2017 మే వరకు తిప్పలు తప్పవా?
నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ఇబ్బందులను చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరిన యాభై రోజుల గడువుకు ఇక 15 రోజుల సమయమే మిగిలి ఉంది. నవంబర్ 8 నాటి సంచలన ప్రకటనతో, దేశంలోని మొత్తం కరెన్సీ నోట్ల విలువలో ఏకంగా 86.4% వాటా కలిగిన 1000, 500 నోట్లు ఒక్కసారిగా చెల్లుబాటు కాకుండా పోయాయి. అయితే ఈ మొత్తం తిరిగి చలామణిలోకి ఎప్పుడొస్తుందో అన్న ప్రశ్నకు మాత్రం ఇంతవరకు సరైన సమాధానం దొరకడం లేదు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వార్షిక నివేదిక–2016 ప్రకారం దేశంలోని కరెన్సీ ముద్రణ కేంద్రాల సామర్థ్యం, ప్రస్తుత నోట్ల పంపిణీ రేటును పరిగణనలోకి తీసుకుంటే ప్రధాని కోరిన గడువు నాటికి పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం తిరిగి ఎన్ని నోట్లను చలామణిలోకి తెస్తుందనే దానిపై దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంలకు అవసరమైన నగదు చేరే సమయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లను(రద్దు చేసిన నోట్ల విలువ కంటే 35 శాతం తక్కువ) చలామణిలోకి తేవాలనుకుంటే.. అందుకు 2017 మే వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ రద్దయిన మొత్తం 14 లక్షల కోట్లను చలామణిలోకి తేవడానికి 2017 జూలై మధ్య వరకు సమయం పడుతుంది. మరోవైపు చిల్లర సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. రూ.2వేల నోటుకు చిల్లర దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.500 నోట్లు తగిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
మరో ఐదు నెలలు..: నగదును చలామణిలోకి తెచ్చే క్రమంలో ఓ ముఖ్యమైన నిబంధన అనుసరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం చలామణి నగదులో రూ.2 వేల నోట్లు గరిష్టంగా సగం ఉండాలి(తగిన స్థాయిలో చిల్లర లేకుంటే, ప్రస్తుతం మాదిరి రూ.2 వేల నోటుకు చిల్లర దొరకడం కష్టమౌతుంది.) మిగిలిన సగం చిన్న నోట్లు ఉండాలి(ఆర్బీఐ వివరాల ప్రకారం చలామణిలో ఉన్న రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్ల విలువ రూ. 2.19 లక్షల కోట్లు.). రూ.2 వేల నోట్ల విలువను ‘ఏ’గా, రూ.500 నోట్ల విలువను ‘బి’గా అనుకుంటే.. దీన్ని గణిత సమీకరణంగా రాస్తే.. ఏ= బీ+(రూ.100, అంతకన్నా చిన్న నోట్ల విలువ )గా చెప్పవచ్చు. దీని ప్రకారం రూ.9 లక్షల కోట్లను చలామణిలోకి తీసుకురావాలంటే కనీసం 681 కోట్ల రూ.500 నోట్లను ముద్రించాల్సిన అవసరం ఉంది. ఇందుకు 2017 మార్చి 10 వరకు సమయం పడుతుంది. అదే రూ.14 లక్షల కోట్లను చలామణిలోకి తీసుకురావాలంటే.. 1181 కోట్ల రూ.500 నోట్లు అవసరం ఉంది. ఇందుకు 2017 జూలై 8 వరకు సమయం పడుతుంది. మొత్తంగా నగదు సరఫరా, బ్యాంకులు పంపిణీ చేసే సమయా న్ని పరిగణనలోకి తీసుకుంటే రూ.9 లక్షల కోట్లు చలామణిలోకి రావాలంటే 2017 ఏప్రిల్ వరకు ఆగాల్సిందే. అదే రూ.14 లక్షల కోట్లు చెలామణిలోకి రావడానికి జూలై మధ్య వరకు సమయం పడుతుంది.
ముఖ్యాంశాలు
1. ఆర్బీఐ నోటు ముద్రణ కేంద్రాలు: 1. దేవాస్ (మధ్యప్రదేశ్), 2. నాసిక్(మహారాష్ట్ర), 3.సాల్బోని (పశ్చిమ బెంగాల్), 4.మైసూరు (కర్ణాటక)
2.ఆర్బీఐ వార్షిక నివేదిక–2016 (పేజీ–90) ప్రకారం ఈ నాలుగు కేంద్రాల వార్షిక ముద్రణ సామర్థ్యం 2,670 కోట్ల నోట్లు. అంటే రోజుకు సుమారు 7.4 కోట్ల నోట్లను ముద్రించగలవన్నమాట.
3. ఒకవేళ ఈ ముద్రణ కేంద్రాలు రెండు కాకుండా మూడు షిఫ్టులు పనిచేస్తే రోజుకు 11.1 కోట్ల నోట్లను ముద్రించగలుగుతాయి.
4. దేశంలోని కరెన్సీ ముద్రణ కేంద్రాల్లో సగానికంటే తక్కువ మెషీన్లకు పెద్దనోట్లకు (రూ.500. ఆపైన) అవసరమైన సెక్యూరిటీ ఫీచర్లను ముద్రించే సామర్థ్యం ఉంది. పెద్ద నోట్లను ముద్రించే ఈ మెషీన్లన్నీ 24 గంటలూ కేవలం 500 రూపాయల నోట్లనే ముద్రిస్తే రోజూ 5.56 కోట్ల రూ.500 నోట్లను ముద్రించవచ్చు. అంటే రూ.500 నోట్ల రూపంలో రోజుకు రూ.2,778 కోట్లను ముద్రించవచ్చు.
5. ఆర్బీఐ వివరాల ప్రకారం రద్దయిన నోట్ల రూపంలో డిసెంబర్ 10 నాటికి బ్యాంకుల్లో 12.44 లక్షల కోట్లు జమయ్యాయి. ఇప్పటివరకూ 4.61 లక్షల కోట్ల కొత్త నోట్లు జారీ అయ్యాయి.
– సాక్షి సెంట్రల్ డెస్క్