్త అవకాశాలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది’ అని మోహన్ చరణ్ మాఝీఅన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ స్వాగతించారు.
‘ఇటీవలి కాలంలో హాకీ క్రీడలో ఎలాంటి మార్పులు వచ్చాయో అందరం చూశాం. ఇప్పుడు ఖోఖో కూడా అలాగే దినదిన అభివృద్ధి సాధించడం ఖాయం. ఒడిశా ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. ఈ ప్రోత్సాహంతో భారత ఖోఖో లో నవశకం ఆరంభమైందనిపిస్తోంది. దీని వల్ల మెరుగైన మౌలిక వసతుల కల్పనతో పాటు... ఆటకు మరింత ఆదరణ దక్కేలా కృషి చేయవచ్చు’ అని మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘షూటౌట్’లో సూర్మా హాకీ క్లబ్ గెలుపు
రూర్కెలా: హాకీ ఇండియా లీగ్ పురుషుల టోర్నమెంట్‌లో సూర్మా హాకీ క్లబ్ మరో విజయం అందుకుంది. ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ‘షూటౌట్’లో సూర్మా క్లబ్ 3–1తో గెలిచింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు.
‘షూటౌట్’లో సూర్మా జట్టు మూడు గోల్స్ చేయగా... ఢిల్లీ జట్టు ఒక్క గోల్ మాత్రమే సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌లో వేదాంత కళింగ లాన్సర్స్ జట్టుతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు తలపడుతుంది.
సుమిత్ నగాల్‌కు నిరాశ
ఆక్లాండ్ (న్యూజిలాండ్): కొత్త సీజన్‌లో భారత టెన్నిస్ సింగిల్స్ నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు టోర్నమెంట్‌లలో అతను మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. గతవారం కాన్‌బెర్రా ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన నగాల్... సోమవారం మొదలైన ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలోనూ తొలి రౌండ్‌లో ఓటమి చవిచూశాడు.
ప్రపంచ 41వ ర్యాంకర్ అలెక్స్ మికిల్సన్ (అమెరికా)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 96వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 7–6 (10/8), 4–6, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.
తొలి రౌండ్‌లో ఓడిన నగాల్‌కు 7,295 డాలర్ల (రూ. 6 లక్షల 25 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. సుమిత్ నగాల్ తదుపరి ఈనెల 12 నుంచి మెల్‌బోర్న్‌లో మొదలయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగుతాడు.
Comments
Please login to add a commentAdd a comment