adar link
-
పాన్–ఆధార్ అనుసంధానానికి గడువు పెంపు
న్యూఢిల్లీ: పాన్, ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు నిర్దేశించిన గడువును ప్రభుత్వం మరో మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగించింది. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే, ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకునేందుకు ప్రజలకు మరింత సమయం ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలు సహా పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్స్‌పేయర్లకు మరికాస్త సమయం ఇచ్చే క్రమంలో పాన్, ఆధార్‌ను లింక్ చేసుకునేందుకు గడువు తేదీని 2023 జూన్ 30 వరకు పెంచినట్లు ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత గడువులోగా వీటిని లింకు చేసుకోని వారి పాన్ నంబర్లు జూలై 1 నుంచి పనిచేయవు. దీని వల్ల ట్యాక్స్‌పేయర్లు ట్యాక్స్ రీఫండ్లను గానీ వాటిపై వడ్డీలను గానీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు. అలాగే వారికి టీడీఎస్, టీసీఎస్ భారం కూడా ఎక్కువగా ఉంటుంది. పాన్, ఆధార్ అనుసంధానానికి ప్రభుత్వం డెడ్‌లైన్‌ను పలు దఫాలు పొడిగిస్తూ వస్తోంది. వాస్తవానికి గతేడాది (2022) మార్చి ఆఖరు నాటికే పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని తొలుత గడువు విధించారు. అది దాటాకా 2022 ఏప్రిల్ 1 నుంచి రూ. 500 జరిమానా ప్రతిపాదించారు. దాన్ని గతేడాది జూలై 1 నుంచి రూ. 1,000కి పెంచారు. ప్రస్తుతం ఇదే పెనాల్టీ అమలవుతోంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్లు (పర్మనెంట్ అకౌంటు నంబర్) ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. -
‘ఆధార్–ఓటర్ ఐడీ లింక్’పై హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్– ఓటరుకార్డు అనుసంధానంపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టు సూచించింది. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలో వివాదాస్పద అంశాలున్నాయంటూ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. ఆధార్‌తో ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానంతో పౌరులు కాని వారికి కూడా ఓటు వేసే హక్కు ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం..‘మీరు ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వచ్చే 6 నెలల్లో మూడు రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు జరగనున్నందున తమ పిటిషన్ ఎంతో ముఖ్యమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పలు హైకోర్టుల్లో ప్రొసీడింగ్స్ ఉంటే కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వాటన్నింటినీ కలిపి ఒకే హైకోర్టుకు బదిలీ చేసే ఆస్కారం ఉందని ధర్మాసనం పేర్కొంది. ‘ఎన్నికల సవరణచట్టం–2021లోని సెక్షన్లు 4, 5ల చెల్లుబాటును పిటిషనర్ సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో దీనికి సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ధర్మాసనం, హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇస్తున్నామని పేర్కొంది. -
రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్/ఆధార్
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్‌ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు. -
పాన్–ఆధార్ లింక్ చేయకపోతే పెనాల్టీ
న్యూఢిల్లీ: ఆధార్‌తో పాన్ అనుసంధానానికి ఇచ్చిన గడువు గురువారం (మార్చి 31)తో ముగియనుంది. గడువులోపు అనుసంధానించుకోని వారు (లింకింగ్) ఆ తర్వాత రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గడువులోపు ఆధార్‌తో పాన్ లింకింగ్ చేసుకోని వారికి కాస్త ఉపశమనం కల్పించింది. 2023 మార్చి 31 వరకు పాన్ పనిచేస్తుందని ప్రకటించింది. అప్పటికీ అనుసంధానం చేసుకోకపోతే పాన్ పనిచేయకుండా (ఇన్ ఆపరేటివ్) పోతుంది. ‘‘2022 జూన్ 30 వరకు పాన్–ఆధార్ లింకింగ్ చేసుకుంటే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుసంధానించుకుంటే రూ.1,000 జరిమానా ఉంటుంది’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా పాన్–ఆధార్ లింకింగ్ గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఆలస్యపు రుసుములతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుసంధానించుకోడంలో విఫలమైతే పాన్ పనిచేయదు. దీంతో పన్ను రిటర్నులకు సంబంధించి పాన్ అందుబాటులో ఉండదు. కనుక పన్ను చెల్లింపుదారులు అందరూ ఒక్కసారి తమ పాన్, ఆధార్‌తో