సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్– ఓటరుకార్డు అనుసంధానంపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టు సూచించింది. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలో వివాదాస్పద అంశాలున్నాయంటూ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. ఆధార్‌తో ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానంతో పౌరులు కాని వారికి కూడా ఓటు వేసే హక్కు ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం..‘మీరు ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వచ్చే 6 నెలల్లో మూడు రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు జరగనున్నందున తమ పిటిషన్ ఎంతో ముఖ్యమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పలు హైకోర్టుల్లో ప్రొసీడింగ్స్ ఉంటే కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వాటన్నింటినీ కలిపి ఒకే హైకోర్టుకు బదిలీ చేసే ఆస్కారం ఉందని ధర్మాసనం పేర్కొంది. ‘ఎన్నికల సవరణచట్టం–2021లోని సెక్షన్లు 4, 5ల చెల్లుబాటును పిటిషనర్ సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో దీనికి సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ధర్మాసనం, హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇస్తున్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment