నాసిరకం సర్కారీ విద్య!
ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మాధ్య మంలో బోధన ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచి స్తున్న తరుణంలో ప్రాథమిక విద్యారంగం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉన్నదని తాజాగా విడుదలైన నివేదిక వెల్లడిస్తున్నది. ఏటా మన విద్యారంగం స్థితిగతులపై వార్షిక నివేదికలను వెలువరించే స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్’ విద్యా ట్రస్ట్ నిరుడు దేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల దుస్థితి ఎలా ఉన్నదో కళ్లకు కట్టింది.
విద్యా హక్కు చట్టం తెచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా మారిందేమీ లేదని తేలడం అంటే మన ప్రభుత్వాలు విద్యారంగాన్ని గాలి కొదిలేశాయని అర్ధం. దేశంలోని 589 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనం చేసి ఆ సంస్థ తాజా నివేదికను వెలువరించింది. అయిదో తరగతి చదివే విద్యార్థులు రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారని, ఆ తరగతిలో ఉండే లెక్కలు చేయలేకపోతున్నారని నివేదిక అంటోంది.
ఎనిమిదో తరగతి పిల్లలకు భాగాహా రాలు, తీసివేతలు వంటివి చేతగావటం లేదు. 2014 నాటితో పోలిస్తే పిల్లల విద్యా స్థాయి మరింత తగ్గిందన్నది నివేదిక సారాంశం. నివేదిక విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ఒక మంచి మాట అన్నారు. అభివృద్ధి అంటే కేవలం ఎక్స్‌ప్రెస్ రహదారుల నిర్మాణం మాత్రమే కాదని... లక్షలాదిమంది విద్యార్థుల్ని విద్యావంతుల్ని చేయడ మని ఆయన చెప్పారు. ఈ ఎరుకతో ప్రభుత్వాలు వ్యవహరిస్తే, అందుకు అనుగుణ మైన ప్రణాళికలు రచిస్తే విద్యారంగం బాగుంటుందనడంలో సందేహం లేదు. కానీ దానికి అడ్డొచ్చేదెవరు? పాఠశాలల్లో మరుగుదొడ్లు మొదలుకొని టీచర్ల నియామకం వరకూ దేన్నీ పట్టించుకోకుండా వారి దృష్టిని మరల్చేదెవరు? సమాధానం చెప్పా ల్సింది పాలకులే.
కేంద్ర ప్రభుత్వం విద్య, సామాజికాభివృద్ధి అంశాలపై నియమించిన కార్యద ర్శుల స్థాయి బృందం ఈమధ్యే ఒక నివేదిక ఇచ్చింది. దేశంలోని 6,612 రెవెన్యూ డివిజన్‌లలో ప్రతి ఒక్క చోట కనీసం ఒక ఇంగ్లిష్ మాధ్యమం ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించడంతోపాటు అన్ని పాఠశాలల్లోనూ ఆరో తరగతి నుంచి ఇంగ్లిష్‌ను తప్పనిసరి పాఠ్యాంశంగా బోధించాలని సూచించింది. మాతృభాషలకు ప్రాధాన్య తను తగ్గించకుండా ఇంగ్లిష్‌ను తప్పనిసరి పాఠ్యాంశం చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాగే మాతృభాషకు సంబంధించిన పాఠ్యాంశాన్ని కొనసాగిస్తూ ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించే పాఠశాలలను ఏర్పాటుచేసినా ఎవరూ కాదనరు. కానీ ఈ పని చేయడానికి ముందు ఎలాంటి కసరత్తులు జరగాలి? ప్రాథమిక విద్యారంగాన్ని ఎంతగా ప్రక్షాళన చేయాలి?