అనుసంధానమైందీ, లేనిదీ ఆదాయపన్ను శాఖ పోర్టల్‌కు వెళ్లి పరిశీలించుకోవాలి’’ అని పేర్కొన్నారు. అన్నింటికీ పాన్ అవసరమే.. ఆదాయపన్ను రిటర్నులు దాఖలుతోపాటు ఇతర ఐటీ వ్యవహారాలకు (రిఫండ్లు తదితర) ఇక మీదట పాన్ ను ఆధార్‌తో అనుసంధానించుకోవడం తప్పనిసరి అని నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, స్థిరాస్తి కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి. దీంతో పాన్ పనిచేయకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘‘ఒక్కసారి పాన్ పనిచేయకుండా పోతే, ఆర్థిక లావాదేవీలు (ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులు) నిర్వహించడానికి అవకాశం ఉండదు. సెక్షన్ 171బీ కింద జరిమానాతోపాటు, అధిక టీడీఎస్ ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అగర్వాల్ వివరించారు. గడువులోపు ఏౖదైనా సమస్య వల్ల అనుసంధానం చేసుకోని వారు ఆలస్యపు రుసుము చెల్లించి అయినా 2023 మార్చి 31లోపు లింక్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే పాన్ పనిచేయకుండా పోతుందని గుర్తుంచుకోవాలి. 2022 జనవరి 24 నాటికి 43.34 కోట్ల పాన్లు ఆధార్‌తో లింక్ అయ్యాయి. ఇప్పటి వరకు 131 కోట్ల ఆధార్లు జారీ అయ్యాయి. -
పాన్–ఆధార్ గడువు మరో 3 నెలలు
న్యూఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాన్)తో ఆధార్‌ను అనుసంధానించేందుకు నిర్దేశించిన డెడ్‌లైన్‌ను కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. జూన్ 30 దాకా దీన్ని పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. మరోవైపు, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ స్కీమ్’ గడువు మార్చి 31తో ముగిసింది. వాస్తవానికి డిక్లరేషన్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 28, చెల్లింపులు జరిపేందుకు మార్చి 31 ఆఖరు తేదీలు. అయితే, ఆదాయ పన్ను శాఖ ఈ డెడ్లైన్లను గతంలో పొడిగించింది. దీని ప్రకారం డిక్లరేషన్ల దాఖలుకు మార్చి 31తో గడువు ముగిసింది. ఏప్రిల్ 30లోగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద ఫిబ్రవరి 22 దాకా సుమారు రూ. 98,328 కోట్ల విలువ చేసే పన్ను వివాదాలకు సంబంధించి 1.28 లక్షల డిక్లరేషన్లు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గత నెలలో లోక్‌సభకు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ. 53,346 కోట్లు ఖజానాకు వచ్చాయి. గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. -
ఈకేవైసీ నమోదు చేయకున్నా రేషన్
సాక్షి, అమరావతి: ఆధార్ నమోదు వ్యవహారం ప్రహసనంలా మారింది. ఈకేవైసీ నమోదులో భాగంగా ఆధార్ నమోదు కేంద్రాలపై ఒత్తిడి పెరగ్గా అందుకు తగ్గ కేంద్రాలు లేకపోవడం... ఉన్నవి కాస్తా మూతపడటం... వాటిని పునరుద్ధరించేందుకు ఉడాయ్ స్పందించకపోవడం ఈ సమస్యకు కారణ మైంది. ఇప్పుడు ఆధార్ నమోదుకోసం జనం కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. పరిస్థితిని గమనించిన అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఈకేవైసీ నమోదుకు గడువు లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులకు పాఠశాలల్లోనే నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈకేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ సరుకులు ఇవ్వరన్నది వాస్తవం కాదని, నమోదు చేయించుకోకున్నా రేషన్ ఇస్తామని సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15ఏళ్ల వరకు ఉన్న వారికి పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు, అప్డేట్ చేయించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తర్వాత రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చని చెప్పారు. వీరంతా ఆధార్ నమోదు కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చనీ స్పష్టం చేశారు. 15సంవత్సరాలు దాటిన వారు ఆధార్ కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, రేషన్ డీలరే ఈకేవైసీ చేస్తారనీ, ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని కోరారు. -
