2000 నోట్ల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ
2000 నోట్ల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ
Published Wed, Apr 5 2017 4:35 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
న్యూఢిల్లీ : నకిలీ కరెన్సీ నిర్మూలనకు, బ్లాక్ మనీపై ఉక్కుపాదానికి 500, 1000 రూపాయి నోట్లను రద్దు చేసి కొత్తగా మార్కెట్లోకి 2000 కరెన్సీ నోట్లను ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త 2000 కరెన్సీ నోట్లలో కూడా నకిలీవి రూపొందుతుండటంతో, ఏ క్షణంలోనైనా ఈ నోటును రద్దు చేయనున్నారంటూ మార్కెట్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ రూమర్లను ప్రభుత్వం కొట్టిపారేసింది. కొత్త 2000 రూపాయి కరెన్సీ నోట్లను రద్దు చేసే ఆలోచనేమి లేదని స్పష్టం చేసింది. నకిలీ కరెన్సీని తాము సీజ్ చేశామని, దీంతో కొత్త 2000 రూపాయి నోట్లను రద్దు చేయబోతున్నట్టు రూమర్లు వస్తున్నాయని హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజూ తెలిపారు. కానీ అలాంటి ఉద్దేశ్యాలేమీ లేవని చెప్పారు. ఆ రూమర్లకు అనుగుణంగా తామేమి వెళ్లమని స్పష్టీకరించారు.
ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు మధుసూదన్ మిస్త్రీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ విషయం తెలియజేశారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ లో నకిలీ కరెన్సీని ఎక్కువగా పట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. కానీ నకిలీ కరెన్సీలు గుర్తించలేకపోతున్నామన్నది కరెక్ట్ కాదని తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనంతరం తక్కువ క్వాలిటీ పేపర్ తో రూపొందిన నకిలీ కరెన్సీ నోట్లు మార్కెట్లోకి వచ్చాయని, ఆ తర్వాత మరింత క్వాలిటీ పేపర్ తో ఇవి మార్కెట్లోకి వస్తున్నాయని రిజిజూ పేర్కొన్నారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో కొత్త నోట్లను కాఫీ చేయడం వారికి కుదరదని తెలిపారు. చాలా కొత్త సెక్యురిటీ ఫీచర్లతో కరెన్సీ నోట్లు మార్కెట్లోకి వచ్చాయని, 100 శాతం కాఫీ చేయడం ఎవరికి సాధ్యం కాదని తాము హామీ ఇస్తున్నట్టు వివరించారు. నకిలీ కరెన్సీని నిర్మూలించడానికి ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉందని, నకిలీ కరెన్సీ తయారీ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని హెచ్చరించారు.
Advertisement
Advertisement