తాజా అసర్ నివేదిక గమనిస్తే ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత నీయడం గురించి కేంద్ర బృందం కంటున్న కలలు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతాయి. ఇప్పుడు ప్రాథమిక విద్యా రంగం ఎదుర్కొంటున్న క్లేశాలను తీర్చకుండా ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియం పాఠ శాలలను ప్రారంభించడం వల్ల పసి మనసులను మరింత కష్టపెట్టడం తప్ప ప్రయో జనం ఉండదు. ఇంగ్లిష్ దానికదే సర్వరోగ నివారిణి కాదు. మాతృభాషలో ఉన్న రెండో తరగతి పుస్తకాన్నే అయిదో తరగతి పిల్లలు చదవలేని స్థితి ఉన్నప్పుడు వారికి ఆరో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టి ఉపయోగమేమిటి?
భవిష్యత్తులో పిల్లలు వివిధ పాఠ్యాంశాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రాథమిక విద్యారంగం పునాది. అక్కడ నాణ్యత గల విద్యను అందించగలిగితే తర్వాత కాలంలో వారు మెరికల్లా తయారవుతారు. దేన్నయినా అభ్యసించగల నేర్పు సాధిస్తారు. నాటి యూపీఏ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకు రావ డంలోని ఉద్దేశం ఇదే. చట్టం అమలు మొదలయ్యాక లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి విద్యారంగాన్ని సమూలంగా చక్కదిద్దుతామని, ప్రపంచశ్రేణి విద్యకు దీటైన రీతిలో దాన్ని రూపొందిస్తామని నాటి మానవ వనరుల మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. కానీ అదంతా మాటలకే పరిమితమని చాలా త్వరగానే రుజువైంది. ప్రతి పాఠశాలలోనూ చాలినంతమంది ఉపాధ్యాయులుండాలని, వారి ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని ప్రభుత్వాలు అనుకోవడం లేదు. ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలలు కనిపిస్తున్నాయి. అందువల్లే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివిస్తే భవిష్యత్తు ఉండదని తల్లిదండ్రుల్లో ఎక్కువమంది భావిస్తున్నారు. ఆర్ధిక స్థోమత లేనివారు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని అక్కడకు పంపుతున్నారు.
పాఠ్యాంశాల్లో ఉండే అంశాలు, బోధనా మాధ్యమం తీరుతెన్నుల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తుంటే పిల్లల్లో నేర్చుకోవడానికి సంబంధించిన నైపుణ్యమే కొరవడుతున్నదని అసర్ నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఇందుకు ప్రధానమైన కారణాలు రెండు–ఒకటి బోధించేవారు లేకపోవడం, ఉన్నా వారికి బోధనా నైపుణ్యం కొరవడటం. ఇలాంటి స్థితిలో ఏడాది తిరిగేసరికల్లా పిల్లలు పై తరగతు లకు వెళ్తున్నారుగానీ అందుకవసరమైన యోగ్యత వారికి ఉండటం లేదు. మన దేశంలో 70 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తోంది. వారిలో అత్యధికులు అట్టడుగు కులాలవారు, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు.
ప్రాథమిక, ప్రాథ మికోన్నత విద్యా రంగాలను పాలకులు విస్మరించడం వల్ల ఈ వర్గాలకు చెందిన పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టణాల్లో, నగరాల్లో డబ్బు వెచ్చించి చదువు కుంటున్న పిల్లలతో వీరు ఎక్కడా పోటీ పడలేకపోతున్నారు. మధ్యలోనే చదువులు చాలిస్తున్నారు. చదువు కొనసాగిస్తున్నవారు కూడా మెరుగైన, ఉన్నతమైన అవకా శాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఫలితంగా తరాలు గడుస్తున్నా దారిద్య్రం వారిని విడనాడటం లేదు. విద్యారంగంపై మనం పెడుతున్న వ్యయం అనేక ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎంతో తక్కువ. జాతికి జీవనాడి అయిన విద్యారంగాన్ని పట్టించుకోకపోతే అది దేశ భవిష్యత్తునే అంధకారంలోకి నెడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని ఈ ప్రమాదాన్ని నివారించాలి. విద్యారంగంపై నిర్లక్ష్యాన్ని విడనాడాలి.