నోట్లరద్దుకు కారణాలేంటి?
♦ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు పీఏసీ సమన్లు
♦ 20న హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని విచారిస్తున్న పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ).. నోట్లరద్దు, తదనంతర పరిణామాలపై వివరణ ఇవ్వాలంటూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు నోటీసులు పంపించింది. డిసెంబర్ 30న జారీచేసిన ఈ నోటీసుల్లో.. నోట్లరద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్ర, ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం, రెండు నెలల్లో ఆర్బీఐ నిబంధనల్లో భారీగా తీసుకొచ్చిన మార్పులు వంటి ప్రశ్నలను సంధించింది. విత్‌డ్రాయల్ పరిమితిపై ఆంక్షలు విధించే విషయంలో సరైన ఆధారాలు చూపించని పక్షంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న కారణాలతో ఎందుకు విధులనుంచి తొలగించరాదో చెప్పాలంది.
నోట్లరద్దుతో ఎంత మొత్తంలో నల్లధనం బయటకు వచ్చింది? ఎంత మొత్తం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెళ్లిందో వివరాలివ్వాలని ఆదేశించింది. నోటీసుల్లో పేర్కొన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు జనవరి 20న కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించినట్లు పీఏసీ చైర్మన్ కేవీ థామస్ ఓ వార్తా సంస్థతో వెల్లడించారు. ‘ఆర్బీఐ గవర్నర్‌కు డిసెంబర్‌లోనే సమన్లు ఇవ్వాలనుకున్నాం. కానీ నోట్లరద్దుపై ప్రధాని 50 రోజుల సమయం ఇచ్చిన నేపథ్యంలో దీన్ని జనవరికి వాయిదా వేయాలనుకున్నాం.
ఈ వివాదానికి రాజకీయ రంగు పులమాలనుకోవటం లేదు’ అని థామస్ తెలి పారు. పటేల్‌తోపాటు ఆర్థిక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులకూ నోటీసులు జారీ చేసింది. గత శుక్రవారం రాజ్యసభ స్టాండింగ్ కమిటీ కూడా పటేల్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్, ఆర్.గాంధీలనూ నోట్లరద్దుపైనే ప్రశ్నించింది. అయితే కమిటీ వేసిన పలు ప్రశ్నలకు ఆర్బీఐ అధికారుల వద్దనుంచి సరైన సమాధానం రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఉర్జిత్‌కు పీఏసీ సంధించిన ప్రశ్నలు
► నోట్లరద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ, ఆర్బీఐ బోర్డు తీసుకున్నాయని.. దీనికి ప్రభుత్వం ఆమోదం మాత్రమే తెలిపిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో తెలిపారు. దీంతో మీరు ఏకీభవిస్తారా?
► ఒకవేళ ఇది ఆర్బీఐ ఆలోచనే అయితే.. ఎప్పుడు నోట్లరద్దుపై చర్చించి నిర్ణయం తీసుకుంది?
► రాత్రికి రాత్రి నోట్లరద్దు చేయాలనే నిర్ణయం వెనక ఆర్బీఐ చూపించే అసలైన కారణమేంటి?
► భారత జీడీపీలో నగదు 12 శాతం (జపాన్ 18, స్విట్జర్లాండ్ 13). భారత కరెన్సీలో పెద్ద నోట్లు 86 శాతం ఉంటే.. చైనాలో 90 శాతం, అమెరికాలో 81 శాతం. ఇలాంటప్పుడు భారత్‌లోనే అత్యవసరంగా నోట్లరద్దు నిర్ణయం తీసుకోవటం వెనక ఉన్న కారణాలేంటి?
► నవంబర్ 8న అత్యవసర సమావేశం కోసం ఆర్బీఐ బోర్డు సభ్యులకు ఎప్పుడు నోటీసులు పంపారు? వీరిలో ఎందరు సమావేశానికి హాజరయ్యారు? మీటింగ్ మినిట్స్ (చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు) ఎక్కడున్నాయి?
► కేబినెట్ ఆమోదం కోసం పంపిన లేఖలో.. నోట్లరద్దు వల్ల 86% కరెన్సీ చెల్లకుండా పోవటం, దీని మొత్తం విలువ వంటివి ప్రత్యేకంగా పేర్కొన్నారా? రద్దయిన నోట్ల మొత్తం విలువను చలామణిలోకి తెచ్చేందుకు ఎంత సమయం పడుతుంది?
► ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 3 సీ(వీ) ప్రకారం.. విత్‌డ్రా పరిమితిపై ఆంక్షలు విధిస్తున్నట్లు నవంబర్ 8న ప్రకటన ఇచ్చారు. ఆర్బీఐలోని ఏ చట్టం ప్రకారం ప్రజలపై విత్‌డ్రా పరిమితి విధించారు? ఆర్బీఐకి ఈ అధికారం ఉందా? అలాంటి చట్టాలేమీ లేకపోతే.. అధికార దుర్వినియోగం చేసినందుకు మిమ్మల్ని ఎందుకు ఉద్యోగంలోనుంచి తొలగించరాదు?
► రెండు నెలలుగా ఆర్బీఐ నియమాల్లో ఎందుకు త్వరత్వరగా మార్పులు జరిగాయి? ప్రజల విత్‌డ్రాయల్ నియంత్రణపై సలహా ఇచ్చిన అధికారి పేరును తెలపండి. వివాహ సంబంధిత విత్‌డ్రాయల్స్ నిబంధనలను రాసిందెవరు? ఒకవేళ ఆర్బీఐ కాకుండా ప్రభుత్వమే దీన్ని రాసిస్తే.. మరి ఆర్బీఐ ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగంగా మారిందనుకోవాలా?
► రద్దయిన నోట్ల అసలైన లెక్క ఎంత? బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాతనోట్ల విలువెంత? నవంబర్ 8న ప్రభుత్వానికి నోట్లరద్దు నిర్ణయంపై సూచన చేసినపుడు.. ఎంత మొత్తంలో నోట్లను రద్దుచేయొచ్చని ఆర్బీఐ భావించింది?
► నోట్లరద్దుపై వివరాలు చెప్పాలంటూ దాఖలైన ఆర్టీఐ ఫిర్యాదులకు సమాధానం ఇచ్చేందుకు ఆర్బీఐ ఎందుకు విముఖత వ్యక్తం చేసింది?