‘ఆధార్’ ఉంటేనే ఎరువులు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఎరువుల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. ఇకపై ఆధార్ ఉంటేనే రైతులకు ఎరువులను సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ నేటి నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల డీలర్లలకు ఆపరేటింగ్ సెల్ మిషన్ల (పీవోఎస్)ను అందజేశారు. అన్ని ఎరువుల దుకాణాల యజమానులు ఈ ప్రక్రియను జనవరి నుంచి కచ్ఛితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సు రద్దు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా ఈ పద్ధతి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 1,05,600 మంది రైతులు ఉన్నారు. లక్షా 97 వేల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 32 వేల హెక్టార్లలో పత్తి, 23 వేల హెక్టార్లలో సోయా, 19 వేల హెక్టార్లలో కందులు, 5 వేల హెక్టార్లలో జొన్న, 2 వేల హెక్టార్లలో మినుములు, 16 వందల హెక్టార్లలో పెసరి, 3 వేల హెక్టార్లలో ఇతర పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల యూనియా, 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 15 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 5 వేల మెట్రిక్ టన్నుల పొటాషియం, 5 వేల మెట్రిక్ టన్నుల పాస్పరస్ అవసరం అవుతుంది. అలాగే రబీ సీజన్లో 4,700 మెట్రిక్ టన్నుల యూరియా, 2780 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1900 మెట్రిక్ టన్నుల పొటాషియం, 3,400 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఎప్పటికప్పుడు సమాచారం.. పీవోఎస్ మిషన్లలో రైతుల ఆధార్ నంబర్, వారి పంట భూమి వివరాలను నమోదు చేశారు. రై తుకున్న వ్యవసాయాన్ని బట్టి మాత్రమే ఎరువులలు ఇస్తారు. ఆధార్‌కార్డు లేకుంటే ఎరువులను విక్రయించరు. జిల్లాకు ఎన్ని ఎరువులు వచ్చాయి.. ఎన్ని మంది రైతులు ఏయే ఎరువులు కొ నుగోలు చేశారు. ఇంకా ఎంత స్టాక్ ఉందనే వివరాలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తోంది. విక్రయించిన ఎరువులకు మాత్రమే డీలర్లకు సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. 135 మందికి పీవోఎస్ మిషన్లు.. జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 135 మంది డీలర్లకు పాయింట్ ఆఫ్ సెల్ మిషన్లను పంపిణీ చేశారు. ఇంకా 85 మంది డీలర్లకు పంపిణీ చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో మిగతా డీలర్లకు పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పీవోఎస్ మిషన్ల ద్వారా ఎరువుల సరఫరా వల్ల అక్రమాలను నివారించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు యూరియా, డీఏపీ ఇతర ఎరువులను ఆయా కంపెనీలు సబ్సిడీ ధరలకే రైతులకు విక్రయిస్తున్నారు. కొంత మంది డీలర్లు రైతులకు విక్రయించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువులు విక్రయించకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే సబ్సిడీ వారి అకౌంట్లలో జమ అవుతుంది. ఇకనుంచి ఇలాంటి అక్రమాలకు చెక్ పడనుంది. నేటి నుంచి అమలు.. ఎరువుల పంపిణీకి ఆధార్ అనుసంధానం పూర్తి చేయడం జరిగింది. నేటి నుంచి అ మలు చేస్తున్నాం. జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. 135 మందికి పీ వోఎస్ మిషన్లు అందజేశాం. మిగతా వారికి రెండు, మూడు రోజుల్లో అందజేస్తాం. శిక్షణ కూడా ఇచ్చాం. పీవోఎస్ అమలు చేయని డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తాం. -ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో.. రైతులు 1,05,600 సాధారణ సాగు విస్తీర్ణం 1,97,000 హెక్టార్లు ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఎరువుల విక్రయాలు (మెట్రిక్ టన్నులలో) యూరియా 35 వేలు డీఏపీ 10 వేలు కాంప్లెక్స్ ఎరువులు 15 వేలు పొటాషియం 5 వేలు పాస్పరస్ 5 వేలు రబీలో అవసరమయ్యే ఎరువులు యూరియా 4,700 డీఏపీ 2780 పొటాషియం 1900 కాంప్లెక్స్ ఎరువులు 3,400 -
'రైల్వే పాస్‌లకు ఆధార్‌తో లింకుపెట్టం'
ఢిల్లీ: రైల్వే పాస్‌లకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రతిపాదనేదీ తమ వద్ద ప్రస్తుతం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. రైలు పాస్‌లున్న వారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం లేదంటూ ఆయన రైల్వే ఉద్యోగులు, పింఛనుదారులు మాత్రం ఏ పోర్టల్ నుంచైనా టికెట్లు బుక్ చేసుకునే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైలుపాస్లున్న వారికి కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పించే అవకాశాలను చూస్తున్నామని మంత్రి వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 13.30 లక్షల మంది రైల్వే శాఖ ఉద్యోగులకు పాస్‌లున్నాయని వెల్లడించారు. రైలు రద్దయిన సందర్భాల్లో టికెట్ రుసుమును వాపసు చేయటంలో కలుగుతున్న ఆలస్యాన్ని తగ్గించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.