ఆర్బీఐకి ఘోర అవమానం! | RBI staff writes to Governor Urjit Patel | Sakshi
Sakshi News home page

ఆర్బీఐకి ఘోర అవమానం!

Published Sat, Jan 14 2017 9:57 AM | Last Updated on Tue, Sep 5 2017 1:16 AM

ఆర్బీఐకి ఘోర అవమానం!

ఆర్బీఐకి ఘోర అవమానం!

ముంబై: నోట్ల రద్దు అనంతర పరిణామాలపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల రద్దు విషయంలో ఇప్పటికే అప్రతిష్టపాలైన ఆర్బీఐలో.. కేంద్ర ప్రభుత్వం మరింతగా జోక్యం చేసుకోవడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఆర్బీఐలో పనిచేస్తోన్న దాదాపు 18 వేల మంది అధికారులు, ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు శుక్రవారం ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ఘాటు లేఖ రాశాయి. నగదు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారులను నియమించడం ఆర్బీఐకి ఘోర అవమానమంటూ నిరసన తెలిపాయి.

1935లో ఆర్బీఐ ప్రారంభమైన నాటి నుంచి ఎనిమిది దశాబద్దాలకుపైగా స్వతంత్రప్రతిపత్తతో వ్యవహరించిందని, అలాంటి సంస్థ ప్రతిష్ఠ నేడు(నోట్ల రద్దుతో) మసకబారిందని ఉద్యోగులు తమ లేఖలో అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు విషయంలో సమర్థవంతంగా వ్యవహరించని కారణంగా ఆర్బీఐ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాఖ అధికారులు వచ్చి పెత్తనం చెలాయించాలనుకోవడం అవమానకరమని లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐ ప్రతిష్ఠను దిగజార్చే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని తెలిపారు. ‘ది యూనియన్‌ ఫోరం ఆఫ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌’ పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం బ్యాంకింగ్‌, ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశమైంది.
(ఆర్‌బీఐ స్వేచ్ఛను కాపాడాలి: బిమల్‌ జలాన్‌)

గవర్నర్‌కు పంపిన లేఖపై ఆల్‌ ఇండియా రిజర్వ్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ బాధ్యుడు సమీర్‌ ఘోష్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సూర్యకాంత్‌ మహాదిక్‌, ఆల్‌ ఇండియా రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ తరఫున సి.ఎం.ఫౌజిల్‌, ఆర్బీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ తరఫున ఆర్‌.ఎన్‌.వత్స తదితరులు సంతకాలు చేశారు. ఆర్బీఐలో నగదు నిర్వహణకు ఆర్థిక శాఖ తరఫున అధికారిని నియమించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఆర్బీఐ మాజీ గవర్నర్లు బిమల్‌ జలాన్‌, వైవీ రెడ్డి, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు ఉషా థొరాట్‌, కె.సి.చక్రవర్తి తదితరులు బాహాటంగానే తమ నిరసన తెలియజేశారు. అధికారులు, ఉద్యోగుల లేఖపై ఆర్బీఐ గవర్నర్‌ స్పందన తెలియాల్సిఉంది. (నోట్లరద్దుకు కారణాలేంటి?)
(ఇదో ముక్కోణపు కథ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement