సోనియా అల్లుడికి ఆగ్రహం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా అమలు చేసిన కార్యక్రమం పెద్ద నోట్ల రద్దు అని అన్నారు. ప్రణాళికలు చేసుకున్నట్లు ప్రభుత్వం వద్ద కానీ, ఆర్‌బీఐ వద్దగానీ ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. పెద్ద నోట్లను రద్ద చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న దాదాపు నెల రోజుల తర్వాత వాద్రా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా డిపాజిట్ దారులు ఐదు వేల కంటే మొత్తాన్ని ఏకకాలంలో చేయాలని, అది కూడా సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే డిపాజిట్లు చేసేందుకు అనుమతి ఉంటుందని తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకునన్న నేపథ్యంలో రాబర్ట్ వాద్రా తన ఫేస్ బుక్ పేజీలో స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతోపాటు తన అభిప్రాయాన్ని కూడా ఒక ఫొటో ప్రేమ్‌లాగా తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి తన అభిప్రాయాలు వెల్లడించారు. కేంద్రం ప్రజలపైనా ప్రయోగాలు చేస్తుందని, ఇంకెంతకాలం, ఇంకెంత ప్రయోగం చేస్తారని ప్రశ్నించారు.
ఒకేసారి రూ.5000 కంటే ఎక్కువమొత్తాన్ని జమ చేయాలనే నిర్ణయంతో కేంద్ర ఆర్థిక సంస్థ ఇక విచారణ సంస్థగా మారినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్నపిచ్చి చర్యల కారణంగా అమాయకులైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదంతా చూస్తుంటే చాలా బాధేస్తుందని అన్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు చూసి తాను ఎంతో బాధపడుతున్నానని తెలిపారు.